మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 13, 2020 , 00:25:10

దొంగల రిమాండ్‌

దొంగల రిమాండ్‌

సిద్దిపేట టౌన్‌ : సీసీ కెమెరాలు నేరస్తులను పట్టించడంలో కీలకంగా మారుతున్నాయి. ఇటీవల బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి దొరికినంతా దండుకున్న ఇద్దరు దొంగలను సీసీ కెమెరాలు పట్టించాయి. వన్‌టౌన్‌ సీఐ సైదులు శనివారం కేసు వివరాలను వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన రంజాన్‌ అలీ.. ఈ నెల 4న సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో ఉంటున్న బంధువు ఇంటికి వచ్చాడు.

తిరిగి నాగదేవత ఆలయం బైపాస్‌ మీదుగా బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అమీర్‌, ప్రణయ్‌.. బైక్‌పై వస్తున్న రంజాన్‌ అలీని అడ్డుకొని దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు చేయగా, ఎస్సై రాజేశ్‌ను నియమించి, క్రైం పార్టీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా నాగదేవత ఆలయం, ముస్తాబాద్‌ రోడ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగానే నిందితులను అదుపులోకి తీసుకొని రూ.5,500 నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, బైక్‌ను సీజ్‌ చేశామని తెలిపారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను శనివారం జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించామని తెలిపారు. 


logo