మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 21, 2020 , 00:04:11

ప్రజల మనిషి రామలింగన్న

ప్రజల మనిషి రామలింగన్న

మిరుదొడ్డి : నిత్యం ప్రజల మధ్యన ఉంటూ సాదాసీద జీవనం సాగించి, పేదల గుండెల్లో గూడుకట్టుకున్న గొప్పనేత దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీనియర్‌ జర్నలిస్టు వర్దెల్లి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిపై రాసిన ‘పార గమ్యత’ అనే పుస్త్తకాన్ని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వాగ్గేయ కారుడు గోరెటివెం కన్న, అందోల్‌ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్‌, మా నుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, టీయూడబ్ల్యూ నేతలతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రామలింగారెడ్డిపై ‘పార గమ్యత’ అనే పుస్తకాన్ని రచించడం ఎంతో సంతోషంగా ఉందని వర్దెల్లి వెంకటేశ్వర్లను మంత్రి అభినందించారు. గతంలో అచ్చంపేటలో తాను, రామలింగారెడ్డి కలిసి ‘మరణం అంచున చెంచులు’ అనే పుస్తకాన్ని ‘అడవి జాతిని రక్షించాలనే’ పుస్తకాన్ని, పిట్టవాలిన చెట్టు (మిషన్‌ భగీరథ పథకం)పై మరో పుస్తకాలను ఆవిష్కరించామని, కానీ.. నేడు రామలింగారెడ్డిపై రాసిన పుస్తకాన్ని నేను ఆవిష్కరించడంతో తన మనస్సు చలించి పోతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిసినప్పటికీ, ఎక్కడా ఆయన ధోరణి మారలేదన్నారు. నిత్యం పేదల కోసం తపించే వారని రామలింగారెడ్డిని కొనియాడారు. 

ప్రజాహృదయ నేత సోలిపేట: అల్లం నారాయణ 

కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణి, ప్రజా వ్యతిరేక బిల్లులు, కుట్రలతో దేశానికి ముప్పు ఉందని రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. 

లింగన్నలాగ నూటికి ఒక్కరు ఉంటారు:  వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న

ప్రజల కోసం నిత్యం తప్పించే వారు చాలా తక్కువగా ఉంటారని, అలాంటి వారిలో దివంగత నేత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉంటారని వాగ్గేయ కారుడు గోరెటి వెంకన్న అన్నారు. 

దుబ్బాక ఉద్యమాల గడ్డ : మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ అని, సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడి ప్రజలు ఉద్యమకారులుగా ఎదిగారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 

ఆర్‌ఎస్‌యూ చైర్మన్‌గా నియమించారు: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

అక్షరాల ఉద్యమాలు నేర్పించి.. పీపుల్స్‌ వార్‌ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌యూకు జూనియర్‌ కళాశాల చైర్మన్‌గా తనను నియమించిన ఘనత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికే దక్కిందని మానుకొండరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. 

రామలింగారెడ్డి ఆలోచన విధానం గొప్పది: అందోల్‌ ఎమ్మెల్యే కాంత్రికిరణ్‌ 

జర్నలిస్టుగా ఉన్న నాటి నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన జీవితాన్నే ప్రజల యుద్ధ్దంగా మలుచుకొని రామలింగారెడ్డి జీవనం గడపారని, నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి గొంతుకగా పనిచేశారని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. కార్యక్రమం లో ఎంపీపీలు గజ్జెల సాయిలు, సంధ్య, జడ్పీటీసీలు సూకురి లక్ష్మీ లింగం, రణం జ్యోతి శ్రీనివాస్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, జర్నలిస్టులు రమేశ్‌ హ జారి, మారుతి సారగ్‌, ఆస్మాల్‌, రమణ కుమా ర్‌,  టీఆర్‌ఎస్‌ నేతలు తదితరులు ఉన్నారు.


logo