శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 07, 2020 , 23:42:02

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

 కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

 మిరుదొడ్డి : కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ మల్లికార్జున్‌, మిరుదొడ్డి సీహెచ్‌వో లింగమూర్తి అన్నారు. సోమవారం మిరుదొడ్డి ఆరోగ్య కేంద్రంలో 50 మందికి, భూంపల్లి పీహెచ్‌సీలో 50 మందికి కరోనా పరీక్షలు చేశారు. మిరుదొడ్డిలో ఇద్దరికి, భూంపల్లి పీహెచ్‌సీలో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది.  

చేర్యాలలో...

చేర్యాల : పట్టణంతో పాటు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని అన్ని గ్రామా ల ప్రజలు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చేర్యాల పీపీపీ యూనిట్‌ వైద్యాధికారి అశ్వినీస్వాతి, కొమురవెల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కార్తీక్‌ విష్ణువర్ధన్‌ కోరారు. సోమవారం మండలంలోని కొమురవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 54 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా, నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పీహెచ్‌సీ వర్గాలు తెలిపారు. అలాగే చేర్యాల పట్టణంలోని పీపీపీ యూనిట్‌లో 56 మందికి పరీక్షలు చేయగా, చేర్యాల పట్టణానికి చెందిన 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని దవాఖాన సిబ్బంది తెలిపారు.

తొగుటలో..

తొగుట : కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలని డాక్టర్‌ వెంకటేశ్‌ సూచించారు. తొగుట పీహెచ్‌సీలో సోమవారం 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందన్నారు.  

 లింగాపూర్‌లో విస్తృతంగా ..

 లింగాపూర్‌లో 53 కరోనా కేసులు నమోదు కావడం తో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీపీ లత, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి చొరవతో గ్రామంలో కొవిడ్‌-19 మొబైల్‌ బస్‌ ద్వారా ర్యాపిడ్‌ పరీక్షలను నిర్వహించారు. పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని  పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రజిత మాట్లాడుతూ బాధితులు ధైర్యంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

తొమ్మిది మందికి కరోనా  

మునిపల్లి : మండలంలోని పెద్దగోపులారంలో సోమవారం కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించామని మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ శిరీష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ పెద్దగోపులారంలో 200 మందికి కరోనా పరీక్షలు చేయగా, తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు.  

మద్దూరులో తొమ్మిదిమందికి.. 

మద్దూరు : మండలంలో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మద్దూరు, లద్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు రాజు, సుధారాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్దూరులో 50మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా ఏడుగురికి, లద్నూర్‌లో 54 మందికి కొవిడ్‌ టెస్టులను చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వివరించారు.

దుబ్బాకలో 20 మందికి..  

దుబ్బాక టౌన్‌ : మండలంలో సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 20 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఆయా దవాఖానల బాధ్యులు చెప్పారు.


logo