మంగళవారం 27 అక్టోబర్ 2020
Siddipet - Sep 23, 2020 , 01:57:16

సీఎం కేసీఆర్‌ది రైతుహితం

సీఎం కేసీఆర్‌ది రైతుహితం

తొగుట: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ రైతు హిత కార్యక్రమాలు చేపడుతుండగా, మోదీ సర్కారు రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నదని రైతాంగం మండిపడుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తొగుట మండలంలో 300 ట్రాక్టర్లతో ర్యాలీ తీసి, నిరసన తెలిపారు. తొగుట మీదుగా తుక్కాపూర్‌, మెట్టు, ఘనపూర్‌, గుడికందుల, కాన్గల్‌ మీదుగా తొగుట వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతామని రైతన్నలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దేవి రవీందర్‌, ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనిత లక్ష్మారెడ్డి, తొగుట, కొండపాక మండలాల రైతు బంధు కమిటీ అధ్యక్షులు కనకయ్య, దుర్గయ్య, ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు నర్సింహులు, గోవర్ధన్‌, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌, సొసైటీల వైస్‌ చైర్మన్లు పోచయ్య, యాదగిరి, కో అప్షన్‌ సభ్యులు ఎండీ కలీమోద్దీన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

బోరు మోటర్‌కు మీటర్‌ పెడితే రైతు బతికేదెలా?

వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడితే రైతు ఎలా బతకాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం కేవలం కార్పొరేట్‌ రంగాన్ని వ్యవసాయంలోకి రెడ్‌ కార్పెట్‌ పరిచేలా ఉందని, రైతులకు నష్టమే తప్ప లాభం లేదని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో మన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని ఆయన గుర్తు చేశారు. కొత్త బిల్లును ఉపసంహరించకుంటే గల్లీలో మొదలైన నిరసన సెగలు ఢిల్లీకి తగులుతాయని, బీజేపీ గద్దె దిగిపోవడం ఖాయమన్నారు.


logo