శుక్రవారం 30 అక్టోబర్ 2020
Siddipet - Sep 24, 2020 , 01:39:10

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రేపటిలోగా పంపిణీ చేయాలి : కలెక్టర్‌

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రేపటిలోగా పంపిణీ చేయాలి  :  కలెక్టర్‌

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రతి ఇంటికీ 6 మొక్కలను రేపటిలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్‌, డీఆర్‌డీవో, పంచాయతీ అధికారులతో పలు అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో హౌస్‌హోల్డ్‌లో ఇప్పటివరకు అందజేసిన హరితహారం మొక్కల పంపిణీపై ఆరా తీశారు. మొక్కలనుపంపిణీ చేయని ఇండ్లకు వెంటనే అందజేయాలన్నారు. ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపే ధ్రువీకరణను సంబంధిత సర్పంచ్‌, కార్యదర్శి నుంచి తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ అమ్మకపు దస్తావేజు ఉన్న అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు తుది అవకాశం ఇచ్చిందన్నారు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో నిర్మాణ అవకాశం లేనందునా..  స్థలాలను రెగ్యులరైజ్‌ చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఆర్డీవోలు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రతి రోజు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రగతిని తమ పరిధిలోని సంబంధిత అధికారులతో సమీక్షించాలని సూచించారు. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేసేలా మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత వహించాలన్నారు. గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లతో నిత్యం చెత్త సేకరణ సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మీల్‌ఖాన్‌, డీపీవో సురేశ్‌, డీఆర్‌డీవో గోపాల్‌రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.