బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 05, 2020 , 00:52:09

సీఎం కేసీఆర్‌కు జై కొట్టిన లక్ష్మాపూర్‌ గ్రామస్తులు

సీఎం కేసీఆర్‌కు జై కొట్టిన లక్ష్మాపూర్‌ గ్రామస్తులు

టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం

నాడు గోదావరి జలాల కోసం..  నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం..

లక్ష్మాపూర్‌ గ్రామస్తులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు 

తొగుట : మల్లన్నసాగర్‌ నిర్మాణం కోసం నాడు భూములు ఇచ్చి గోదావరి జలాల కోసం ముందు వరుసలో నిలిచిన లక్ష్మాపూర్‌ గ్రామం.. నేడు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని ముందుకు రావడం అభినందనీయమని  ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశంసించారు. తొగుట మండలంలోని మల్లన్న సాగర్‌ ముంపు గ్రామం లక్ష్మాపూర్‌ గ్రామస్తులు ఊరును ఖాళీ చేసి గజ్వేల్‌ పట్టణంలోని సంగాపూర్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో నివాసం ఉంటున్నారు. మల్లన్న సాగర్‌తో తాము ఇబ్బందులు పడ్డా, తమకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలిచిందని, తమ పూర్తి మద్దతు టీఆర్‌ఎస్‌కేనని తెలుపుతూ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆదివారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ త్యాగం వెలకట్టలేనిదని, పుట్టెడు దుఖంలో ఉన్నా సీఎం కేసీఆర్‌ మీద భరోసాతో ఇంత ప్రేమతో స్వాగతం పలికిన మీకు ఏమిచేసినా తక్కువేనన్నారు. మొన్న పల్లెపహాడ్‌, నిన్న వేములఘాట్‌, రాంపూర్‌, నేడు లక్ష్మాపూర్‌ గ్రామస్తులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ముందుకు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. మీత్యాగం మూలంగానే 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందని, మీ త్యాగాలను తెలంగాణ అంతటా తెలియజేస్తామన్నారు.

ప్రతిపక్షాల ఆటలు సాగవు...

ప్రతిపక్షాల ఆటలు సాగవని, వారి స్వార్థ రాజకీయాల కోసం కేసులు,  కోర్టులు అంటూ ముంపు బాధితులకు అన్యాయం చేశారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టం కార్పొరేట్లకు మేలుచేసేలా ఉందని, ఇక్కడ మనం పండించిన పంటను షోలాపూర్‌కు తీసుకెళ్లి అమ్మాల్సి వస్తుందన్నారు. మార్కెట్‌ వ్యవస్థను ఎత్తివేస్తున్నారని, వ్యవసాయం వ్యాపారంగా మార్చిన ఘనత పీఎం మోదీకి దక్కుతుందన్నారు. విదేశాల నుంచి మక్కలు తెచ్చి అగ్గువకు తెలంగాణలో అమ్మితే, తెలంగాణ రైతులు పండించిన మక్కలను ఎవరు కోనాలని ఆయన ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ పంజాబ్‌కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, ఉత్తర భారతం అంతటా రైతుల నిరసనలతో అట్టుడుకుతుండగా, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారన్నారు. 

మీత్యాగం మరువలేనిది...

ముంపు బాధితులకు దేశంలో ఎక్కడాలేని విధంగా పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామని, ముంపు గ్రామాల ప్రజల త్యాగం  మరువలేనిదని, వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాలు ముంపు బాధితులకు అన్యాయం చేశాయని, వారు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ధ్వజమెత్తారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ముంపు బాధితులకు 250 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించి, అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలోని సంగాపూర్‌ మరో సింగపూర్‌ కానుందని మంత్రి తెలిపారు. సంగాపూర్‌ వద్ద కంపెనీలు ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బీడీ కంపెనీలు ఏర్పాటు చేసి మహిళలకు ఎప్పటిలాగే ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. 90 శాతం వరకు ముంపు గ్రామాల వారి సమస్యలు పరిష్కరించామని,   ఆర్‌ఆండ్‌ఆర్‌ పరిహారం తదితర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొండ పోచమ్మ తరహాలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. మరో మూడేండ్లు సీఎం కేసీఆర్‌ అధికారంలో ఉండడం ఖాయమని, మీ సమస్యలను పరిష్కరించే అవకాశం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఉందని మంత్రి అన్నారు. ఎన్నికల వేళ వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. అక్టోబరు 3న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేయాలని ఆయన కోరారు. మల్లన్న సాగర్‌లో మత్స్య పరిశ్రమపై మీకే హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావుకు గ్రామ సర్పంచ్‌ కొల్చెల్మ స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు డప్పు చప్పుల్లతో, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కంకణాల నర్సింహులు, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ వెల్పుల స్వామి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గాంధారి నరేందర్‌రెడ్డి, ఎండీ ఖలీమొద్దీన్‌, గడీల లక్ష్మారెడ్డి, పోచయ్య, బక్క కనకయ్య, అనిల్‌, యాదగౌడ్‌, చంద్రం పాల్గొన్నారు. 


VIDEOS

logo