గురువారం 26 నవంబర్ 2020
Siddipet - Oct 08, 2020 , 01:16:58

డబ్బుల కోసం ఇరువురి ఘర్షణ

డబ్బుల కోసం ఇరువురి ఘర్షణ

  •   అడ్డుకోబోయిన భార్యకు కత్తిపోట్లు

నారాయణఖేడ్‌ : అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కత్తితో దాడికి యత్నించడాన్ని అడ్డుకోబోయిన భార్య కత్తిపోట్లకు గురైన సంఘటన మంగళవారం సాయంత్రం నారాయణఖేడ్‌ పట్టణంలో జరిగింది. ఎస్సై సందీప్‌ వివరాల ప్రకారం.. పట్టణంలోని సువర్ణ థియేటర్‌ రోడ్డు ప్రాంతంలో జనుముల వీరేశం తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అదే ఇంట్లో బ్రహ్మచారి కూడా నివాసముండగా, తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.30 వేలను తిరిగి ఇవ్వాలని వీరేశం, బ్రహ్మచారిని అడగడంతో ఆగ్రహించిన బ్రహ్మచారి కత్తితో వీరేశంపై దాడికి యత్నించాడు. ఇదే క్రమంలో వీరేశం భార్య అడ్డుకోవడంతో అదే కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఆమెకు రెండు చోట్ల కత్తిపోట్లు కాగా, చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న బ్రహ్మచారి హైదరాబాద్‌ వెళ్లేందుకు రాజీవ్‌చౌక్‌ వద్ద వేచి ఉన్నాడనే సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అరెస్టు చేసి, కత్తిని స్వాధీనం చేసుకుని విచారించారు. వీరేశం వద్ద అవసరాల నిమిత్తం రూ.30 వేలు తీసుకున్నానని, తిరిగి ఇవ్వమని అడిగినందుకు హత్య చేసేందుకు యత్నించానని నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.