శనివారం 05 డిసెంబర్ 2020
Siddipet - Oct 03, 2020 , 05:10:48

వరికి సస్య‘రక్షణ’

వరికి సస్య‘రక్షణ’

చీడపీడలతో దిగుబడులపై ప్రభావం

వర్షాలతో చీడపీడల ఉధృతికి అవకాశం        

సమగ్ర యాజమాన్య పద్ధ్దతులు అవసరం

ఉమ్మడి మెదక్‌ జిల్ల్లావ్యాప్తంగా నియంత్రిత సాగుకు రైతులు జైకొట్టారు. దీంట్లో భాగంగా సన్నరకాల వరి సాగుచేశారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల చీడపీడల తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. ఆలస్యంగా  నాట్లు వేసిన ప్రాంతంలో వరి పిలక దశలో ఉన్నది. మిగతా ప్రాంతాల్లో పొట్ట, ఈనే దశలో ఉన్నది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశల్లో ఉన్నది. 

విత్తన రకాలను బట్టిని తెగుళ్లు..

 వాతావరణ పరిస్థితులు పైరు దశ, విత్తన రకాలను బట్టి పైరుకు పలు రకాల తెగుళ్లు, పురుగులు ఆశించాయని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఉల్లి కోడు, కాండం తొలుచు పురుగు, ఆకుముడత, వరి ఈగ, సుడిదోమ ఆశించే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లి కోడు, కాండం తొలుచు, ఆకు ముడత, కాటుక తెగులు సోకినట్లు రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకువచ్చారు.  శాస్త్రవేత్తలు కూడా పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తు సూచనలు, సలహాలు చేస్తున్నారు.

ఉల్లికోడు..

దీనిని దుంప రోగం, గొట్టం రోగం అని అంటారు. నారుమడి నుంచి పిలక దశ వరకు ఆశిస్తుంది. దోమజాతికి చెందిన ఈ పురుగు కాండంలోకి తొలుచుకుని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతుంది. ఇది విసర్జించే కొన్ని రసాయనాలతో అంకురం ఆకుగా వృద్ధి చెందక ఉల్లికాడలా మారుతాయి. పైరు కంకి వేయక నష్టానికి గురవుతుంది. 

 నివారణ: కార్భోప్యూరాన్‌ గులికలు వారం రోజుల ముందు చల్లి నారు పీకాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 కిలోల ఫోరేటు లేదా 8 కిలోల ఫిప్రోనిల్‌ 0.3.ఈ గుళికలు చల్లాలి. చిరుపొట్ట దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టక పోతే మందులు వాడినా ఫలితం ఉండదు.

కాండం తొలుచు పురుగు..

పిలక దశ నుంచి దంటు చేసే దశ వరకు వరకు ఈ పురుగు ఆశిస్తుంది.  మొవ్వు చనిపోయి ఈనిన కంకులు తాలుగా తెల్లగా మారుతాయి. ఆలస్యంగా వరినాట్లు వేసిన పొలానికి ఆధికంగా ఆశిస్తుంది. వర్గల్‌ మండలంతో పాటు పలు గ్రామాల్లో ఈ కాండం తొలుచు పురుగు సోకినట్లు రైతులు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 

నివారణ: నాటువేసిన మడిలో 30రోజుల లోపు ఎకరాకు కార్భోప్యూరాన్‌ 3జీ గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జీ 8 కిలోలు, క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4జి గులికలు 4 కిలోలు పొలంలో పల్చగా నీరు ఉంచి చల్లాలి. చిరు పొట్ట దశలో కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ ఎస్‌పీ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 60 మి లీ ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఆకు ముడత.. 

గొంగళి పురుగులు ఆకు ముడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తినివుయడంతో ఆకులు తెలబడుతాయి. వర్షాభావం, బెట్ట, నీడ పరిస్థితుల్లో ఈ పురుగు ఉధృతి ఉంటుంది. ఆలస్యంగా నాటినా,  నత్రజని అధికంగా వాడినా దీని ఉధృతి పెరుగుతుంది.

నివారణ: తాడుతో చేనుకు అడ్డంగా లాగడం, ఎకరాకు 8 కిలోల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ గుళికలు చల్లాలి. లేదా కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 శాతం ఎస్‌పీ 400గ్రామలు , క్లోరాంట్రానిలిప్రోల్‌ 60 మిల్లీలీటర్లతో నివారించొచ్చు. ప్లూబెండమైడ్‌ 48ఏసీ 0.1 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి.

సుడి దోమ.. 

వానకాలం సన్నరకాలకు దోమపోటు అధికంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా పడడం, తేమ అధికంగా ఉండడంతో వ్యాప్తి అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దోమపోటు రాకుండా ముందస్తు  చర్యలు చేపట్టాలి. పొలంలో పాయలు తొక్కడం, పొలాన్ని ఆరబెడుతూ  తడులుగా నీరు ఇవ్వాలి.  నివారణకు కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌, ప్చూబెండమైడ్‌, క్లోరాంట్రానిలిప్రోల్‌ వంటి క్రిమిసంహారక మందులను వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు వాడాలి.

కాటుక తెగుళు.. 

పొట్ట దశ నుంచి పూత, గింజ పాలు పోసుకునే దశ వరకూ ఆశిస్తుంది. ఇప్పటికే రాయపోలు తదితర ప్రాంతాల్లో వరి పైరుపై సోకినట్లు రైతులు చెబుతున్నారు. ఈ తెగులు సోకిన మొక్క పూత గింజల నుంచి ఆకుపచ్చ లేదా పసుపు పచ్చరంగులో శిలీంధ్రం ముద్దగా స్రవిస్తుంది. నల్లటి ముద్దలు కాటుకగా మారుతుంది. పంట పూత దశలో అధిక వర్షాలు, గాలిలో తేమ ఉండడంతో ఈ తెగులు ఉధృతి అధికమవుతుంది.

 నివారణ:  ఎకరాకు కార్బండాజిమ్‌ 200 గ్రామలు  లేదా ప్రాపికొనజోల్‌ 200 మిల్లీలీటర్ల పైరు ఈనే దశలో పిచికారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు  సూచిస్తున్నారు. 


ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వరి అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. వరి ప్రస్తుతం పిలక నుంచి గింజ గట్టి పడే దశల్లో ఉన్నది. గత నెలలో వరుసగా వర్షాలు కురవడం, వాతావరణ మార్పులతో ప్రాంతాలు, విత్తన రకాలను బట్టి వరి పైరుపై వివిధ రకాల తెగుళ్లు దాడిచేస్తున్నాయి. కాండం తొలుచు పురుగుతో ఎక్కువగా నష్టం ఏర్పడుతున్నదని  రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తున్నారు.  ఏఏ తెగుళ్లకు ఏఏ మందులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

                    -గజ్వేల్‌