మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 22, 2020 , 02:17:14

అభివృద్ధి బాట తొగుట

అభివృద్ధి బాట తొగుట

  • n నాడు నిర్లక్ష్యం..  నేడు కొత్త వైభవం
  • n ఎమ్మెల్యే చొరవతో  మారుమూల గ్రామాలకు  మహర్దశ
  • n విస్తారంగా సీసీరోడ్లు,  అంగన్‌వాడీ,  గ్రామ పంచాయతీల నిర్మాణం
  • n ప్రారంభానికి సిద్ధమైన  డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు 
  • n జోరందుకున్న  రైతువేదికల నిర్మాణాలు
  • n ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తహసీల్‌ కార్యాలయం
  • n మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణతో పనుల్లో వేగం
  • n మండల అభివృద్ధిపై మంత్రి సమీక్షా సమావేశాలు

తొగుట : నాడు నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు నేడు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి తొగుట మండలానికి వన్నె తెస్తున్నాయి. కనీస వసతులు లేక తల్లడిల్లుతున్న గ్రామాల వికాసం కోసం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీసుకున్న చొరవ ఆ గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఏర్పడింది. తొగుట మండలంలో మేజర్‌ గ్రామాలుగా ఉన్న వెంకట్‌రావుపేట, ఘనపూర్‌, ఎల్లారెడ్డిపేట, గుడికందుల, గోవర్ధనగిరి తదితర గ్రామాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఆయా గ్రామాల్లో గతంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వయంగా పర్యటించగా, దుర్భర పరిస్థితులను చూసి చలించిపోయారు. అన్ని రంగాల్లో గ్రామాలను ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేయించారు. 2016-17 సంవత్సరానికి గానూ మండలంలోని వెంకట్‌రావుపేటకు రూ.45లక్షలు, ఎల్లారెడ్డిపేటకు రూ. 35లక్షలు, ఘనపూర్‌కు రూ.35లక్షలు, గోవర్ధనగిరికి రూ.20లక్షలు, గుడికందులకు రూ.15లక్షలు, జప్తిలింగారెడ్డిపల్లికి రూ.15లక్షలు, లింగాపూర్‌కు రూ.10లక్షలు, తుక్కాపూర్‌కు రూ.5లక్షలు, పెద్దమాసాన్‌పల్లికి రూ.8 లక్షలు, బండారుపల్లి, కాన్గల్‌, వర్ధరాజ్‌పల్లి గ్రామాలకు తలా రూ. 5లక్షల చొప్పున నిధులు కేటాయించారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా గ్రామానికి రూ.20 లక్షల చొప్పున సీసీ రోడ్లకు కేటాయించడంతో గ్రామాల దశ దిశలే మారిపోయాయి. వెంకట్‌రావుపేటలో మూడు, లింగాపూర్‌లో రెండు, ఘనపూర్‌ మూడు, ఎల్‌ బంజేరుపల్లి, లింగంపేట, గుడికందుల, వర్ధరాజ్‌పల్లి గ్రామాల్లో అర్ధంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ కేంద్రాలను ఉపాధి నిధుల(ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.3.50లక్షలు)తో పూర్తి చేయించి, అందుబాటులోకి తెచ్చారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గతంలో దశల వారీగా గ్రామాల్లో పక్కా పంచాయతీ భవనాల నిర్మాణానికి కృషి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో మండలంలోని వెంకట్‌రావుపేట, గోవర్ధనగిరి, లింగాపూర్‌, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, గుడికందుల, ఘనపూర్‌ గ్రామాలకు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం కోసం తలా రూ.13 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు చేశారు. నిధుల మంజూరుతో కొన్ని గ్రామాల్లో భవనాలు పూర్తి కావడంతో అందుబాటులోకి రాగా, మిగతా గ్రామాల్లో పనులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి గతంలో రూ.60 లక్షలు మంజూరు కాగా, ఆ నిధులతో పనులు పూర్తికాకపోవడంతో ఎస్డీఎఫ్‌ ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేయించి, పనులు పూర్తి చేయించారు. ఒకట్రేండు రోజుల్లో మంత్రి హరీశ్‌రావు దానిని ప్రారంభించనున్నారు. తొగుటలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి ఉపాధి హామీ ద్వారా రూ.10లక్షల నిధులు మంజూరు కాగా, త్వరలో పనులు ప్రారంభించనున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో గతంలో తొగుటలో మార్కెట్‌లో రూ.75లక్షల వ్యయంతో ఓపెన్‌ షెడ్‌, మార్కెట్‌ ముందు మెయిన్‌ రోడ్‌లో రూ.75లక్షల వ్యయంతో 17 దుకాణ సముదాయాలు నిర్మించారు. ఆ సముదాయంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 11 గ్రామాల్లో రూ.70లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. గుడికందులలో రూ.12లక్షలు, వర్ధరాజ్‌పల్లిలో రూ.9లక్షలు, బండారుపల్లి, పెద్దమాసాన్‌పల్లిలలో తలా రూ. 7లక్షలు, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్‌, జప్తిలింగారెడ్డిపల్లి, లింగాపూర్‌, వెంకట్‌రావుపేట, గోవర్ధనగిరి, చందాపూర్‌ గ్రామాలకు తలా రూ.5లక్షల చొప్పున సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి.

‘డబుల్‌ బెడ్‌రూం’ల నిర్మాణంలో ఆదర్శం

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల్లో తొగుట మండలం ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే వెంకట్‌రావుపేటలో 60, వర్ధరాజ్‌పల్లిలో 23, చిన్న ముత్యంపేటలో 22 డబుల్‌ బెడ్‌ రూం గృహ ప్రవేశాలు జరిగాయి. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 25, పెద్దమాసాన్‌పల్లిలో 20, బండారుపల్లిలో 20, గుడికందులలో 20 డబుల్‌ ఇండ్లు పూర్తయ్యాయి. త్వరలో లబ్ధిదారుల ఎంపిక అనంతరం గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. జప్తిలింగారెడ్డిపల్లిలో 25, కాన్గల్‌లో 20 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

పంచాయతీలకు ప్రత్యేక నిధులు

గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌చట్టం ద్వారా నిధులు మంజూరు చేయడం తో గ్రామ పంచాయతీల రూపు రేఖలు మారుతున్నాయి. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో హరితహారం, డంపింగ్‌ షెడ్ల నిర్మాణం, తడి, పొడిచెత్త సేకరణ, పంచాయతీలకు ట్రాక్టర్లు, ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు, వైకుంఠధామాల నిర్మాణం తదితర పనులతో గ్రామాల్లో అభివృద్ధి జోరందుకుంది.


logo