శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:17

దౌల్తాబాద్‌ గడ్డ.. టీఆర్‌ఎస్‌ అడ్డా..

దౌల్తాబాద్‌ గడ్డ.. టీఆర్‌ఎస్‌ అడ్డా..

 దౌల్తాబాద్‌ : సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం ఉద్యమాల గడ్డ అని, టీఆర్‌ఎస్‌ పార్టీని ఈ ప్రాంత ఎప్పుడూ ఆదరిస్తున్నదని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్వీ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉప ఎన్నికల మద్దతు సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ పారూఖ్‌ హుస్సేన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానకాలంలో పుట్టుకొచ్చే ఉసిళ్లలాగా.. ఎన్నికలప్పుడే వచ్చే కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ వారు కనబడరని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకునేది కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. 

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనేక అభివృద్ధి పనులు చేశారని, ఇంటింటికీ నల్లా నీళ్లను అందించి ఆడవారికి అండగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే సేవలు అందించడానికి వస్తున్న సోలిపేట సుజాతక్కను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్‌, ప్రజాబలం ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రణంజ్యోతి, జిల్లా కో- ఆప్షన్‌ సభ్యుడు రహీమొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్‌, నాయకులు నర్ర రాజేందర్‌, ఖాలీలొద్దీన్‌, టీఆర్‌ఎస్వీ మండల నాయకులు సుచిత్‌గౌడ్‌, సంబరపు నాగరాజు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


పబ్బం గడుపుకోవడానికే పూటకో మాట..

గజ్వేల్‌ అర్బన్‌/రాయపోల్‌ : పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్‌, బీజేపీ చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాగునీరు.. సాగునీటి కరువుతో అల్లాడిన దుబ్బాక నియోజకవర్గంలో ఇంటింటికి గోదావరి తాగునీటి జలాలను ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదేని అన్నారు. గురువారం గజ్వేల్‌ రింగురోడ్డులోని శోభ గార్డెన్స్‌లో రాయపోల్‌ మండ లం తిమ్మక్కపల్లి, కొత్తపల్లి, లింగారెడ్డిపల్లి, వడ్డేపల్లి, ముంగీస్‌పల్లి గ్రామాలకు చెందన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలను ప్రేమగా, అభిమానంగా చూసుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించడమే పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్‌ నేర్పించారన్నారు. బీజేపీ నాయకులు మాత్రం కేవలం తిట్టడానికి మాత్రమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ వాళ్లు బోరు మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చి, రైతులను గోసపెట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ దేశంలోనే గొప్ప నాయకుడని చెరుకు ముత్యంరెడ్డి ఆనాడే అన్నారని, తన కడుపుమీద కొట్టిన కాంగ్రెస్‌ వల్ల తన ఆత్మక్షోభిస్తున్నదని చెప్పేవారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు.

మరి ఆయన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి నిన్నటికి నిన్న కేసీఆర్‌తోనే అభివృద్ధి జరిగిందని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి, ఏం అభివృద్ధి జరుగడం లేదనడం చెప్పడం వల్ల ముత్యంరెడ్డి ఆత్మక్షోభిస్తుందన్నారు. కాంగ్రెస్‌లో చేరగానే విమర్శలు మొదలయ్యాయని చెప్పారు. త్వరలో జరుగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, రాయపోల్‌ మండల ఎన్నికల ఇన్‌చార్జి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, మాదాసు శ్రీనివాస్‌, దౌల్తాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, జడ్పీటీసీ యాదగిరి, వైస్‌ ఎంపీపీ రాజిరెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీతోనే మేలు..

తొగుట : ఎన్నికలప్పుడు వచ్చి పోయే రాజకీయ పార్టీలను నమ్మవద్దని, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేసే టీఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేటలోని ఆయన నివాసంలో మంత్రి, ఎంపీ కేపీఆర్‌, దుబ్బాక అభ్యర్థి సుజాత సమక్షంలో తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు చిలువేరి రాంరెడ్డితో పాటు బీజేపీ ఘనపూర్‌ గ్రామాధ్యక్షుడు మరుపల్లి బాలకిషన్‌ గౌడ్‌, నాయకులు చిలువేరి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నం సిధారెడ్డి, భూపతిరెడ్డి, వికాస్‌రెడ్డి, యాటిల్లి రాజు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందని, బీజేపీని ప్రజలు నమ్మరన్నారు. సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరుతున్న వారికి పాత వారితో కలిసి సమాన ప్రాధాన్యమిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రొట్టె రాజమౌళి, రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు దేవీ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo