శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 11, 2020 , 03:04:38

వీఆర్వో, వీఆర్‌ఏలకు సర్కారు భరోసా

వీఆర్వో, వీఆర్‌ఏలకు సర్కారు భరోసా

  • n వీఆర్వోలకు ఉద్యోగ భద్రత.. వీఆర్‌ఏలకు పేస్కేల్‌ పోస్టు
  • n ఇతర శాఖల్లో సర్దుబాటు
  • n ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వీఆర్వోలు 595 మంది,  వీఆర్‌ఏలు 3,175 మంది
  • n హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : ఎన్నో ఏండ్లుగా గ్రామ స్థాయిలో భూ వ్యవహారాల్లో కీలకంగా మారిన వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీఆర్వోల కు ఉద్యోగ భద్రత, వీఆర్‌ఏలకు పే స్కేలు ఉద్యోగం ఇవ్వనున్నది. ఏ ఒక్క ఉద్యోగిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసివేయమని చెప్పడంతో పాటు వారికి ఉద్యోగ భద్రతను కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టడం వారికి భరోసానిచ్చింది. వీఆర్వో, వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్న ప్రకటన ఊరటనిస్తున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వీర్వోలు 595 మంది, 3175 మంది వీఆర్‌ఏలు పని చేస్తున్నారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ ఉద్యోగం కల్పించడంపై ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలున్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది రెవెన్యూ డివిజన్లు, 71(ధూళిమిట్టతో కలుపుకొని ) మండలాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 384, మెదక్‌ జిల్లాలో 381, సంగారెడ్డి జిల్లాలో 600 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం 1365 రెవెన్యూ గ్రామాలు, 1615 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మూడు జిల్లాల్లో కలుపుకొని  మొత్తం 785 వీఆర్వో పోస్టులకు గానూ 595 మంది పని చేస్తున్నారు. 3,833 మంది వీఆర్‌ఏలకు గానూ 3,175 మంది వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లాలో 263 మంది వీర్వోలకు గానూ 180 మంది, 1199 వీఆర్‌ఏలకు గానూ 1107 మంది పని చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 323 వీఆర్వోలకు గానూ 256 మంది, 1497 మంది వీఆర్‌ఏలకు గానూ 1036 మంది, మెదక్‌ జిల్లాలో 199 మంది వీర్వోలకు గానూ 159 మంది, 1137 మంది వీఆర్‌ఏలకు గానూ 1032 మంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకరావడంతో వీఆర్వో, వీఆర్‌ఏల పోస్టులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులైన వీరిని ఇతర శాఖలకు సర్దుబాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ శాఖలో ఎంత మంది అవసరం ఉంటారో ఆ మేరకు తీసుకొని, మిగతా వారిని ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ఉద్యోగ భద్రతను కల్పిస్తారు. ఏ ఒక్క ఉద్యోగిని తీసివేయమని చెప్పడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భరోసానిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.10 వేల జీతంతో పని చేసే వీఆర్‌ఏలకు పే స్కేల్‌ ఉద్యోగం ఇవ్వడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. చాలి చాలని వేతనంతో నెట్టుకొస్తున్న వీరికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.

ఇక తప్పనున్న ప్రజల ఇబ్బందులు

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఇన్నాళ్లు పనులు కాకపోతుండే. ఇవాళ సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తీసుకరావడంతో అందరి తిప్పలు ఇక తప్పనున్నాయి. ఆఫీసుకెళితే, ఈ కాగితం.. ఆ కాగితం.. అని ముప్పుతిప్పలు పెట్టే వారు. చేతులు తడిపితే గానీ, పని చేసిపెట్టే వారు కారు. ఇవాళ కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలు బాధలు ఇక తీరనున్నాయి. ఇన్నాళ్లు పౌతి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఇక నుంచి పౌతి ఉండదు.. కుటుంబ సభ్యులు మాట్లాడుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకొని, కుటుంబ సభ్యులు అందరూ సంతకాలు చేసి, తహసిల్దార్‌ వద్దకు వెళితే గంట లోపే పని పూర్తి అవుతది.. వ్యవసాయ భూములను మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు గంట వ్యవధిలోనే మ్యుటేషన్‌తో సహా కాగితాలు, పాస్‌ బుక్కులు వస్తాయి.. విద్యార్థులకు శాశ్వత కుల ధ్రువీకరణ, డాటాబేస్‌ ఆధారంగా ఆదాయ పత్రాన్ని జారీ చేస్తారు. కుల, ఆదాయ పత్రాల కోసం విద్యార్థులు ఆఫీసుల చూట్టు తిరిగే వారు. ఇక ఒకే సారి వారికి సర్టిఫికెట్లు రానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ..

ప్రభుత్వం వీఆర్‌ఏల పట్ల స్పందించి పేస్కేల్‌ ప్రకటించడం సంతోషంగా ఉంది.  జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏలు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రభుత్వం మాకు సహకరించింది. 

- రవి (వీఆర్‌ఏ, రంగధాంపల్లి)  

 మరింత బాధ్యతగా పనిచేస్తాం 

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యను ప్రభుత్వం నెరవేర్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతాభావంతో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. అందరం మరింత బాధ్యతగా పనిచేస్తాం 

- శ్రీనివాస్‌రెడ్డి (వీఆర్‌ఏ, తడ్కపల్లి) 

ప్రత్యేకంగా ధన్యవాదాలు

దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌లు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ను కూడా దస్తావేజు లేఖరులకు అప్పజెప్పితే మరింత మేలు కలుగుతుంది. దస్తావేజు లేఖరులను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు దస్తావేజు లేఖరులు రుణపడి ఉంటారు.


logo