సోమవారం 26 అక్టోబర్ 2020
Siddipet - Sep 23, 2020 , 01:57:15

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

  • n ప్రజలకు అవగాహన కల్పించాలి
  • n మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు,  ఎంపీవోలు బాధ్యత తీసుకోవాలి 
  • n కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సిద్దిపేట కలెక్టరేట్‌: మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్లాట్లు, లేఅవుట్‌ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేశారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోళ్లు చేసినవారు భవిష్యత్‌లో భవన నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేదని, ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి, స్థలాలను రెగ్యులరైజ్‌ చేసుకునేలా ప్రచారం నిర్వహించాలన్నారు. చేర్యాల, కొమురవెల్లి, సిద్దిపేట రూరల్‌, సిద్దిపేట పట్టణం, గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, హుస్నాబాద్‌, దుబ్బాక, దౌల్తాబాద్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రెగ్యులరైజేషన్‌ లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో అదనపు అదనపు కలెక్టర్‌ ముజమీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, జడ్పీ సీఈవో శ్రవణ్‌, డీఆర్డీవో గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌ పాల్గొన్నారు.

జాబ్‌చార్ట్‌పై అవగాహన ఉండాలి 

పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవో, ఎంపీడీవోలు తమ విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. అలాగే, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మంజూరు చేస్తున్న విధులు, వ్యయాలకు సంబంధించిన సమస్త సమాచారం పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవో, ఎంపీడీవోలు తెలుసుకోవడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీస్థాయిలో ప్రభుత్వ ఫ్లాగ్‌ షిప్‌ కార్యక్రమాల ప్రగతి రిపోర్టుపై చర్చించారు. ఈ విషయంపై కార్యదర్శులు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, సెక్రటరీల మధ్య సమన్వయం ఆశించినంతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యదర్శులు, ఎంపీడీవో, ఎంపీవోలకు సూచించారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 400 కోట్ల నిధులు ఉన్నట్లు కలెర్టర్‌ పేర్కొన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు వివరాలు గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఒకే పద్దు కింద కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. శిక్షణ ఏర్పాట్లు, సమన్వయం, సజావుగా జరిగేలా చూసేందుకు కమిటీ బాధ్యులుగా సిద్దిపేటకు డీఆర్డీవో, హుస్నాబాద్‌కు జడ్పీ సీఈవో, గజ్వేల్‌కు డీపీవోలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. 

కరదీపిక సిద్ధం చేయాలి 

వచ్చే మూడు రోజుల్లోగా అన్ని గ్రామపంచాయతీలు సమస్త సమాచారంతో మన గ్రామ పంచాయతీ పేరుతో కరదీపిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


logo