మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 21, 2020 , 00:03:12

పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి

పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి

ఇన్నాళ్లు సాగునీరు లేక పడావుగా ఉన్న భూములు ప్రస్తుతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వానకాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు రికార్డు స్థాయిలో పంటలు సాగుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో సాగు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఎటుచూసినా జాలు పారుతున్న పొలాలు.. నీళ్లే కనిపిస్తున్నాయి. మత్తళ్లు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరంతరంగా జాలు నీళ్లతో కాల్వలు పారుతున్నాయి. దీంతో ఎక్కడా ఖాళీ జాగ కనిపించకుండా సాగు యోగ్యమైన ప్రతి అంగుళం భూమిలో రైతులు అచ్చుకట్టి పంటలు సాగుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత సాగుకు జైకొట్టారు. 3,28,448 మంది రైతులు 5,25,459 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. కొన్నిచోట్ల ముందుగా సాగుచేసిన వరి పంటలు కోత దశకు వచ్చాయి. మిగతా చోట్ల రాబోయే పది పదిహేను రోజుల్లో రానున్నాయి. పత్తి కాయ దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నది. కాగా, వ్యవసాయశాఖ యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నది. -సిద్దిపేట, నమస్తే తెలంగాణ

ఇన్నాళ్లు సాగునీరు లేక పడావుగా ఉన్న భూములు ప్రస్తుతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగింది. రికార్డుస్థాయిలో పంటలు సాగులోకి వచ్చాయి. పడావు భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లా సాగు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. మత్తళ్లు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరంతరంగా జాలు నీళ్లతో కాల్వలు పారుతున్నాయి. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో జిల్లాకు సాగునీరు వచ్చింది. ఈ వానకాలంలో రైతులు రికార్డు స్థాయిలో పంటలు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపారు. గోదావరి జలాలకు తోడు విస్తారంగా వర్షాలు కురవడంతో జలవనరులు కళకళలాడుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, తోటపల్లి ఆన్‌లైన్‌, తపాస్‌పల్లి రిజర్వాయర్లతో పాటు శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చాలా ఏండ్ల తర్వాత ఈ వానకాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఎక్కడా ఖాళీ కనిపించకుండా సాగు యోగ్యమైన ప్రతి అంగుళం భూమిలో రైతులు అచ్చుకట్టి పంటలు సాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రిత సాగుకు రైతులు జైకొట్టారు. 3,28,448 మంది రైతులు 5,25,459 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మొక్కజొన్న కేవలం 10,847 ఎకరాల్లోనే వేశారు. వరి, పత్తి, కంది పంటల సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2,26,921 ఎకరాల్లో వరి, 2,40,864 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ప్రస్తుతం వానకాలం పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నిచోట్ల ముందుగా సాగుచేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. మిగతా చోట్ల రాబోయే పది పదిహేను రోజుల్లో రానున్నాయి. పత్తి కాయ దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం చేస్తున్నది.  

యాసంగి సాగు ప్లాన్‌ ఇలా ...

ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగానే యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వానకాలంలో మొక్కజొన్న పంటను సాగుచేయవద్దని చెప్పిన ప్రభుత్వం, యాసంగిలో మొక్కజొన్న సాగుకు అనుమతి ఇచ్చింది. యాసంగిలో మొక్కజొన్న దిగుబడి అధికంగా వస్తుంది. వానకాలంలో ఆశించిన స్థాయిలో రాదనే ఉద్దేశంతోనే అప్పుడు సాగు చేయలేదు. దసరా పండుగ తర్వాత యాసంగి సాగు పనులు ప్రారంభమవుతాయి. ఈసారి జిల్లాలో 2,34,381 ఎకరాల్లో యాసంగి సాగు అవుతుందని అంచనా వేశారు. వీటిలో 28,102 ఎకరాలు మొక్కజొన్న, 1,97,987 ఎకరాల్లో వరి, 1463 ఎకరాల్లో వేరుశనగ, 3,502 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు సాగు కానున్నాయని, మిగతా ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా సాగు అంచనాను ఖరారు చేశారు.

సాగు విస్తీర్ణం పెరిగింది..

కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు గోదావరి జలాలు వచ్చాయి. ఈసారి వర్షాలు బాగా కురిశాయి. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పెరగడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 5,25,459 ఎకరాల్లో సాగుచేశారు. వానకాలం పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నిచోట్ల ముందుగా సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాం.  - శ్రావణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సిద్దిపేట


logo