సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 04, 2020 , 00:17:33

టీఆర్‌ఎస్‌కే జై..

టీఆర్‌ఎస్‌కే జై..

  • మంత్రి సమక్షంలో చేరికలు
  • ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం
  • మంత్రి హరీశ్‌రావు

తొగుట: మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. వరుసగా ఒక్కో గ్రామ ప్రజలు వందలాదిగా తరలి వచ్చి మంత్రి తన్నీరు హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. శనివారం వేములఘాట్‌-పల్లెపహాడ్‌ గ్రామాల స్వతంత్య్ర ఎంపీటీసీ ఘనపురం కల్పన మల్లేశం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మీ త్యాగాలు మరువలేనివి, మీకు ఎంత చేసినా తక్కువే, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయ బద్ధంగా అన్ని రకాల పరిహారం అందిస్తామన్నారు. కొండ పోచ మ్మ ప్రాజెక్టు తరహాలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు బాధితులకు పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. 

దుబ్బాక నియోజకవర్గంలోనే 544 మంది రైతులకు రైతు బీమా ద్వారా వారం రోజుల్లో తలా రూ.5 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్రం తెచ్చిన నూత న వ్యవసాయ చట్టం కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ వేసిందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని నిరసిస్తూ పంజాబ్‌కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేశాడని, ఉత్తర భారతం అంతటా రైతుల నిరసనలతో అట్టుడుకుతుండగా, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంకు రైతు లు పాలాభిషేకాలు చేస్తున్నారన్నారు. ఇంటింటికీ నీళ్లు తెచ్చినట్లు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గాంధారి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింహులు, కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ ఖలీమోద్దీన్‌, నాయకులు విజయ్‌ తదితరులున్నారు.

చేనేత రంగానికి..చేయూతనిచ్చిన సీఎం కేసీఆర్‌

చితికిపోయిన చేనేత రంగానికి సీఎం కేసీఆర్‌ చేయూతనందించి, ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో శనివారం మంత్రి హరీశ్‌రావును చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం ఆధ్వర్యంలో మిరుదొడ్డి టౌన్‌కు చెందిన పద్మశాలి సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు తెలుపుతున్నామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మాన పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లోని చేనేతలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారిని ముందుండి అందుకుంటామన్నారు. సంఘం తరఫున టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చేనేత సంఘం దుబ్బాక నియోజకవర్గం ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ, మిరుదొడ్డి మండల పద్మశాలి సంఘం నాయకులు జనార్దన్‌, ఆంజనేయులు, జ్ఞానేశ్వర్‌, బాల్‌నర్సయ్య, పర్శరాములు, సత్యనారాయణ, హన్మంతు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo