బుధవారం 28 అక్టోబర్ 2020
Siddipet - Oct 02, 2020 , 00:57:47

యూవీసీ వైరస్‌ కిల్లర్‌ మిషన్‌ రెడీ

 యూవీసీ వైరస్‌ కిల్లర్‌ మిషన్‌ రెడీ

సిద్దిపేట రూరల్‌ : కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా  ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. కరోనా వైరస్‌ అంటుకోకూడదని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం మూతికి మాస్క్‌, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తున్నాం. సిద్దిపేట పట్టణంలోని భరత్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి కాపర్తి భార్గవ్‌ ఎలాంటి శానిటైజర్లు, ద్రావణాలు అవసరం లేకుండా కేవలం రూ.600 ఖర్చుతో యూవీ (అల్ట్రా వయొలెట్‌) కాంతి రేడియేషన్‌ ద్వారా వైరస్‌ను చంపే ‘యూవీసీ వైరస్‌ కిల్లర్‌' యంత్రాన్ని తయారు చేశాడు. 

యూవీ కిరణాల కాంతి ద్వారా వైరస్‌ ఖతం 

సాధారణంగా ప్రజలు ప్రతి పనికోసం బయటకు వెళ్లక తప్పదు. కానీ, మన కంటికి కనిపించని కరోనా వైరస్‌ అందరినీ భయపెట్టిస్తున్నది. ఎక్కడ వైరస్‌ మనకు అంటుకుంటుందో అర్థం కాని పరిస్థితి. మనం భౌతిక దూరం పాటించినా.. మనం ఇంట్లోకి తీసుకెళ్లే ఏ వస్తువుకైనా.. ఆ వైరస్‌ ప్రవేశించవచ్చు.  భార్గవ్‌ తయారుచేసిన యూవీసీ వైరస్‌ కిల్లర్‌ బాక్స్‌లో మనం బయట నుంచి తెచ్చిన వస్తువు, కూరగాయలు గానీ, మరే ఇతర వస్తువైనా ఐదు నిమిషాల పాటు ఉంచితే, ఆ వస్తువుల క్రిమిరహితంగా మారుతాయి. కొన్ని రకాల యూవీ కిరణాల కాంతి ద్వారా వైరస్‌లను అంతం చేయవచ్చు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ వైరస్‌ కిల్లర్‌ బాక్స్‌ను తయారు చేశానని భార్గవ్‌ చెప్పుకొచ్చాడు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం

ఎలాంటి వైరస్‌, క్రిములనైనా చంపే యూవీసీ వైరస్‌ కిల్లర్‌ ఫ్రిజ్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని భార్గవ్‌ అన్నారు. కేవలం రూ.600తో ఈ ఫ్రిజ్‌ బాక్స్‌ను తయారు చేశానని, యూవీసీ లైటర్‌, కనెక్టర్‌, థర్మకోల్‌, షీట్‌లను ఉపయోగించానని తెలిపాడు. మనం బయట నుంచి ఇంట్లోకి తెచ్చిన ఎలాం టి వస్తువునైనా  ఫ్రిజ్‌ లాంటి బాక్స్‌లో పెట్టి పవర్‌ ఆన్‌ చేసి 5 నిమిషాల పాటు ఉంచితే క్రిమిరహితంగా మారుతాయి. ఈ యంత్రం ద్వారా అన్ని రకాల వైరస్‌లతో పాటు రోగకారక క్రిములు చనిపోతాయన్నారు. 

కేవలం 5 నిమిషాల్లో ..

నేను సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఐటీ డిపార్ట్‌మెంట్‌లో బీటెక్‌ రెండో  సంవత్సరం చదువుతున్నా. కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో అందరూ ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్‌ రావడానికి సమయం పట్టే అవకాశమున్నది. అయితే వైద్యులు ఆపరేషన్‌ చేసేటప్పుడు ఎలాంటి వైరస్‌లు, క్రిములు దరి చేరకుండా యూవీ సీ లైట్‌ రేస్‌ను ఉపయోగిస్తారో.. అలాంటి కాన్సెప్ట్‌ను ఉపయోగించి ఈ ప్రయోగం చేశా. ఇది గమనించి తక్కువ ఖర్చుతో ఈ యూవీసీ వైరస్‌ కిల్లర్‌ మిషన్‌ను తయారు చేశా. 

- కాపర్తి భార్గవ్‌, ప్రయోగకర్త 


logo