శుక్రవారం 30 అక్టోబర్ 2020
Siddipet - Oct 01, 2020 , 05:58:00

సర్కారు బడికి చలో చలో

 సర్కారు బడికి చలో చలో

  • ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ప్రవేశాలు
  • ప్రైవేట్‌ పాఠశాలల నుంచి చేరికల వెల్లువ
  • ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో మొగ్గు
  • కరోనాతో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు
  • పిల్లలను ప్రభుత్వ బడులకు పంపేందుకు సుముఖత
  • నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం,  పుస్తకాలు, యూనిఫామ్‌ అందజేస్తున్న ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య రోజురోజుకూ పెరు గుతున్నది. తల్లిదండ్రులు పట్నంలో ఉన్నప్పుడు వేలకు వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించారు. ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేవు. ఉన్న చిన్నపాటి ఉద్యోగాలు, ఉపాధి పోయింది. పట్టణాల్లో ఉపాధిలేక పల్లెబాట పట్టిన వారంతా, తిరిగి పల్లెలకు చేరుకున్నారు.  వీరిని పల్లె తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనా  పరిస్థితుల్లో  ప్రైవేట్‌ పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు  తల్లిదండ్రులు సుముఖంగా లేరు. రోజురోజుకూ ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. 


ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. విద్యార్థులు క్రమంగా ప్రైవేట్‌ను వీడి సర్కారు బడివైపు పయనిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌లో చేరేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో సర్కారు బడులు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకు మంచి విద్యాబోధనతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, నోటుబుక్కులు అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. కరోనాతో అన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. ఇది కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చేస్తున్నాయి. ప్రైవేట్‌కు మాదిరిగా సర్కారులోనూ డిజిటల్‌ తరగతుల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇది పిల్లలను ఆకట్టుకుంటున్నది. 

సిద్దిపేట జిల్లాలో 7,306 విద్యార్థుల అడ్మిషన్‌ 

సిద్దిపేట జిల్లాలోని 1,016 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 3   నుంచి 10వ తరగతి వరకు 66,670 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇక ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిధిలో కొత్త అడ్మిషన్లు పెరుగుతున్నాయి. గురువారం వరకు జిల్లాలో 3నుంచి పదో తరగతి వరకు 7,306 అడ్మిషన్లు కొత్తగా వచ్చాయి. వీటిలో 4,083 కొత్త అడ్మిషన్లు ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 3,223 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వీరి సంఖ్యతో కలుపుకొంటే ప్రస్తుతం 73,976 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా జూన్‌ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ, ఈసారి కరోనా నేపథ్యంలో ఇటీవల విద్యా సంవత్సరం ప్రారంభమైంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. ఎంతమంది విద్యార్థులు క్లాసులు వింటున్నారు అనే వివరాలను ఏ రోజుకు ఆరోజు నమోదు చేస్తున్నారు. 

ప్రతిరోజు ఉపాధ్యాయులు మానిటరింగ్‌ చేస్తున్నారు. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలకు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఉపాధ్యాయులు తీరుస్తున్నారు. గత సోమవారం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 50శాతం మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు.వీరికి జిల్లా విద్యాశాఖాధికారి రవికాంతరావు పలు సూచనలు చేశారు. మొదటి సమూహంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ఉన్నత పాఠశాలల భాషేతర ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలని, రెండో సమూహంలో మంగళ, గురు, శని వారాల్లో ఉన్నత పాఠశాలల భాషోపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు దానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నారు. మిగిలిన ఉపాధ్యాయులు ఇంటి నుంచి సెల్‌ఫోన్ల ద్వారా విద్యార్థులను పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు సెల్‌ఫోన్‌ల ద్వారా ఉపాధ్యాయులను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులు సోమ, బుధ, శుక్రవారాల్లో పాఠశాలకు వెళ్లి, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. 

 మెదక్‌ జిల్లాలో 9,416 మంది విద్యార్థుల చేరిక

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సర్కారు బడుల రూపురేఖలు మార్చింది. సర్కారు బడుల్లో ఇంగ్ల్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టింది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు సర్కారు బడులే బెటర్‌ అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడుల్లోనే విద్యార్థులు భారీగా చేరుతున్నారు. జిల్లాలో సర్కారు బడు లు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతున్నాయి.  చాలా ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సా ధించాయి. ఉచిత అడ్మిషన్‌తో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ను ప్రభుత్వ మే అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్ధులు పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షతో పాటు రెసిడెన్షియల్‌ గురుకులాల్లోనూ సీట్లు సాధిస్తున్నారు. 

 మెదక్‌ జిల్లాలో ఇలా..

మెదక్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 9,416 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇందులో ఒకటో తరగతిలో 3,726 మంది విద్యార్థులు, 6వ తరగతిలో 4,362 మంది, 8వ తరగతిలో 548 మంది విద్యార్థ్ధులు అడ్మిషన్లు పొందారు. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి మరో 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 

నమ్మకం కలిగిస్తున్నాం.. 

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నమ్మకం కలిగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యా విధానంలో సమూల సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 9,416 మంది విద్యార్థులు చేరారు. ప్రైవేట్‌ పాఠశాల నుంచి 780 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నది. దీంతో మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు సర్కారు బడులు ప్రైవేట్‌ను మించి అన్ని అంశాల్లో సత్తాచాటుతున్నాయి. జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

-రమేశ్‌కుమార్‌, డీఈవో మెదక్‌ 

ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకం.. 

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులకు నమ్మకం కలుగుతున్నది. జిల్లావ్యాప్తంగా 1,6,8 తరగతుల్లో ఇప్పటి వరకు 9139 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి మరో 1736 మంది విద్యార్థులు చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సక్సెస్‌ పేరుతో ఇంగ్లిష్‌ మీడియం ఉండడంతో ఈ ఏడాది 95 శాతం మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 

- నాంపల్లి రాజేశ్‌, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి