గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Oct 12, 2020 , 00:57:19

కాంగ్రెస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి

దుబ్బాక : ఎన్నికల్లో మాత్రమే కనబడే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఆదివారం రాత్రి ఎనగుర్తి, హబ్షీపూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీతోపాటు ఎమ్మెల్సీ పారుఖ్‌ హుస్సెన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాన కాలంలో వచ్చే ఊసిర్ల మాదిరిగా కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు వచ్చిపోతారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో ఆ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, ఎంపీపీ పుష్పలత, వైస్‌ ఎంపీపీ అస్క రవి, మాజీ జడ్పీటీసీ రాజలింగంగౌడ్‌, నాయకులు రాజమౌళి, వెంకటపతి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

రాయపోల్‌ : దుబ్బాక నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని, ఈ ఉప ఎన్నిక  ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం కావాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని సయ్యద్‌ నగర్‌, రామారం, గొల్లపల్లి, టెంకంపేట, రాంసాగర్‌ గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ రాజిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ శివుడు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.