శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:45

ప్రాపర్టీ నమోదు దేశంలోనే మొదటిది

ప్రాపర్టీ నమోదు దేశంలోనే మొదటిది

  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 
  • మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తుల నమోదు పూర్తి చేయాలి 

సిద్దిపేట కలెక్టరేట్‌ :  ప్రాపర్టీ నమోదు ప్రక్రియ దేశంలోనే మొదటిదని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు.  ప్రజల భాగస్వామ్యం, పక్కా ప్రణాళికతో సిద్దిపేట మున్సిపాలిటీలో 5 రోజుల్లో వంద శాతం ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గడువులోగా పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సిద్దిపేట విపంచి అడిటోరియంలో మున్సిపల్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 37 బృందాలతో ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రగతిని కలెక్టర్‌ సమీక్షించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారికంగా 28,563 ప్రాపర్టీలు ఉండగా ఇప్పటి వరకు కేవలం 2302 ప్రాపర్టీలు మాత్రమే నమోదు చేయడంపై కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్‌, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆస్తుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీం సభ్యులకు మార్గదర్శనం చేశారు. 

ధరణితో భద్రత.. కచ్చితత్వం..

ఆస్తులను ధరణి యాప్‌లో పొందుపర్చడం ద్వారా భద్రత, కచ్చితత్వం ఉంటుందన్నారు. పట్టణాల్లో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలరు పాసుబుక్‌లు జారీ చేస్తామన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బృందాలు కృషి చేయాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు రెండు విడుతలుగా చేపట్టాలన్నారు. ప్రతీ బృందం రోజు కనీసం 50 ప్రాపర్టీలను నమోదు చేయాలన్నారు. 6 వార్డులకు ఒక్కో పర్యవేక్షకుడిని నియమిస్తామన్నారు. చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట తహసీల్దార్లు, ఏపీఎంలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. 

రోజువారీ నివేదిక ఇవ్వాలి..

ఆస్తుల నమోదు ప్రక్రియ పురోగతిని అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ సమీక్షిస్తూ రోజువారి ప్రగతిని తనకు నివేదించాలన్నారు. మరణించిన వ్యక్తి పేరుపై ఉన్న ప్రాపర్టీలు, రికార్డులు సక్రమంగా లేని, వివాదం ఉన్న ప్రాపర్టీ వివరాలను ఆఫ్‌లైన్‌లో సేకరించి సంబంధిత వివరాలను ప్రత్యేకంగా సేకరించాలన్నారు. ధరణి యాప్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే వెంటనే పైఅధికారులకు తెలియజేయాలన్నారు. గడువులోగా నమోదును విజయవంతం చేసేలా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. 

 ముగ్గురు అధికారులకు పర్యవేక్షణకు బాధ్యతలు 

 చేర్యాల :  గురువారం రాత్రి చేర్యాల పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఆస్తుల నమోదు బృందాలతో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రక్రియ ప్రగతిపై సమీక్షంచారు. చేర్యాల మున్సిపాలిటీలో 5 రోజుల్లో వందశాతం నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆధికారులకు ఆదేశించారు. నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జి కమిషనర్‌ రామలక్ష్మికి 6 వార్డులు, తహసీల్దార్‌ శైలజకు 3, ఎంఈవో రాములుకు 3 వార్డులను కలెక్టర్‌ కేటాయించారు. 

 ఐదు రోజుల్లో  ఆస్తుల నమోదు పూర్తి చేయాలి

గజ్వేల్‌/ గజ్వేల్‌ అర్బన్‌ :  గజ్వేల్‌ ఐవోసీలోని గడా సమావేశ మందిరంలో మున్సిపల్‌ పరిధిలోని ఆస్తుల నమోదు బృందాలతో ఆస్తుల నమోదు ప్రక్రియను కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ,  కమిషనర్‌ కృష్ణారెడ్డి  పాల్గొన్నారు. 

VIDEOS

logo