ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 06, 2020 , 01:02:43

ఎత్తైన గుట్టలు... పచ్చని తివాచీ పరిచినట్లు వృక్షాలు...

ఎత్తైన గుట్టలు... పచ్చని తివాచీ పరిచినట్లు వృక్షాలు...

ఎత్తైన గుట్టలు... పచ్చని తివాచీ పరిచినట్లు వృక్షాలు... గుట్టపైకి వెళ్తుంటే చిన్నచిన్న జలపాతాలు... ఎక్కిచూస్తే కనుచూపు మేర కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు... ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి సోయగాలు... ఈ గుట్టలు ఇప్పుడు చిన్నపాటి పర్యాటక కేంద్రంగా, ప్రకృతి అందాలకు ఆలవాలంగా మారాయి... అవే హుస్నాబాద్‌ మండలంలోని మహ్మదాపూర్‌ గ్రామశివారులో ఆవరించి ఉన్న ‘బండల గట్టు’ (చారిత్రక ఆనవాళ్లు ఉన్న కోటగిరి గట్లు, భూషణ గట్లలో ఒక భాగం) గుట్టలు.

బండగల గట్టుపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మిషన్‌ భగీరథ ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఘాట్‌ రోడ్డును నిర్మించింది. సుమారు రెండు కిలోమీటర్లమేర ఈ రోడ్డులో వెళ్తుంటే మినీ జలపాతాలు కనువిందు చేస్తాయి. బండల మధ్య నుంచి నీళ్లు వస్తూ గలగలా రాగాలు పాడినట్లు అనిపిస్తాయి. గుట్టపైన కూడా విశాలమైన స్థలంలో పెద్దపెద్ద వృక్షాలు దర్శనమిస్తాయి. పైనుంచి చూస్తే ఉమ్మాపూర్‌, మహ్మదాపూర్‌ గ్రామాల రైతులు సాగు చేసిన పంట చేన్లు, పలు పండ్ల తోటలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే హుస్నాబాద్‌ పట్టణం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, గుట్ట కింద సరస్సులను తలపించే విధంగా కుంటలు, చెక్‌డ్యాం ఉన్నాయి. రకరకాల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతానికి వెళ్తే ఊటీ, కొడైకెనాల్‌ ప్రాంతాలు గుర్తుకొస్తాయని పలువురు పర్యాటకులు చెబుతున్నారు. ఘాట్‌ రోడ్డు నిర్మాణంతో గుట్టపైకి వెళ్లేందుకు సులువైంది. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున వాహనాల్లో ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్డు అక్కడక్కడా దెబ్బతిన్నది. దీంతో పర్యాటకుల తాకిడి తగ్గింది. దీనికి మరమ్మతులు చేసి, సౌకర్యాలు కల్పిస్తే ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో బండల గట్టు గుట్టలు ఉన్నాయి. ద్విచక్ర వాహనంతో పాటు ఇతర పెద్ద వాహనాల్లోనూ ఇక్కడికి వెళ్లవచ్చు.


VIDEOS

logo