మంగళవారం 19 జనవరి 2021
Siddipet - Oct 07, 2020 , 03:04:06

ఉద్యమ కుటుంబానికి అండగా...

ఉద్యమ కుటుంబానికి అండగా...

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్‌ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని అటు పార్టీ.. ఇటు ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర సోలిపేట రామలింగారెడ్డి సొంతం. టీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంతో పాటు ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషిచేశారు. చివరి శ్వాస వరకు ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. అలాంటి నేత కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచి, తగిన న్యాయం చేశారని అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓటర్లు అంటుండగా.. తాము అండగా ఉంటామని గులాబీ క్యాడర్‌, అభిమానులు ముందుకు వస్తున్నారు.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల ప్రాత్ర పోషించిన సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టానికి అంకితభావంతో కృషిచేశారు. ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేసిన ఆయన, చివరి శ్వాస వరకు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. సరిగ్గా రెండు నెలల కిందట అనారోగ్యంతో సోలిపేట రామలింగారెడ్డి మృతిచెందారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చేరుకొని రామలింగారెడ్డి అంత్యక్రియలకు హాజరై భావోద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకొని సీఎం కేసీఆర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుమారుడు సతీశ్‌ను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఉప ఎన్నికల్లో వారి కుటుంబానికి టిక్కెట్టు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సోలిపేట సుజాత పేరును ప్రకటించి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎం నిర్ణయంపై నియోజకవర్గంలో అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడుతున్నారు. ఈ నిర్ణయంపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమాల గడ్డ...  

 సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉద్యమాల గడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడారు ఈ ప్రాంత ప్రజలు . సీఎం కేసీఆర్‌ విద్యాబుద్ధులు నేర్చుకున్న ఈ గడ్డ...ఒక జర్నలిస్టును శాసనసభకు పంపిన నేల.. గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ప్రజలు ఆ పార్టీ వైపే ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డిని నాలుగు సార్లు శాసనసభకు పంపారు ఈ నియోజకవర్గ ప్రజలు. దుబ్బాక నియోజకవర్గం అంటేనే టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట. స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలు మొదలుకొని.. ఏ ఎన్నికలైనా ఎగిరేది ఇక్కడ  గులాబీ జెండానే అన్నట్లుగా మారింది. 

సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటు సోలిపేట  

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన అలుపెరగని పోరాటం చేశారు. 2004 లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఒక జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే వరకు రామలింగారెడ్డి ఎదిగారు.  రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు పోటీచేసి నాలుగు సార్లు విజయం సాధించారు. వరుసగా 2 సార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దుబ్బాక అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ, దుబ్బాక నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుంచారు. సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు సోలిపేట రామలింగారెడ్డికి. గత ప్రభుత్వాల హయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. పార్టీ మారలేదు. నా చేతిలో చిల్లిగవ్వ లేకున్నా నన్ను పిలిచి దొమ్మాట ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి ఇంతవాణ్ణి చేశాడని, మా నాయకుడు కేసీఆర్‌ అని రామలింగారెడ్డి పలు సందర్భాల్లో చెబుతుండేవారు. 

రామలింగారెడ్డి కుటుంబం వెంటే దుబ్బాక ప్రజలు..

 సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గాన్ని డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే ముందుస్థానంలో నిలిపారు సోలిపేట. పొద్దున్నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. దీంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆ కుటుంబం వెంటే ఉంటున్నారు. 

9నుంచి నామినేషన్ల స్వీకరణ..

సరిగ్గా రెండు నెలల కిందట అనారోగ్యంతో సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. దీంతో దుబ్బాకకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 9 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వచ్చే నెల 3న పోలింగ్‌ జరుగనున్నది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పేరును టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి ప్రకటించారు. 

ఉద్యమాల్లో, నియోజకవర్గ అభివృద్ధిలో రామలింగారెడ్డి కుటుంబం..

రామలింగారెడ్డి కుటుంబం ఉద్యమాల్లో, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకుంది. ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. దుబ్బాకలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సోలిపేట కుటుంబం ప్రాతనిధ్యం వహించడమే సమంజసమని సీఎం కేసీఆర్‌ ఉద్యమ కారుని కుటుంబానికి టికెట్‌ కేటాయించారు. సోలిపేట సుజాతకు పార్టీ టికెట్టు కేటాయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమకారుని కుటుంబానికి టికెట్‌ ఇచ్చి సీఎం కేసీఆర్‌ న్యాయం చేశారని పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యకం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో సోలిపేట సుజాతకు అనుబంధం ఉంది. గత ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేశారు. పేదల కష్టసుఖాల్లో ఆమె పాలుపంచుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టికెట్‌ కేటాయించడంపై సీఎం కేసీఆర్‌కు సుజాత కృతజ్ఞతలు తెలిపారు. 

 అందరినీ ఆదరించే టీఆర్‌ఎస్‌కే మా ఓటు..

అందరినీ ఆదరించే టీఆర్‌ఎస్‌ పార్టీకే మేము ఓటు ఏస్తాం. అందరినీ కలపుకొని పోయే దివంగత ఎమ్మెల్యే  రామలింగారెడ్డి సతీమణి సుజాతక్కను  భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సీఎం కేసీఆర్‌ సార్‌ అందిస్తున్న పథకాలు గరీబోల్లకు అందుతున్నాయి. ఏ పార్టోల్లు వచ్చినా ఓటు మాత్రం టీఆర్‌ఎస్‌కే ఏత్తం. -మద్దెల రాజయ్య. రైతు, మిరుదొడ్డి

సుజాతక్క ఎంబడి ఉంటాం..

బీదోల్లందరం టీఆర్‌ఎస్‌ ఎంటనే ఉంటాం. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతక్క ఎంబడి ఉంటూ గీ ఎలచ్చన్లో  గెలిపించుకుంటం.  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలోల్లు మస్త్‌ జెప్పుతరు. మేమైతే సీఎం కేసీఆర్‌ సార్‌ కారు గుర్తుకు ఓటేత్తం.  వేరేవాళ్లకు జెప్పుతాం. -కుంట నారాయణ రైతు మిరుదొడ్డి

 సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు

 ప్రజల మనిషిగా చివరి శ్వాస వరకు పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాకను ముందు వరుసలో నిలిపిన రామలింగారెడ్డి నేడు దూరం కావడంతో నాయకులు, కార్యకర్తలు ఎంతో వేధనకు గురయ్యారు.  కార్యకర్తలకు అండగా ఉండటానికి లింగన్న సతీమణి  సుజాతకు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ధన్యవాదాలు. సుజాతక్కకు ఎన్నికల్లో అండగా ఉండి భారీ మెజార్టీ అందించడానికి కృషి చేస్తాం. -మంతూరి రమేశ్‌ రైతు ఎల్‌ బంజేరుపల్లి, తొగుట  

కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది

 ఆపదలో అండగా నిలువడం సీఎం కేసీఆర్‌ నైజం. నాడు సాధారణ జీవితం గడుపుతున్న సోలిపేట రామలింగారెడ్డికి 28 మందిని కాదని 2004లో  అవకాశం కల్పించారు. 2009లో ఓటమి పాలైనా ఉద్యమ నేతగా గుర్తించి 2014 అవకాశం కల్పించారు. ప్రజల మధ్యనే ఉంటూ అభివృద్ధి, సంక్షేమంలో దుబ్బాకను ముందు వరుసలో నిలపడంతో 2018లో అవకాశం కల్పించారు.  రామలింగారెడ్డి మృతితో శోక సముద్రంలో ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు అండగా ఉండటానికి లింగన్న సతీమణి సుజాతక్కకు అవకాశం కల్పించడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది. -జహంగీర్‌ వ్యాపారి (వెంకట్‌రావుపేట), తొగుట 

 గా సార్‌ మంచి పనులు జేసిండు..

 సచ్చిపోయిన గా ఎమ్మెల్యే రామలింగారెడ్డి సార్‌ మంచి దానికి..శెడ్డ దానికి.. దేనికైనా అచ్చేటోడు. మా గరిబోళ్ల్లను మంచిగా జూసుకొని పనులుజేసేటోడు. గియ్యాల్ల ఎళ్లి పోయిండు.  సీఎం కేసీఆర్‌ సార్‌ రామలింగారెడ్డి సార్‌ భార్యకు సీటు ఇయ్యడం చాల కరెక్టు. సుజాతక్కకు  ఓటేసి గెలిపించుకుంటాం. ఎవ్వలేం సెప్పినా ఇనేది లేదు.. కారు గుర్తుకు ఓటేత్తం. -నర్మాల లక్ష్మీ మల్లయ్య, మహిళా రైతు, మిరుదొడ్డి