ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 16, 2020 , 03:10:57

ప్రతీ అంగుళం డిజిటల్‌ సర్వే

ప్రతీ అంగుళం డిజిటల్‌ సర్వే

సిద్దిపేట, నమస్తే తెలంగాణ :  క్షేత్రస్థాయిలోప్రతి అంగుళం భూమిని డిజిటల్‌ సర్వే ద్వారా సమగ్ర సర్వే చేపట్టి మ్యాప్‌లు అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీంతో ఇక భూతగదాలు, గెట్ల పంచాయతీలకు తెరపడనున్నాయి. ఈ ధరణి పోర్టల్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యవసాయ భూమి, రెండో వ్యవసాయేతర భూమి ఉండనున్నది. ఎవరు వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసుకున్న తమ భూముల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. 

ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాలను ఎవరు మార్చడానికి వీల్లేకుండా సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన రక్షణ చర్యలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లను ట్యాంపరింగ్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో భూములకు రక్షణ చట్టంలా ధరణి వెబ్‌సైట్‌ నిల్వనున్నది. 

నూతన చట్టంతో ఎంతో మేలు..

నూతన రెవెన్యూ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. కొత్త చట్టం రాగానే జిల్లా వ్యాప్తంగా రైతులు తమ పంట పొలాల వద్ద పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించుకున్నారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ భూములు 6,31,811 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 47,533, అటవీభూములు 54,791, అసైన్డ్‌ భూములు 38,755 ఎకరాల్లో ఉన్నాయి. ఇక జిల్లాలోని రైతు ఖాతాలు 3,44,234 ఉండగా, పట్టాదారు పాస్‌ పుస్తకాలు 2,85,200 ఉన్నాయి. వీటి ఆధారంగానే రైతులకు ఏటా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంతో క్షేత్రస్థాయిలో భూములను డిజిటల్‌ సర్వే చేపట్టి భూ వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాలను ఎవరు మార్చడానికి వీల్లేకుండా సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన రక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టింది. డాక్యుమెంట్లను ట్యాంపరింగ్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాకుండా సమూల మార్పులను తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లాలో కొత్త మండలంతో కలుపుకొని 24 మండలాలున్నాయి. 

ఇక నూతన చట్టంతో రూపాయి లంచం లేకుండా పూర్తి పారదర్శకతతో తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక వసతుల కల్పనకు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో కావాల్సిన నిధులను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో అంతా పారదర్శకం ఉండనున్నది. అమ్మకం, కొనుగోలుదారులు ఇద్దరు కలిసి ఆన్‌లైన్‌లో తమ వివరాలతో దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించగానే రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుక్‌ అవుతుంది. తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్‌, ఐరీస్‌ ,వేలిముద్రలు తీసుకుంటారు. అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి మ్యుటేషన్‌తో పాటు పాస్‌ పుస్తకంలో వివరాలు ప్రింట్‌ అవుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే భూముల వివరాలను కంప్యూటరీకరించారు. ప్రత్యేకంగా డ్రైవ్‌లు ఏర్పాటు చేసి రైతుల వివరాలతో పాటు, ఎంత భూమి ఉంది? అసైన్డ్‌ భూములు ఇతర వివరాలను నమోదు చేసి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీని ఆధారంగానే రైతులకు ప్రతి ఏడాది రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది.

భూముల ధరలు పెరుగడంతో..

కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లా సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రతి ఒక్కరూ సాగు వైపు దృష్టి సారించారు. దీంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఒకప్పుడు ఎందుకు ప్రస్తుత పరిస్థితుల్లో భూములు అమ్మడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. పట్నం నుంచి పల్లెలకు వచ్చి సాగుపై దృష్టి పెట్టారు. ఇదివరకు ఎకరాకు 10 లక్షలు పలికిన ధర ప్రస్తుతం ఎకరాకు 20 లక్షల పై మాటే పలుకుతున్నది. ప్రస్తుతం ఈ భూముల ధరలు భారీగా పెరుగడంతో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకున్నారు. అసైన్డ్‌ భూముల్లో పట్టాలు పొందినవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతరులకు అమ్మరాదు, కొనరాదు, కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒప్పంద పత్రాలతో పెద్దఎత్తునే క్రయ విక్రయాలు జిల్లా లో జరిగాయి. ఇటువంటి భూములు చాలా వరకు భూ మాఫీ యా చేతిలోకి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే ఇలా జరిగిందన్న విమర్ళలు బలంగా ఉన్నా యి. అసైన్డ్‌ భూములు ఎవరి పరిధిలో ఉన్నాయే లెక్కలు తేల్చనున్నట్లు సమచారం. జిల్లాలో 15 మంది సర్వేయర్లు పని చే స్తుండగ, తాత్కాలిక పద్ధతిలో మరో 5 మంది పని చేస్తున్నారు.


logo