శుక్రవారం 23 అక్టోబర్ 2020
Siddipet - Sep 22, 2020 , 02:17:12

గులాబీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు

గులాబీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు

  •  నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  •  మూడు మండలాల సమావేశంలో నిర్ణయం

చేర్యాల : జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలను నియమించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారుతోపాటు పార్టీ నేతలపై ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు సాగిస్తున్న క్రమంలో వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు గ్రామ స్థాయిలో సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఇటీవల చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్స్‌లో జరిగిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన సమావేశంలో ఎమ్మెల్యే తెలిపారు. ఆయా మండలాలకు చెందిన మండల అధ్యక్షులతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి నూతనంగా యూత్‌ కమిటీలతో పాటు చురుకైన యువకుడిని సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా నియమించనున్నారు. అలాగే నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యం లో సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలతో పాటు యూత్‌ కమిటీల పాత్ర కీలకంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు నాయకులు తెలిపారు.

త్వరలో నియామకాలు.. 

పార్టీ నియమ, నిబంధనల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే క్షేత్ర స్థాయి కమిటీలున్నప్పటికీ వాటికి తోడుగా సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు, యువజన సంఘాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పథకాలకు మరింత ప్రచారం లభిస్తుందనే భావనతో ఎమ్మెల్యే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా ఆయా గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు వారి వారి సమస్యల వల్ల ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య, విష ప్రచారాలను ఎండగట్టలేకపోతున్నారని, దీంతో నూతన కమిటీల వేసేందుకు ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నూతన కమిటీలు వేసేందుకు పార్టీ బాధ్యులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి నేతృత్వంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలతోపాటు చేర్యాల టౌన్‌లో కమిటీలు వేయనున్నారు. 


logo