ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 03, 2020 , 05:08:38

పరనింద.. మీ పని గోవింద!

పరనింద.. మీ పని గోవింద!

అన్ని మెస్సేజ్‌లూ జాగ్రత్తగా పరిశీలించాలి

కించపర్చే పోస్టులు వద్దేవద్దు

పక్కా సాక్ష్యాలతో దొరికిపోవడం ఖాయం

పటిష్ట నిఘా పెట్టిన పోలీసులు

‘పరనింద పాప హేతువు’ అంటారు. ఎదుటి వారిని కించపర్చేలా మాట్లాడటం ఎప్పటికీ తగదు. అది ఏనాటికైనా మనకు ముప్పే తీసుకువస్తుంది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంది కదా అని.. ఏది పడితే అది టైపు చేసేయడం.. పోస్టు చేసేయడం ఇటీవలి కాలంలో చాలా మందికి అలవాటుగా మారిపోయింది. ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం తప్పుకాదు. కానీ.. అది ఇతరులను నిందించడం వరకు వెళ్లొద్దు. కొందరు గుడ్డిగా ఇతరులు పంపించిన మెస్సేజ్‌లు కూడా పూర్తిగా చదవకుండా ఫార్వర్డ్‌ చేస్తుంటారు. అది వారికే కాదు.. ఎదుటి వారికి కూడా కష్టాలు తెచ్చిపెడుతుంది. - సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

సోషల్‌ మీడియాలో చేసే పోస్టులు ఎంతటి ఉపద్రవాన్నయినా తీసుకువస్తాయి. కొద్ది రోజుల కిందట కర్ణాటక ఘటనే దీనికి ఉదాహరణ. కేవలం ఓ వ్యక్తి ఫార్వర్డ్‌ చేసిన మెస్సేజ్‌ బెంగళూరు నగరాన్ని నిప్పుల కుంపటి చేసింది. ముగ్గురి ప్రాణాలను తీసింది. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.

వ్యక్తులు, వ్యవస్థలను కించపరచడం, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా, కులమతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా పోస్టులు పెట్టి వాటిని సర్క్యులేట్‌ చేయడం నేరం. ఇలాంటి పనులు చేసే వారు జైలుకు వెళ్లక తప్పదు. ఇంటర్‌నెట్‌లో ఎక్కడ ఏ పోస్టు పెట్టినా... ఏ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా దానికి శాస్త్రీయపరమైన సాక్ష్యాలుంటాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే అలాంటి వారిపై సైబర్‌ చట్టాల ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారు.

అసత్య ప్రచారాలతో ఇబ్బంది...

ఒక వ్యక్తి అనాలోచితంగా పెట్టే పోస్టులను ఇతరులు గుడ్డిగా నమ్మి దాన్ని వైరల్‌ చేస్తుంటారు. అలాంటి పోస్టులలో నిజం ఎంత ఉన్నదని ఆలోచించకుండా ఫార్వర్డ్‌ చేస్తుంటారు. దీనికి తోడు ఉహాజనితాలను సోషల్‌ మీడియాలో ఫార్వర్డ్‌ చేస్తుంటారు. ఇవి పుకార్లుగా మారి గొడవలకు దారి తీయ డం, ఉద్రిక్తతలుగా మారుతుంటాయి. సోషల్‌ మీడియా ఉన్నది మంచి సమాచారాన్ని పది మందికి తెలియజేయడానికే.. కానీ.. కొందరు కేవలం విమర్శలకు, వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.

మీకిది తెలుసా ?

ఆన్‌లైన్‌లో ఏ తప్పు చేసినా అది రికార్డయిపోతుంది. ఫోన్‌ నంబర్‌ లేదా కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ ద్వారా కొన్ని గంటల్లోనే పట్టుకోవచ్చు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఏ విషయాన్ని షేర్‌ చేసినా (టెక్ట్స్‌/ఫొటో/వీడియో) అది నేరం. దానికి రెండేండ్ల నుంచి ఏడేండ్ల వరకు శిక్ష పడే అవకాశమున్నది.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

మీరు సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టు వాస్తమైందా? ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉందా? ఆలోచించండి. ఇతరులకు ఇబ్బంది లేదు అనుకుంటేనే పోస్టు చేయండి

ఒక పోస్టు ఫార్వర్డ్‌ చేయాలనుకుంటే.. దాన్ని పూర్తిగా చదవాలి. ఫొటో, వీడియోను పూర్తిగా చూడాలి. అసలు దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ?లేదా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇతరులకు ఇబ్బంది లేదు అనుకున్నప్పడే ఫార్వర్డ్‌ చేయండి.

పోస్టులు దేశ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి. 

దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వర్గాలు, వ్యక్తులు, వ్యవస్థల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉండొద్దు. 

మహిళలను కించపరిచే విధంగా ఎలాంటి పోస్టులూ పెట్టొద్దు. అలాంటి వాటిని ఫార్వర్డ్‌ కూడా చేయొద్దు.

ఇంటర్‌నెట్‌లో జరిగే ప్రతి అంశాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కవర్‌ చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెస్సేజ్‌ చేసినా, ఫార్వర్డ్‌ చేసినా అది జవాబుదారీ తనంతో కూడుకొని ఉండాలి.

సమాజంలో ఒకరికొకరు గౌరవించుకుంటారు. మనం ఇతరుల నుంచి ఎలాంటి గౌరవం కోరుకుంటామో... అవతలి వాళ్లు కూడా అదే కోరుకుంటారన్న విషయం మర్చిపోవద్దు. మన మెస్సేజ్‌లలో ఆ స్పష్టత ఉండాలి.


VIDEOS

logo