శుక్రవారం 23 అక్టోబర్ 2020
Siddipet - Sep 20, 2020 , 00:54:26

వైద్యసేవలకు ‘వంద’నం..!

వైద్యసేవలకు  ‘వంద’నం..!

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దుబ్బాక నియోజకవర్గం.. నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉద్యమాల గడ్డగా, వెనుకబడ్డ ప్రాంతంగా పేరొందిన దుబ్బాక రాతను సీఎం కేసీఆర్‌ తిరగరాస్తున్నారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని మమకారం ఉంది. దీంతో దుబ్బాక అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాకలో వంద పడకల దవాఖానను మంజూరు చేశారు. ఈ దవాఖాన అందుబాటులోకి వస్తే దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు సరిహద్దు జిల్లాలు మెదక్‌, రాజన్న సిరిసిల్ల్ల, కామారెడ్డి జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

దుబ్బాక: ప్రస్తుతం దుబ్బాకలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో నిత్యం వందలాది మందికి వైద్య సేవలందుతున్నాయి. ప్రధానంగా ప్రసూతి వైద్య సేవలకు దుబ్బాక దవాఖానకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ దవాఖానలో దుబ్బాకతో పాటు పక్క జిల్లాల ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలతో పాటు అధునాతన భవనంలో వసతులు కల్పించేందుకు వంద పడకల భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇప్పటికే దవాఖాన భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 

కార్పొరేట్‌ తరహాలో....

కార్పొరేట్‌ దవాఖాన తరహాలో ప్రజలకు అన్ని వైద్య వసతులు అందించేందుకు దుబ్బాకలో వంద పడకల దవాఖానకు భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 80,490 ఫీట్ల వైశాల్యంతో విశాలమైన  20 గదులను నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్ల్లోర్‌లో 35,560 ఫీట్ల వైశాల్యంతో ఇన్‌పేషెంట్‌ గదులు, ఆపరేషన్‌ థియేటర్‌, సమావేశ మందిరం నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్ల్లోర్‌లో ఓపీ, ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగం, ఎముకల విభాగం, అత్యవసర సేవలు, నవజాత శిశు సేవలు, బ్లడ్‌బ్యాంక్‌ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ఫ్ల్లోర్‌లో ఇన్‌పేషెంట్‌ విభాగం, ప్రత్యేక వైద్యసేవల విభాగం, వైద్య సిబ్బంది విశ్రాంతి గదులు, సమావేశ మందిరం తదితర వాటిని నిర్మిస్తున్నారు.  అధునాతన హంగులతో భవన నిర్మాణం కొనసాగుతున్నది.

రూ.18.50 కోట్లతో ...

గతంలో సర్కారు దవాఖాన అంటే.. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అంటూ భయపడేవారు. టీఆర్‌ఎస్‌ హయాంలో సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు సర్కారు దవాఖానల్లో వైద్యసేవలు పొందుతున్నారు. మూడు జిల్లాల సరిహద్దున ఉన్న దుబ్బాకలోని సర్కారు దవాఖానలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతున్నారు. దుబ్బాకలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న ఉద్దేశంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి  వంద పడకల దవాఖాన మంజూరు చేయించారు. రూ.18.50 కోట్ల్లతో అధునాతన హంగులతో దవాఖాన భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి దవాఖాన భవన నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించేవారు. ఆయన మృతితో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో దవాఖాన నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సర్కారు దవాఖానతో భరోసా.. 

దుబ్బాక సర్కారు దవాఖానకు వస్తే రోగం నయమవుతుందని మాకు నమ్మకం. మా బిడ్డ పద్మకు కడుపునొప్పి వస్తే మా ఊరి దవాఖానలో చూపిస్తే తగ్గలేదు. దుబ్బాక సర్కారు దవాఖానకు తీసుకువచ్చినం. అపెండిక్స్‌ అని డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు నా బిడ్డ మంచిగ అయ్యింది. ఇదే ఆపరేషన్‌ ప్రైవేటు దవాఖానలో చేయిస్తే రూ.20 వేలు అయ్యేది. మాలాంటి పేదోళ్లకు సర్కారు దవాఖాన దేవాలయంగా మారింది.

- నీలవ్వ, పోతారెడ్డిపేట

చాలామందికి  మేలు జరుగుతాది...

దుబ్బాకలో వంద బెడ్‌ల దవాఖాన కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా భార్య, పిల్లలకు చిన్న రోగం వచ్చినా దుబ్బాక సర్కారు దవాఖానలోనే చూపిస్తాను. ప్రైవేటు దవాఖానలో పైసలు దండుగ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సారు దుబ్బాకలో పెద్ద దవాఖాన కట్టిస్తున్నందుకు మాలాంటి పేదోళ్లకు కష్టాలు తీరుతాయి. 

- ఇట్టబోయిన కేశవులు, దుబ్బాకlogo