శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Sep 28, 2020 , 01:51:24

రాష్ట్రంలో సంక్షేమ పాలన

రాష్ట్రంలో సంక్షేమ పాలన

బీజేపీ ప్రభుత్వానికి రైతు  సంక్షేమంపై చిత్తశుద్ధి లేదు

సీఎం కేసీఆర్‌ ఉచితంగా కరెంటు ఇస్తుంటే .. కేంద్రం మీటర్‌ పెట్టాలని ఒత్తిడి  

బీజేపీ ప్రభుత్వ రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతుబంధు ఇచ్చారా..?

ఏమొహం పెట్టుకొని దుబ్బాకలో ఓట్లు అడగడానికి వస్తున్నారు

బీజేపీ నాయకులను ప్రశ్నించిన మంత్రి హరీశ్‌రావు 

దుబ్బాక, తొగుట,కొండపాకలో పర్యటన

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి

తొగుట :  కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమే ఆగమై పోయింది...మన రాష్ట్ర ఆదాయం కూడా పడిపోయింది..అయినా పేదల సంక్షేమం కొనసాగించామని, మనది గరీబోల్ల ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తొగుటలో రూ.80 లక్షలతో నిర్మించిన తహసీల్‌ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి, రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. అనంతరం తొగుట మార్కెట్‌ కార్యాలయంలో 355 మంది రైతులకు పట్టాపాస్‌ పుస్తకాలు, ఇండ్ల పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా-లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం పడిపోయినా, ప్రభుత్వం తలా 10 కిలోల చొప్పున బియ్యం, కంది పప్పు పంపిణీ చేసిందన్నారు. రైతుబంధు పైసలు రైతులకు అందించామన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని, మల్లన్నసాగర్‌ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, తెలంగాణలో మాత్రం నాణ్యమైన ఉచిత కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. 

రైతుల హితం కోసమే నూతన రెవెన్యూ చట్టం.. 

గతంలో రెవెన్యూ సమస్యలతో రైతులు అష్టకష్టాలు పడేవారని, భూమి రిజిస్టేషన్‌ చేసుకున్నాక మ్యుటేషన్‌ చేయడానికి నెలలు పట్టేదని, పైసలతో పాటు కాలం వృథా అయ్యేదని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను చెక్‌ పెట్టడానికే నూతన రెవెన్యూ చట్టం ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. తొగుట మండలంలో కొంతమందికి పాస్‌బుక్‌లు లేకపోవడంతో రైతుబంధు అందలేదన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పట్టుబట్టి పాస్‌బుక్‌లు లేకున్నా రైతుబంధు డబ్బులు వచ్చేలా చేశారన్నారు. సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నిలిచిపోయిన బీడీ కార్మికులకు సంబంధించి రోల్‌బ్యాక్‌ బీడీ పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తుందన్నారు. వ్యక్తిగతంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని కోరారు. 

సంక్రాంతి గంగిరెద్దులను నమ్మవద్దు : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి..

సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లా, ఎన్నికలప్పుడు కనిపించే నాయకులను నమ్మవద్దని మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. బీజేపీ నాయకుడు రఘునందన్‌ ఎన్నికలు కాగానే తట్టబుట్ట సర్దుకొని మాయమైపోతాడని, మళ్లీ ఎన్నికలు రాగానే వస్తాడని, ఆలాంటి వాడిని నమ్మవద్దన్నారు. ఏపని కావాలన్నా మనతోనే సాధ్యమవుతుందని, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. కేంద్రంలో గెలిచి బీజేపీ నాయకులు ఏం ఉద్దరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సేవలు మరువలేమన్నారు. కార్యక్రమాల్లో ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, రాష్ట్ర ఆత్మకమిటీ, రైతు బంధు సభ్యులు అనంతుల పద్మ, దేవి రవీందర్‌, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌, ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, సొసైటీ,మార్కెట్‌ కమిటీ చైర్మన్లు హరికృష్ణారెడ్డి, గడీల అనిత లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కనకయ్య, ర్యాగల దుర్గయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మండల సర్పంచ్‌ల, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్‌, కంకణాల నర్సింహులు, సర్పంచ్‌, ఎంపీటీసీలు పాగాల కొండల్‌రెడ్డి, సుతారి లలిత రమేశ్‌, నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

దుబ్బాక టౌన్‌ :  సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికలు వచ్చినప్పుడు ఊర్లలోకి వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను  మాత్రం నమ్మవద్దని, వారికి డిపాజిట్లు దక్కకుండా చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం దుబ్బాక మున్సిపాలిటీలోని మల్లాయిపల్లి 1వ వార్డు, చేర్వాపూర్‌, ధర్మాజీపేట వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా వార్డుల్లో జరిగిన సభల్లో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ...ప్రజలకు కోసం మంచి పనులు చేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆదరించాలని  కోరారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాకపై ఉన్న ప్రేమ.. బీజేపీ, కాంగ్రెసోళ్లకో ఉండదన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన ఆశయాల మేరకు మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగ తీర్చిదిద్దే బాధ్యత తనదని మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. 
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు...
దుబ్బాక మున్సిపాలిటీలో ఆదివారం మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్లాయిపల్లిలో రూ.7 లక్షలతో మురికికాలువల నిర్మాణం, ధర్మాజీపేట 8వ, 9 వ వార్డుల్లో రూ.25 లక్షల చొప్పున, 7వ వార్డులో రూ.5 లక్షలతో, చేర్వాపూర్‌ 6వ వార్డులో రూ. 15 లక్షలు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చేర్వాపూర్‌, మల్లాయిపల్లి వార్డుల్లో కొత్తగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కుల సంఘాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మంత్రికి తీర్మాన పత్రాలను అందజేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత, ఎంపీపీ పుష్పలత, జట్పీటీసీ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు  రజిత, బాలకృష్ణ, కనకయ్య, బత్తుల స్వామి, మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు రొట్టె రాజమౌళి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

VIDEOS

logo