బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 16, 2020 , 03:11:17

ప్రతిపక్షాలది.. అవివేకం

ప్రతిపక్షాలది..  అవివేకం

  • n వాపును చూసి బలుపు అనుకోవద్దు
  • n మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
  • n పేదల సంక్షేమం కోసమే పని చేస్తున్న సీఎం కేసీఆర్‌
  • n దుబ్బాక, సిద్దిపేట జోడెడ్లలాంటివి
  • n రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి   తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాక టౌన్‌ :  ఇప్పుడు దుబ్బాకలో ఎన్నికలు వచ్చినయని మైకు పట్టుకొని మాట్లాడితే నిజాలు నిజాలు కాకుండా పోతాయా? అబద్ధాలు ప్రజలకు తెలియవా? ప్రజలు చాలా తెలివైనవారు.. ప్రజల కోసం పని చేసేవారు ఎవరో వారికి తెలుసు.. ప్రతిపక్షాలు వాపును చూసి బలుపు అనుకోవడం వారి అవివేకమని మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దుబ్బాకలో మంగళవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని ప్రారంభించి వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్‌ యార్డు ఆవరణలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో 142 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 36 మహిళా గ్రూపులకు రూ.2.13కోట్ల రుణాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో ఓట్లు అడుగుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో బీడీ కార్మికులను ఆదుకున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోని బీడీ కార్మికుల కోసం ఆలోచించలేవన్నారు. పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని...ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. 70 ఏండ్ల పాటు ఓట్లు వేయించుకున్న పార్టీలు గుటికెడు నీళ్లు ఇవ్వలేదన్నారు. నీళ్లు తెచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాతనే  దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాకకు తాగునీటి గోస తీరిందన్నారు. చావు కాడ, పెండ్లి కాడ కష్టాల్లో, దు:ఖాల్లో నిలబడ్డది రామలింగారెడ్డేనన్నారు. పేద ప్రజల బిడ్డ రామలింగారెడ్డి అని మంత్రి అన్నారు. 

దుబ్బాక, సిద్దిపేట జోడెడ్లలాంటివని, వీటిని అభివృద్ధి పథంలో తీసుకపోయే బాధ్యత సీఎం కేసీఆర్‌ తనపై ఉంచాడని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామలింగారెడ్డి ఆశయాల మేరకు దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంక్రాంతి గంగిరెద్దుల్లా వచ్చే కొత్త కొత్త పార్టీల నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, జట్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

కూడవెల్లి వాగు  సందర్శన..

దుబ్బాక మండలం చిట్టాపూర్‌ శివారు గుండా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగును దుబ్బాక-రామాయంపేట రహదారిపై నుంచి మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. జలకళతో వాగు పారుతుండటం చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాకు కాళేశ్వరం జలాల రాకతో పాటు ఈ యేడు సమృద్ధిగా వర్షాలు కురియడంతో కూడవెల్లి వాగు జోరుగా పారుతుందని మంత్రి మురిసిపోయారు. రాబోయే రోజుల్లో ఏడాదంతా ఇదే తరహాలో జలకళ సంతరించుకుంటుందన్నారు.


logo