శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 12, 2020 , 03:08:56

ఇక తహసీల్‌లోనే..!

ఇక తహసీల్‌లోనే..!

  • ఏక కాలంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌
  • l వ్యవసాయ భూముల    క్రయవిక్రయాలు ఇక పారదర్శకం
  • l కొత్త రెవెన్యూ చట్టంతో    రైతులకు మెరుగైన సేవలు
  • l రైతులకు తప్పనున్న      వ్యయప్రయాసాలు
  • l ఉమ్మడి జిల్లాలో 71 తహసీల్దార్‌       కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు
  • l 2018లో పైలట్‌ ప్రాజెక్టు కింద     జగదేవ్‌పూర్‌లో సేవలు ప్రారంభం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో ఇక తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లు చేసి రైతులకు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ సంస్కరణలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. తహసీల్దార్లకు సబ్‌ రిజిస్టర్‌ అధికారాలను ప్రభుత్వం కల్పించింది. కాగా, 2018 మే లోనే  ఫైలట్‌ ప్రాజెక్టు కింద గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో మంచి ఫలితాలొస్తున్నాయి. రైతులకు మెరుగైన సేవలందుతున్నాయి. ఇవాళ అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్లను చేయనుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 71 తహసీల్‌ కార్యాలయాల్లో..

సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని 9 రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న ధూళిమిట్ట మండలంతో కలుపుకొని 71 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లను చేస్తారు. ఇది వరకు రిజిస్ట్రేషన్‌ ఒక చోట , మ్యుటేషన్‌ మరో చోట ఉండేది దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇన్నాళ్లు ఫౌతీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇక నుంచి ఫౌతీ ఉండదు. కుటుంబ సభ్యులు మాట్లాడుకొని స్లాట్‌ బుక్‌ చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ సంతకాలు చేసి,  తహసీల్దార్‌ వద్దకు వెళ్తే, గంట లోపే పని పూర్తవుతుంది.        

రైతులకు తప్పనున్న వ్యయప్రయాసాలు..

ఇక నుంచి రైతులు తమ వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తమ పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయయాలకు వెళ్లాల్సి ఉంటుం ది.  ఇది వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్ళేవారు. కొత్త చట్టంతో రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పుతాయి. రిజిస్ట్రేషన్లను ఇక తహాసిల్దార్‌ కార్యాలయాల్లోనే చేస్తారు. డాక్యుమెట్లను ఎవరికి వారు సొంతగా రాసుకునే వెసులుబాటును  ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించిన నమూన ప్రతి కాపీని అందుబాటులో ఉంచుతారు. రాసుకోవడానికి వీలు పడనివారు నిర్ధేశిత రుసుము చెల్లించి రాయించుకోవచ్చును. ప్రతి మండలంలో రాసే వారికి ప్రభుత్వం లైసెన్‌లు కూడా ఇస్తుంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే, రైతులకు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, మార్టిగేజ్‌, సెల్‌డీడ్‌, గిఫ్ట్‌డీడ్‌, క్యాన్సలేషన్‌, ఈసీ అందిస్తారు. కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవసరమయ్యే స్కానర్‌, కంప్యూటర్లు, కెమెరాలు అవసరం మేరకు  ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. వ్యవసాయేతర భూములను ప్రస్తుతమున్న సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కుల ధ్రువీకరణ పత్రాలను ఇక నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల్లో ఇవ్వనున్నారు. భూ సమస్యలను అధిగమించేందుకు డిజిటల్‌ సర్వేను చేపట్టి భూ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద 2018లోనే జగదేవ్‌పూర్‌ 

2018లో జగదేవ్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని, రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఇక్కడ అన్ని రకాల సేవలను అందించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 2018 మే మాసంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. 2018లో 1,380 రిజిస్ట్రేషన్లను చేశారు. 2019-2020లో 2,581 రిజిస్ట్రేషన్లు కాగా, 2020-21 ప్రస్తుత సమయానికి 1,709 రిజిస్ట్రేషన్ల చేసినట్లు అధికారుల ద్వారా అందిన సమాచారం. అన్ని రకాల సేవలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలిగింది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 71 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్లు జరుగనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో తప్పులు సరి చేయాలి

- పాముల జనార్దన్‌, విశ్రాంత తహసీల్దార్‌, సంగారెడ్డి 

భూ రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి కంప్యూటర్‌ వచ్చినా తప్పిదాలు జరిగినయ్‌. రెవెన్యూ రికార్డులు, వ్యవస్థ గురించి అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. ఆన్‌లైన్‌ నమోదులో రైతులవారీగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చూసి పనిచేశారు తప్పా.. తప్పులు సరి చేయలేదు.  రెవెన్యూ శాఖలో తప్పులు చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, భూ సమస్యలు లేని విధంగా రికార్డులు సరిచేస్తే రైతుల సమస్యలు తొలిగిపోతాయి. పని కావాలంటే పైసలు ఇవ్వాలని వీఆర్వోలు రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం రైతు అభివృద్ధికి పాటుపడుతూ పంటలు వేసే ముందే పెట్టుబడి సాయం అందించ డం గొప్ప విషయ ం. రైతు బంధు, బీమా పథకాలు అమలు చేయడం తో అన్నదాతలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. కాబట్టి రైతాంగానికి భూ సమస్యలు లేకుండా చేయడం అధికారుల కర్తవ్యం. అంతేకాకుండా ప్రభుత్వం ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాపాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్‌ దగ్గర జరిగేలా కొత్త చట్టం అమలు చేయడం మంచిదే. ముందుగా ధరణి వెబ్‌సైట్‌లో రైతుల భూ సమస్యలు సరిచేసి నూతన విధానానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడే రైతుల భూ సమస్యలు పూర్తిగా దూరమవుతాయి.logo