మంగళవారం 27 అక్టోబర్ 2020
Siddipet - Sep 24, 2020 , 01:39:12

విత్తనోత్పతి రంగం అభివృద్ధితో రైతుల ఆదాయం రెట్టింపు

విత్తనోత్పతి రంగం అభివృద్ధితో రైతుల ఆదాయం రెట్టింపు

  • u  ముందుకు వచ్చే కంపెనీలకు సంపూర్ణ సహకారం
  • u  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • u  విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ,  సీడ్‌ కార్పొరేషన్‌  అధికారులతో సమావేశం..  
  • u  23 సీడ్‌ కంపెనీల ప్రతినిధులు హాజరు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ :  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం జిల్లాలో మెరుగవ్వడంతో విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలంగా మారిందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బుధవారం రంగనాయకసాగర్‌ గెస్ట్‌ హౌస్‌లో విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్‌ కార్పొరేషన్‌ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. దేశంలో పేరెన్నికగన్న కావేరి, ప్రసాద్‌, గంగాకావేరి, యజ్ఞ, జెమిని, మోనోశాంట్‌, రాశి, కార్తీకేయ తదితర 23 సీడ్‌ కంపెనీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని ఐదు రిజర్వాయర్లతో వాతావరణంలో తేమ శాతం పెరుగడం, సారవంతమైన నేలలు, రాజధానికి జిల్లా చేరువలో ఉండడం, రహదారి సౌకర్యం, ఉద్యానవన విశ్వ విద్యాలయం, ఉద్యానవన, అటవీ పరిశోధన కేంద్రాలు, మొక్కజొన్న పొద్దుతిరుగుడు పరిశోధన కేంద్రం, నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ తదితర అన్ని అంశాల పరంగా సిద్దిపేట జిల్లా అనువుగా ఉందన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లలో 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండడంతో వేసవిలోనూ విత్తనోత్పత్తికి సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాలు సాగులో ఉండగా, ప్రస్తుతం జిల్లాలో సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా 1500 ఎకరాలు, ప్రైవేటు విత్తన కంపెనీల ద్వారా 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, కాటన్‌, బెంగాల్‌ గ్రామ్‌, వేరుశనగ, విత్తనాలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. 25 సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 3 కోల్డ్‌ స్టోరేజీలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇటీవలే ఆయిల్‌ పాం సాగుకు సైతం సిద్దిపేట అనుకూలమని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. రానున్న రోజుల్లో సంప్రదాయ పంటల స్థానంలో కనీసం లక్ష ఎకరాల్లో విత్తనోత్పత్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో విత్తనోత్పత్తి సాగు విస్తీర్ణం, అభివృద్ధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విత్తన కంపెనీలకు - రైతులకు ఇద్దరికి ప్రయోజనం విన్‌-విన్‌ పరిస్థితి ఉండడంతో సిద్దిపేట జిల్లాను సీడ్‌ గ్రోయింగ్‌ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విత్తన కంపెనీల సహకారం కావాలని మంత్రి కోరారు. విత్తనోత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు రైతులు - విత్తన కంపెనీ మధ్య సమన్వయానికి విశ్రాంత వ్యవసాయ అధికారులను నియమిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. వచ్చే యాసంగిలో విత్తన కంపెనీ యజమాన్యాలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని, విత్తనోత్పత్తి ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మొదటి విడుతలో విత్తన కంపెనీలకు విత్తనోత్పత్తికి సంబంధించి అన్ని రకాలుగా అనువైన గ్రామాలను కేటాయిస్తామన్నారు. కంపెనీ ప్రతినిధులు తాము జిల్లాలో యాసంగగి సీజన్‌లో ఎన్ని ఎకరాల్లో విత్తనోత్పత్తి చేపట్టనున్నారో తెలియజేయాలన్నారు. డ్రిప్‌, ఫాం మెకనైజేషన్‌కు ప్రభుత్వం సహకరిస్తామన్నారు. జిల్లాలో బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్న మహిళలను విత్తనోత్పత్తి రంగంలో భాగస్వాముయ్యేలా చూస్తామన్నారు.

 జిల్లాలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం : కలెక్టర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఐదు రిజర్వాయర్లను నిర్మించినట్లు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. 46వేల ఎకరాల భూమిని సేకరించారన్నారు. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూషన్‌ కాల్వలు నిర్మాణం పూర్తి చేశామన్నారు. రానున్న 5 నెలల్లో పిల్ల పంట కాల్వల నిర్మాణం కోసం మిగిలిన సుమారు 6 వేల భూమిని సేకరించి, నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడం, ఉపరితల సాగునీటి లభ్యత పెరగడంతో క్షేత్రస్థాయిలో విత్తనోత్పత్తికి జిల్లా అనుకూలంగా మారిందన్నారు. విత్తన అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తన కేంద్రంగా సిద్దిపేటను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

 విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంది 

విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలంగా ఉందని సీడ్‌ కార్పొరేషన్‌ డెవలప్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు అన్నారు. సీడ్‌ కార్పొరేషన్‌, సీడ్‌ సర్టిఫికేషన్ల ద్వారా జిల్లాలో సీడ్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. సమయం తక్కువగా ఉన్నందున కంపెనీలు సీడ్‌ ఉత్పత్తికి సన్నద్ధం కావాలన్నారు. 

 అన్ని విధాలుగా సహకారం

విత్తనోత్పత్తి కార్యకలాపాలను జిల్లాలో పెంచేందుకు మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని విత్తన కంపెనీల ప్రతినిధులు అన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి లభ్యత పెరగడంతో పాటు వాతావరణంలో తేమ శాతం పెరిగిందన్నారు. ఇది విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉందన్నారు. విత్తనోత్పత్తికి తాము అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. దశల వారీగా విత్తనోత్పత్తి కార్యకలాపాలను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారి, వ్యవసాయాధికారి అధికారి శ్రవణ్‌ కంపెనీ ఉత్తత్తిదారులు పాల్గొన్నారు.

ప్రజా, రైతు ఆదాయం పెంచడమే నిజమైన సేవ  : మంత్రి

నంగునూరు : రైతు, ప్రజా ప్రయోజనార్థం వారి ఆదాయాభివృద్ధి పెరిగేలా సేవ చేసినప్పుడే నిజమైన ప్రజాసేవ చేసిన వారమవుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేలోని శ్రేష్ఠ ఫంక్షన్‌ హాల్‌లో 52మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు కూలిపోయిన 152 మంది బాధితులకు నష్టపరిహారం, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు అంజవ్వ కుటుంబానికి రూ.5లక్షలు, కాల్వలో భూమి కోల్పోయిన ఎనిమిది మంది నిర్వాసితులకు నష్టపరిహారం, పశువులు మృతి చెందిన ఇద్దరు రైతులకు నష్టపరిహారం మొత్తం కలిపి 216మందికి రూ.77లక్షల30వేల432 విలువ గల చెక్కులను బుధవారం మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ విత్తనోత్పత్తి పని చేస్తే, రైతు ముఖంలో ఆనందం, సంతోషం చూస్తామని, అదే తన కోరిక అని మంత్రి అన్నారు. త్వరలోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి 1500 ఎకరాల్లో జర్కీన్‌ పంట పెట్టి, రైతులకు మేలు చేసేలా అండగా ఉండాలన్నారు. మల్చింగ్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా 70 రోజుల్లో కీరదోస సాగు చేస్తే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.లక్ష మిగులుతాయని, ఆ దిశగా రైతులను చైతన్యపర్చాలని ప్రజాప్రతినిధులను కోరారు. విత్తనాలు తయారు చేసేలా నంగునూరు మండల రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామంలో రైతువేదిక, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలు ఈ దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అంక్షాపూర్‌ సర్పంచు శ్రీనివాస్‌రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా, ఆయనను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo