ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 17, 2020 , 02:53:20

దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ

దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ

  • n దుబ్బాక, సిద్దిపేట రెండు కండ్లు 
  • n త్వరలో చెరువులు, కుంటల్లోకి కాళేశ్వరం జలాలు
  • n దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే
  • n ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాక టౌన్‌: సీఎం కేసీఆర్‌కు దుబ్బాకపై అమితమైన ప్రేమ ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాకలోని 9 వార్డుల్లో రూ.80 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రామసముద్రం చెరువు కట్టపై రూ.10 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన అల్ట్రా మోడల్‌ షీ టాయిలెట్లను ప్రారంభించారు. గాంధీ వద్ద రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రూ.35 కోట్ల నిధులను మం జూరు చేశారన్నారు. వాటితో అభివృద్ధ్ది పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. పట్టణంలో చిన్నచిన్న గల్లీలను పెద్దవిగా చేయడం, పాత మురుగు కాల్వల స్థానంలో నూతనంగా ఆర్‌సీసీ మురుగు కాల్వలను నిర్మించేందుకు ప్రతి వార్డుకు రూ.10 లక్షలు కేటాయించామన్నారు. నియోజకవర్గంలోని లక్షా 30 వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించేందుకు ఆరు నెలల్లో పిల్ల కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేసి చెరువులు, కుంటలు నింపుతామని మంత్రి చెప్పారు.  

సోలిపేట మరణం తీరని లోటు..

సోలిపేట రామలింగారెడ్డి మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన హయాంలో నిర్మించిన 800 డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చదువుకున్న బడి నిర్మాణం కూడా పూర్తి కావడంతో ఆ బడిని సైతం రామలింగారెడ్డి కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.  నియోజకవర్గంలో  56,906 ఆసరా పింఛన్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందజేస్తున్నదని మంత్రి చెప్పా రు. వీరిలో 20 వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతిని ఇస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో కొత్తగా 1300 పింఛన్లు ఈ నెల నుంచే ఇస్తున్నామన్నారు.  

దుబ్బాక, సిద్దిపేట రెండు కండ్లు..

సిద్దిపేట తరహాలో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నేనే బాధ్యత తీసుకుంటానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కండ్లన్నారు. పట్టణంలో జంక్షన్ల నిర్మాణంతో పాటు రూ.4 కోట్లతో టౌన్‌హాల్‌ను నిర్మిస్తామన్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రామసముద్రం చెరువును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట  అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, తహసీల్దార్‌ రాంచంద్రం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి, కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ బండి శ్రీలేఖరాజు, రేకులకుంట మల్లన్న ఆలయ చైర్మన్‌ రొట్టె రమేశ్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ. ఆసీఫ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, నాయకులు మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రామస్వామి, అమ్మన రవీందర్‌రెడ్డి, సద్ది రాజిరెడ్డి  పాల్గొన్నారు. 

19 పంచాయతీలకు కొత్త భవనాలు

దుబ్బాక నియోజకవర్గంలోని 19  పంచాయతీలకు కొత్త భవనాల నిర్మాణాల కోసం పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. బుధవారం దుబ్బాకలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో పంచాయతీ భవనాల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో పంచాయతీ భవనానికి  రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  

ఆప్యాయంగా మంత్రి మాట ముచ్చట 

దుబ్బాక: అమ్మా.. నీకు పింఛన్‌ వస్తుందా..? అక్కా.. మీ ఇంట్లో  నల్లా నీరు వస్తుందా...? కాలనీలో ఏమైనా ఇబ్బందులున్నాయా..?అంటూ జనాన్ని మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరో పక్క జనంతో మమేకమయ్యారు. వార్డుల్లో ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 16వ వా ర్డులో ఆలేటి రాజవ్వ చేనేత వృద్ధ్దురాలి ఇంటి వద్దకు వెళ్లిన మంత్రి హరీశ్‌రావు.. అమ్మా నీకు పింఛన్‌ వస్తుందా.. అంటూ ఆప్యాయంగా అడిగారు. ఇం దుకు రాజవ్వ.. సీఎం కేసీఆర్‌ సారూ.. పెద్ద కొడుకులా నెలకు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తున్నాడంటూ సంతోషంగా చెప్పింది. మరో వార్డులో ఆశ కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..సర్కారు దవాఖానలో ప్రజలకు వైద్య సేవలు సరిగా అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. కొవిడ్‌-19లో  మీ సేవలు మరిచిపోలేనివంటూ మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. మరో వార్డులో పిచ్చి మొక్కలు తొలిగిస్తున్న పారిశుధ్య కార్మికులతో వారి వేతనాల గురించి తెలుసుకున్నారు. గతంలో దుబ్బాక  పంచాయతీగా ఉన్నప్పుడు తక్కువ వేత నం వచ్చేదని,  మున్సిపాలిటీ కావటంతో నెలకు రూ.10 వేలకు పైగా వేతనం వస్తుందని కార్మికులు  సంతోషంగా చెప్పారు. logo