సోమవారం 30 నవంబర్ 2020
Siddipet - Sep 19, 2020 , 02:21:13

లక్ష మెజార్టీతో గెలుస్తాం

లక్ష మెజార్టీతో గెలుస్తాం

  • n రెండో స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ పోటీ 
  • n బీజేపీకి ఓటేస్తే బోరుబావులకు మీట్లరు బిగిస్తరు 
  • n ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

మిరుదొడ్డి: దుబ్బాకలో జరుగబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అక్బర్‌పేటలో రూ.10 లక్షలతో నిర్మించిన అతిథి గృహం, 108 వాహనాన్ని జెండా ఊపి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి అల్మాజీపూర్‌, బేగంపేట, కూడవెల్లి, లింగుపల్లి గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం మిరుదొడ్డి బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అల్వాల గ్రామానికి చెందిన వంద మంది యువకులను టీఆర్‌ఎస్‌లో చేరగా, మంత్రి వారికి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీ లేదు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పాలనలో నియోజకవర్గ ప్రజలు తాగు,సాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు తాగు నీటిని మిషన్‌ భగీరథతో ఇంటింటికీ అందజేస్తున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తాగు,  సాగు నీరు     

ఏండ్ల తరబడి దుబ్బాక ప్రజలకు తాగు, సాగు నీరు ఇయ్యని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దుబ్బాక నియోజవర్గానికి కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు, ప్యాకేజీ 13 ప్రధాన కెనాల్‌ ద్వారా లక్షా 25 వేలు ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు.  

బోరు బావులకు మీటర్లు బిగించనున్న బీజేపీ 

సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ అందజేస్తున్నారు. బీజేపీ మాత్రం బోరు బావులకు మీటర్లను బిగించి రైతుల నుంచి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో బీజేపీకి ఓటు వేయకుండా కరెంటు బిల్లుపై రైతులు నిరసన తెలుపాలన్నారు.  

అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తాం..

అర్హులైన బీడీ కార్మికులకు నూతన పింఛన్లను మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకలో  56,906 మందికి వివిధ రకాల పింఛన్లను అందిస్తున్నదన్నారు. నూతనంగా మరో 5,077 మంది బీడీ కార్మికులకు పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, మిగిలిన వారికి త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.  

మూడు 108 వాహనాలు

దుబ్బాక ప్రజల సౌకర్యార్థం 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. మరో 15 రోజుల్లో చేగుంటకు 108 వాహనాన్ని సమకూర్చుతామన్నారు. సమావేశం అనంతరం కూడవెల్లి వాగుపై నిర్మాణమవుతున్న హైలెవల్‌ బిడ్జిని సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ.ఫారూఖ్‌ హుస్సేన్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీసీబీ ఉమ్మడి మెదక్‌ జిల్లా చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌కే మా ఓట్లు ..

రాయపోల్‌: అభివృద్ధిలో ఆదర్శంగా ఉండేందుకు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని రాయపోల్‌ మండలం గొల్లపల్లి, ఉదయాపూర్‌ గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం జోరు వర్షంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు, యువకులు మంత్రి హరీశ్‌రావుకు ఎదురొచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదస్‌ అన్నపూర్ణ, సర్పంచ్‌ శేకమ్మ, ప్రజలు పాల్గొన్నారు.

బిల్లు ఆపి ఓట్లు అడగండి..

దౌల్తాబాద్‌: బీజేపీ నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తే.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బోరుబావుల దగ్గర కరెంట్‌ మీటర్లు బిగించే బిల్లును ఆపి ఓట్లు అడగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని గువ్వలేగి, గోవిందాపూర్‌, కొనాయిపల్లి, ఇందుప్రియల్‌ గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గువ్వలేగిలో పంచాయతీ, బీడీ కార్మికుల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గోవిందాపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీహాల్‌ ప్రారంభించి, ఆర్‌అండ్‌బీ సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ గోదాం ప్రారంభించారు. కొనాయిపల్లిలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు. అనంతరం ఇందుప్రియల్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, మత్స్యకారుల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ  సంధ్య, జడ్పీటీసీ రణంజ్యోతి, పార్టీ మండలాధ్యక్షుడు  శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.