బుధవారం 28 అక్టోబర్ 2020
Siddipet - Oct 02, 2020 , 00:57:47

‘మల్లన్న’ రాతిగీరల ఆలయ సుందరీకరణ

‘మల్లన్న’ రాతిగీరల ఆలయ సుందరీకరణ

చేర్యాల : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో రాతిగీరల ఆలయాన్ని సుందరీకరణ చేసేందుకు ఆలయవర్గాలు చర్యలు ప్రారంభించాయి. చుక్కల పర్వతం నుంచి నేరుగా రాతిగీరల పై కొమురవెల్లి మల్లన్న బలిజ మేడలమ్మ, గొల్ల కేతలమ్మతో కాలుపెట్టిన రాతిగీరల ఆలయ అభివృద్ధికి దేవాదాయశాఖ నడుంభిగించింది. ఈ మేరకు ఎంతో పవిత్రమైన రాతిగీరల ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆలయవర్గాలు రూ.19లక్షల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేయగా, ఇటీవల సాంకేతిక పరమైన అనుమతి మంజూరు చేశారు. పరిపాలన పరమైన అనుమతి రాగానే ఆలయ అధికారులు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

  రక్షణకు ప్రత్యేక చర్యలు

స్వామి వారి క్షేత్రంలో ఎంతో పవిత్రమైన రాతిగీరల ఆలయానికి రక్షణ లేకపోవడంతో  భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్న విషయాన్ని మల్లన్న ఆలయవర్గాలు గమనించింది.  పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. కొమురవెల్లి మల్ల న్న క్షేత్రానికి వచ్చిన భక్తులు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించి, గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న ఆల య వెనుకమెట్ల నుంచి నేరుగా రాతిగీరల ఆలయానికి వస్తారు. అనంతరం రాతిగీరల చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు భక్తులు నూతన వాహనాలు కొనుగోలు చేస్తే వెంటనే రాతిగీరల వద్ద వాహనపూజ చేయించుకుంటారు. ఎంతో పవిత్రమైన ప్రదేశానికి రక్షణ లేకపోవడం కుక్కలు, పందులు ఇక్కడే సంచరిస్తుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతుండడంతో ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ వర్గాలు ప్రత్యేక నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

  సుందరీకరణ పనులు

కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులు రూ.19 లక్షలతో రాతిగీరల ఆలయంతో పాటు పరిసర ప్రదేశాన్ని సుందరీకరించేందుకు ఆలయవర్గాలు ప్రతిపాదనలు తయా రు చేశారు. సదరు నిధులతో రాతిగీరల వద్ద ప్రహరీ నిర్మాణం, ప్రత్యేక విద్యుత్‌ దీపాలు, స్టీల్‌ రెయిలింగ్‌, సిమెంట్‌ రోడ్డు , వర్షపు నీరు తరలించేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. కొబ్బరికాయలు కొట్టడడం కోసం ప్రత్యేక నిర్మాణ పనులతో పాటు వాహనాలను సైతం తిప్పుకునే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

 త్వరలో టెండర్లు పిలుస్తాం 

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాతిగీరల సుందరీకరణ పనులకు అన్ని అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులను బ్రహ్మోత్సవాలకు ముందే పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తాం.మల్లన్న ఆలయ నిధులు రూ.19లక్షలతో సుందరీకరణ పనులతో, స్వామి వారి క్షేత్రంలో చేపట్టెందేకు అనుమతులు త్వరగా వచ్చేందు కు ఇటీవల కమిషనర్‌ను కలిశాం.

-టంకశాల వెంకటేశ్‌, ఈవో 


logo