బుధవారం 28 అక్టోబర్ 2020
Siddipet - Oct 02, 2020 , 00:57:42

కాయ్‌ రాజా కాయ్‌

కాయ్‌ రాజా కాయ్‌

ఈ బంతికి పక్కా సిక్స్‌.. లేదు వికెట్‌ పడుతోంది. కాదు.. కాదు ఈ ఓవర్‌లో ఐదు ఫోర్లు.. లేదంటే నాలుగు సిక్స్‌లు పడతాయి. టాస్‌ గెలిచిన జట్టే బ్యాటింగ్‌ చేస్తోంది. ఫలానా ఆటగాడు మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు. రూ. పదివేలు బెట్టు.. ఐపీఎల్‌ సీజన్‌ ఇలా మొదలైందో లేదో బెట్టింగులు ఊపందుకున్నాయి. 

మునిపల్లి : గ్రామం, పట్టణాల్లో బెట్టింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ ప్రారంభమైతే చాలు.. బెట్టింగ్‌ రాజులకు పండుగే.. అడ్డాల ఏర్పాటుతోపాటు ఆన్‌లైన్‌, సెల్‌ ఫోన్లలో కోడ్‌ భాషలో బెట్టింగ్‌లు కాస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ఎక్కువ మంది విద్యార్థులు, యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేండ్లుగా టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బెట్టింగ్‌ల కారణంగా మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి టీవీల కు అతుక్కుపోతున్నారు. మునిపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రధాన చౌరస్తాలలో బెట్టు కాస్తుండగా, బుధేరా, కంకోల్‌లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఒకటికి రెండు, రెండుకు మూడు రెట్లు... ఈ విధంగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. తక్కువగా వందల నుంచి వేల రూపాయల వరకు బెట్టింగ్‌లు కాస్తున్నారు.

ఆన్‌లైన్‌, సెల్‌ఫోన్ల ద్వారా..

ఆన్‌లైన్‌, సెల్‌ ఫోన్ల ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇతరులకు అర్థం కాకుండా కోడ్‌ భాషను ఉపయోగిస్తున్నారు. కోడ్‌ ప్రకారం డబ్బును ఇవ్వడం జరుగుతోంది. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ చూపించి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. 

ఇబ్బందులకు గురవుతున్న యువత..

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువత ఉన్నట్లు సమాచారం. కొంత మంది బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మ్యాచ్‌ల సమయంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవడంతోపాటు ఆర్థికంగా చితికిపోతున్నారు. బెట్టింగ్‌ రాజులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది


logo