ఉపయోగం లేని కేంద్ర వ్యవసాయ బిల్లులు

గజ్వేల్ అర్బన్ : ఏమాత్రం రైతులకు ఉపయోగం లేని వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతులంతా ముక్తకంఠంతో కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు భరోసా కల్పించారన్నారు. వ్యవసాయ పథకాలతో పాటు రైతు కుటుంబాలకు కల్యాణలక్ష్మి, పింఛన్లు కూడా ఎంతో ఆసరాగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో రైతులు ఇప్పుడిప్పుడే గొప్పగా జీవించవచ్చని ఆశలు పెంచుకుంటే కేంద్రప్రభుత్వం కొత్త చట్టాలతో రైతుల నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం రైతులు తమకు అవసరమైన వాటిని ఎక్కడ నిలదీస్తారోనని ముందే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన కొత్త చట్టాలను తీసుకొచ్చి రైతులను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌మీటర్ల బిగింపు, రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడం, రైతుల ఉత్పత్తుల ధరలు నిర్ణయించుకుని, కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులను నిత్యావసరాల నుంచి తొలిగించడం వంటి చట్టాల వల్ల రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. కేంద్రం చేసిన చట్టాలు నచ్చని కేంద్రమంత్రులు కూడా రాజీనామా చేసినా బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడడం లేదన్నారు.
రైతుల శ్రేయస్సు కోరుకునే వారే అయితే వెంటనే నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఉపాధిహామీ పథకం ద్వారా రైతుకు సంబంధించి 50శాతం ఖర్చు భరించే విధంగా అన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించినట్లు రైతు ఆదాయం 2022వ సంవత్సరంలో రెట్టింపు చేయాలంటే ప్రధాన పంటలకు ప్రకటిస్తున్న ఎంఎస్పీని ప్రతి సంవత్సరం క్వింటాలుకు రూ.600లకు పెంచాలన్నారు. పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించి ఏదేని కారణం చేత పంటనష్టం జరిగితే నిర్ణీత సమయంలో పంట నష్టపరిహారం రైతుకు అందించేలా బీమా పథకం అమలు చేయాలన్నారు. రైతులు, రైతుకూలీలు అందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం, ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల విద్యకు, పెండ్లిళ్లకు సొంత పూచీకత్తుపై రూ.10లక్షల వరకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందించాలన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెద్ద ఎత్తున తగ్గించి రైతుకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు, రైతు కూలీల కుటుంబ సభ్యులకు రూ.10వేల చొప్పున పెన్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా రైతు శ్రేయస్సును కాంక్షించిన వారైతే కేంద్రప్రభుత్వం డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సవాల్ విసిరారు. తక్షణమే కేంద్ర వ్యవసాయ నూతన చట్టాలను ఉపసంహరించుకోకపోతే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, గజ్వేల్ ఇన్చార్జి తుమ్మ కృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ మల్లయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ మద్ది రాజిరెడ్డి, నర్సింగరావు, భూపతిరెడ్డి రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సత్యనారాయణ, భూలక్ష్మి వెంకట్‌గౌడ్, ప్రతాప్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్వచ్ఛంద ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్‌తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్‌తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి