శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 15, 2020 , 03:00:03

జిల్లాలో జోరుగా వర్షం

జిల్లాలో జోరుగా వర్షం

  • రామాయంపేట మండలం డీ. ధర్మారం 
  • పెద్దవాగులో కొట్టుకుపోయిన బైక్‌
  •  వాటర్‌మెన్‌ను కాపాడిన గ్రామస్తులు

రామాయంపేట: రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పెద్దచెరువు వాగులో ద్విచక్ర వాహనం కొట్టుకుపోయిన ఘటన రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలోని సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వాటర్‌మెన్‌ ఎర్రొళ్ల ఎల్లయ్య గ్రామానికి నీరు విడిచేందు పెద్దవాగును దాటుతూ  బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించాడు.వాగులోని నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో వాగులోనే బైకును పట్టుకుని ఆగిపోయాడు. వెనుక నుంచి వస్తున్న కొంతమంది రైతులు చూసి బైక్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. వాగులో నీరు ఎక్కువ కావడంతో బైక్‌ను వదిలిపెట్టి వాటర్‌మెన్‌ను వాగులోనుంచి బయటకు తీసుకొచ్చారు. బైక్‌ మాత్రం వాగులోనే కొట్టుకుపోయింది. డి.ధర్మారం-చేగుంట వచ్చే మార్గాన్ని గ్రామస్తులు తాత్కాలికంగా నిలిపివేశారు.

నిజాంపేటలో..

నిజాంపేట: నిజాంపేటతో పాటు బచ్చురాజ్‌పల్లి, కల్వకుంట, నార్లపూర్‌ ,నస్కల్‌, రాంపూర్‌, తిప్పనగుల్ల, నందిగామ, నందగోకుల్‌ తదితర గ్రామాల్లో  జోరుగా వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలు వీధులు జలమయ్యాయి.

వెల్దుర్తిలో మోస్తరు వర్షం 

వెల్దుర్తి: రెండు రోజులుగా మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో చెరువులు, కుంటలలోకి  నీళ్లు వచ్చాయి. వెల్దుర్తి శివారులోని హాల్దీవాగుపై ఉన్న రెండు చెక్‌డ్యాంలు  పొంగి పొర్లడానికి సిద్ధంగా ఉన్నాయి. శెట్‌పల్లి, బండపోసాన్‌పల్లి, రామాయిపల్లి, ఉప్పులింగాపూర్‌, కుకునూర్‌, దామరంచ గ్రామాల్లో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. 

చిన్నశంకరంపేటలో..

చిన్నశంకరంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది.వర్షం కురువడంతో   చెరువు, కుంటల్లోకి నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


logo