బుధవారం 28 అక్టోబర్ 2020
Siddipet - Sep 25, 2020 , 02:28:47

రైతు సంక్షేమం కోసమే కొత్త రెవెన్యూ చట్టం

రైతు సంక్షేమం కోసమే కొత్త రెవెన్యూ చట్టం

దుబ్బాక టౌన్‌ :  అవినీతికి తావు లేకుండా, త్వరితగతిన రైతులకు పనులు జరిగేందుకే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎంపీ 602 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.     

రైతులు తమ ధాన్యాన్ని ఆర బెట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష కల్లాలను రూ.600 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆసరా పింఛన్ల కోసం రూ.11,700 కోట్లు ఖర్చు చేస్తుంటే అందులో కేవలం కేంద్రప్రభుత్వం ఇచ్చేది రూ.700 కోట్లు మాత్రమేనన్నారు.  దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు 548 మంది రైతులకు రైతుబీమాను అందించామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలను కోరారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, జేసీ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత, ఏఎంసీ చైర్మన్‌ శ్రీలేఖ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, రేకుల కుంట మల్లన్న ఆలయ చైర్మన్‌ రొట్టె రమేశ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను నమ్మొద్దు..

మిరుదొడ్డి : దుబ్బాకలో రెండేండ్ల నుంచి కనిపియ్యని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను దుబ్బాక ప్రజలు నమ్మొద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి బాలాజీ ఫంక్షన్‌హల్‌లో మిరుదొడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 540 మంది రైతులకు పట్టాపాసు పుస్తకాలను మొదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ రోజా శర్మ, జేసీ పద్మాకర్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..  ఉప ఎన్నికల్లో ఎవరు ఏమి చెప్పినా.. దుబ్బాక ప్రజలు మాత్రం సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేస్తారన్నారు. ఏండ్ల నాటి నుంచి రైతులు పడిన కష్టాలు ఈ రెవెన్యూ చట్టంతో అన్ని తొలగిపోనున్నాయన్నారు. దేశంలోని ఆయా రాష్ర్టాలోని రైతులు పండించిన మొక్క జొన్నలను వద్దని విదేశాల నుంచి కోళ్లకు పోయడానికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఎవరి ప్రజయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం విదేశీ మక్కలను కొనుగోలు చేస్తుందని కేంద్రాన్ని మంత్రి ప్రశ్నించారు.  కరెంటు కష్టాల నుంచి గట్టెకించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి 24గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు కరెంటు బిల్లుల మోతలు పెట్టడానికి పార్లమెంట్‌లో బిల్లును తీసుకువస్తుందని మండిపడ్డారు.    

రైతులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..

దౌల్తాబాద్‌ : రైతులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని వీఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డితో కలిసి 504 రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, ఇటీవలే కురిన వర్షాలకు ఇండ్లు కూలిపోయిన 45 మంది బాధితులకు చెక్కులను అందజేవారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిల్లీకి దిమ్మతిరిగేల దుబ్బాక నియోజకవర్గ రైతులు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తీర్పునివ్వాలన్నారు. సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌,  ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు రహిమొద్దీన్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు ఉన్నారు.

దౌల్తాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ప్రారంభం..

మండల కేంద్రం దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌క్లబ్‌ను గురువారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో  ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకన్న, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, జర్నలిస్టులు శంభులింగం, నగేశ్‌, సంతోశ్‌, రాజిరెడ్డి, రాజు, దుర్గారెడ్డి, బాబు పాల్గొన్నారు.

సిద్దిపేటను విత్తనోత్పత్తి కేంద్రంగా మారుద్దాం ..

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో నియోజకవర్గంలోని 502 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు, అధిక వర్షాలకు ఇండ్లు కూలిపోయిన 154 మందికి ఒక్కొక్కరికీ రూ.3200 చొప్పున చెక్కులు, 220 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట రూ.2 కోట్ల 19 లక్షల 50 వేల చెక్కులను మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రెవెన్యూ శాఖలో ఇబ్బందులు ఉండకూడదని రెవెన్యూ ప్రక్షాళన చేయించారన్నారు. విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేట జిల్లాను మార్చుకుందామన్నారు. రైతులు ముందుకు వస్తే తోడ్పాటు అందిస్తామన్నారు. జిల్లాలో పామాయిల్‌ ఉత్పత్తికి అనుకూలమని ఢిల్లీ నుంచి ఆమోదం వచ్చిందన్నారు. శుక్రవారం రైతుబంధు సమితి, హర్టికల్చర్‌, ప్రజాప్రతినిధులతో విత్తనోత్పత్తిపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహణ చేస్తానన్నారు. కీరదోస సాగుకు భార్యాభర్తలు జంటగా ముందుకు రావాలన్నారు. 48 వేల ఎకరాలకు ఆయిల్‌ఫాం తోటలకు అనుమతి వచ్చిందన్నారు. నూనె ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం 19 మంది ముందుకొచ్చారన్నారు. ఎకరానికి రూ.లక్షా 50వేల ఆదాయం వస్తుందన్నారు. ఖమ్మం జిల్లా విజిట్‌కు రైతులను తీసుకెళుతామన్నారు. జిల్లాలో పామాయిల్‌, కీరదోస, విత్తనోత్పత్తి లక్ష్మంగా ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేట జిల్లాను మార్చుకుందామన్నారు. 


logo