మౌలిక వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీ

- n త్వరలో ఎర్రవల్లి గ్రామస్తులకు ఇండ్ల కేటాయింపు
- n నిర్వాసితుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
- n సమస్యల పరిష్కారానికి ప్రత్యేకాధికారులు
గజ్వేల్/గజ్వేల్ అర్బన్: ముంపు గ్రామాల ప్రజల కోసం అన్ని వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మిస్తున్నామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ ప్రజలతో శుక్రవారం గజ్వేల్ ఐవోసీలోని గడా సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎర్రవల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ.. గజ్వేల్ నడిబొడ్డున 600 ఎకరాల్లో అతిపెద్ద కాలనీని సకల సౌకర్యాలతో చేపడుతున్నామన్నారు. కొవిడ్-19 కారణంగా 4నెలలు పనులు ఆలస్యమయ్యాయని, మూడు నెలల్లో గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామన్నారు. అప్పటివరకు గజ్వేల్‌లో నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్లలో తాత్కాలిక వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎర్రవల్లి గ్రామ ప్రజలే కుల పెద్దలతో కమిటీ వేసుకుని ప్లాట్ల కేటాయింపు చేసుకునేలా లేఅవుట్ మ్యాప్‌ను గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. అందరి ఆమోదంతో గ్రామస్తులు లే అవుట్లో ప్లాట్లను కేటాయించుకోవాలని కోరారు.
దేశంలోనే మెరుగైన పరిహారంతో వసతి..
నిర్వాసితులకు మెరుగైన ఉపాధి, పునరావాసం ప్యాకేజీ అందించి తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగం వల్ల ఇతరుల భూములకు రేట్లు పెరిగినప్పుడు త్యాగం చేసిన వారికి కేటాయించిన ప్లాట్ల రేట్లు సైతం పెరగాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. అందుకే మల్లన్నసాగర్ ముంపు బాధిత గ్రామాల ప్రజలకు గజ్వేల్ పట్టణంలో దేశంలో మొట్టమొదటి సారి 600 ఎకరాల్లో 6000 ప్లాట్లను మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామాలను వెంటనే ఖాళీ చేసి సంగాపూర్ డబుల్ బెడ్రూం ఇండ్లలో తాత్కాలికంగా ఉండడానికి ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. నిర్వాసితుల పశువుల కోసం కూడా షెడ్లను నిర్మిస్తామన్నారు. గ్రామంలో ఖాళీ చేసిన నిర్వాసిత కుటుంబాలకు వెంటనే ప్లాట్లను, ఇండ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి చెప్పారు. గజ్వేల్ పట్టణంలో అన్ని వసతులతో నిర్వాసితులకు కాలనీని నిర్మించడంపై సమావేశంలో పాల్గొన్న ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తాము స్వచ్ఛందంగా ఇండ్లను ఖాళీ చేసి నూతన కాలనీలో తమకు కేటాయించిన ప్లాట్లల్లో ఇండ్లు నిర్మించుకుంటామన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేకాధికారులు
ముంపు గ్రామాల ప్రజాసమస్యలను, విజ్ఞాపనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి అధికారులు గ్రామంలోనే ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. చట్టం ప్రకారం ప్రతి అర్జీని పరిష్కరిస్తామన్నారు. ప్రతి అర్జీకి రాత పూర్వక సమాధానం ఇస్తామన్నారు. ఎర్రవల్లి ప్రజలకు అన్యాయం జరిగినట్టు భావిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ తహసీల్దార్ అన్వర్, కొండపాక తహసీల్దార్, ఎర్రవల్లి సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం