ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 03, 2020 , 00:13:33

కరోనా బాధితులకు భరోసా కల్పించాలి

కరోనా బాధితులకు భరోసా కల్పించాలి

  • n జిల్లాలో రోజుకు 300 ఆర్‌టీపీసీఆర్  పరీక్షలు చేయాలి 
  • n సిద్దిపేట పైలేరియా దవాఖానలో నేటి నుంచి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు 
  • n సిద్దిపేటలో 100 పడకల ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు
  • n సిద్దిపేట, హుస్నాబాద్‌ మాదిరిగా దుబ్బాకలో కొవిడ్‌ మృతదేహాల తరలింపునకు  అంబులెన్స్‌  
  • n సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌: కరోనా బాధితులకు మేమున్నాం అన్న భరోసాను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కల్పించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరోనా బాధితులతో ప్రతి రోజు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలన్నారు. త్వరితగతిన కోలుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. ప్రతి బాధితునికి ఐసొలేషన్‌ కిట్‌ను అందేలా చూడాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే వెంటనే బాధితున్ని కొవిడ్‌ దవాఖానకు తరలించి, సత్వర వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య కళాశాల, కొవిడ్‌ దవాఖాన బాధ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరోనా ఉధృతి, వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టెస్టుల సంఖ్య పెంచడం, తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 2,262 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. బాధితుల్లో ఇప్పటికే 52 శాతం మంది కోలుకున్నారన్నారు. వచ్చే మూడు రోజుల్లోగా కలెక్టర్‌తో కలిసి కరోనా బాధితులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. హోం ఐసొలేషన్‌ కిట్‌ వచ్చిందా.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారా.. సలహాలు, సూచనలు అం దించారా..లేదా అనే వివరాలు అడిగి తెలుసుకుంటానన్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే ఇతర వైద్య విభాగాల నుంచి వైద్యాధికారులను డిఫ్యుటేషన్‌పై నియమించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో పేద ప్రజల సౌకర్యార్ధం 100 పడకల ఐసొలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలన్నారు. సిద్దిపేట పైలేరియా దవాఖానలో గురువారం(నేటి నుంచి) ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినా, ఆశించిన మేర పరీక్షలు చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు 1654 టెస్టులు మాత్రమే చేశారన్నారు. రోజుకు వందకు తగ్గకుండా పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గజ్వేల్‌లో 100, ఆర్వీఎంలో 100, సిద్దిపేటలో 100, ప్రతిరోజు జిల్లాలో మొత్తం 300 ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి ఇచ్చే విధంగా రెమిడిసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొబైల్‌ బస్సు ద్వారా కరోనా పరీక్షలు ఎక్కువ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు మరింత ఎక్కువగా జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి అదనంగా మరో కొవిడ్‌ టెస్టు మొబైల్‌ బస్సును తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన స్టాఫ్‌ నర్సుల పెండింగ్‌ వేతనాలు, కొవిడ్‌ దవాఖాన భోజన ఖర్చులు పెండింగ్‌ బిల్లులు, వెంటనే క్లియర్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్లాస్మా సేకరణ కేంద్రం, డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని వెంటనే సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సిద్దిపేట, హుస్నాబాద్‌ మాదిరి దుబ్బాకకు కొవిడ్‌ మృతులను తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ముజ్మామిల్‌ఖాన్‌, పద్మాకర్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తమిళ అరసు, ఆర్‌ఎంవో కాశీనాథ్‌, డాక్టర్లు మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo