మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 29, 2020 , 02:12:15

కష్టకాలంలోనూ టీఆర్‌ఎస్‌ సంక్షేమాన్ని ఆపలేదు

కష్టకాలంలోనూ టీఆర్‌ఎస్‌ సంక్షేమాన్ని ఆపలేదు

  • l బీజేపీకి కేడర్‌ లేదు.. కాంగ్రెస్‌కు క్యాండిడేట్‌ లేడు 
  • l ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 
  • l దుంపల్లి, లచ్చపేట, చెల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవ తీర్మానాలు 

దుబ్బాక : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాట తప్పదు.. మడుమ తిప్పదని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలనూ నెరవేర్చారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్‌, లచ్చపేట వార్డుల్లో పలు అభివృద్ధ్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేస్తున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకంతో 7 లక్షల పెండ్లిళ్లకు రూ.5555 వేల కోట్లు అందించామన్నారు. నెలనెలా రూ.11,400 కోట్లు  పింఛన్‌ అందిస్తున్నామన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి కేండిడెట్‌ లేడు. బీజేపీకి కేడర్‌ లేదని మంత్రి ఎద్దేవా చేశారు. 

చంద్రబాబుకు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది 

సమైక్యాంధ్రలో చంద్రబాబునాయుడు బోరుబావులకు మీటర్లు పెడుతానంటే ఏ గతి పట్టిందో అందరికి తెలుసని గుర్తు చేశారు.  కేంద్ర ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే బీజేపీ కార్పొరేట్‌ ముసుగులో నయా జమిందార్‌ వ్యవస్థకు తెరలేపుతున్నదన్నారు.  

కుల సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు 

 మున్సిపాలిటీలో చెల్లాపూర్‌, దుంపలపల్లి, లచ్చపేటలో కుల సంఘాల వారు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. దుబ్బాకలో ముదిరాజ్‌, పద్మశాలీ కుల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలను అందజేశారు. లచ్చపేటలో నిర్వహించిన సమావేశంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అడుగడుగునా మంత్రికి నీరాజనం.. 

మున్సిపాలిటీలో మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. దుంపలపల్లి, చెల్లాపూర్‌, లచ్చపేట వార్డుల్లో మంత్రికి మహిళలు మంగళహారతులిచ్చి, తిలకం దిద్దారు. డప్పు చప్పుళ్లతో, పటాకులు కాల్చుతూ మత్స్యకారులు జలపందిరితో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రొట్టే రాజమౌళి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నే వనిత, వైస్‌ చైర్‌పర్సన్‌ సుగుణ, కౌన్సిలర్లు, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo