సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 03, 2020 , 00:13:34

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

  • n పూర్తి పారదర్శకంగా కేటాయింపు 
  • n అభ్యంతరాలు లేని లబ్ధిదారులకు  వచ్చేనెలలో లాటరీ పద్ధతిన ఇండ్ల కేటాయింపు 
  • n 235 దరఖాస్తులపై అభ్యంతరాలు..  వీటిపై సమగ్ర విచారణ పూర్తిచేయాలి 
  • n ఎంపిక చేసిన వారి వివరాలు వార్డు కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ప్రదర్శన
  • n ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌: అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు వచ్చేలా చూడాలి.. లబ్ధిదారుల జాబితాను ఆయా వార్డుల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాం. క్షేత్ర పరిశీలనలో అనర్హులుగా తేలి, మళ్లీ తాము అర్హులమేనంటూ  కొందరి నుంచి దరఖాస్తులు వచ్చాయి. అందుకు సంబంధించిన వారి దరఖాస్తులపై సమగ్రంగా విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలోని నర్సపురం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారులు, ప్రజా స్క్రూటినీలో వచ్చిన అభ్యంతరాలు, మళ్లీ కొందరు అర్హులమేనంటూ చేసుకున్న దరఖాస్తులపై పునః విచారణ, తదితర అంశాలపై బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సపురం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం 11,506 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుదారుల వద్దకే అధికారులు వెళ్లి విచారించగా, 1600 మంది ప్రాథమికంగా అర్హులుగా తేల్చారన్నారు. ఎంపికైన అర్హుల జాబితాను వార్డుల వారీగా నోటీసు బోర్డుల్లో ప్రదర్శించామన్నారు. ఇందులో 90 శాతం మందికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. ఎంపికైన వారిలో 235 మందికి సంబంధించి అభ్యంతరాలు వచ్చాయని, దీనిపై క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకంగా పునఃవిచారణ జరిపి, అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎంపిక జాబితా అనంతరం తాము అర్హులమేనంటూ 2,990 మంది నుంచి వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హులని తేలితేనే ఇండ్ల కేటాయింపులు సిఫార్సు చేయాలన్నారు. అర్హత, అనర్హతకు సంబంధించిన సమగ్ర సమాచారం సిఫార్సు జాబితాలో అందించాలన్నారు. రీ వెరిఫై సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, జాబితా సమర్పించాలని కోరారు. కొత్తగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కేటాయించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను రానున్న రోజుల్లో నిర్మించనున్న ఇండ్ల కోసం పరిశీలించాలన్నారు. మొదటి విడుతలో ఎలాంటి అభ్యంతరాలు రాని 1600 మంది దరఖాస్తుదారులకు వచ్చే 7వ తేదీలోగా వార్డు కౌన్సిలర్‌ సమక్షంలో లాటరీ పద్ధతిన ఇండ్ల కేటాయింపు పూర్తిచేయాలన్నారు. వచ్చే 10వ తేదీలోగా దశల వారీగా గృహ ప్రవేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గృహ ప్రవేశాల సమయంలో ఇంటి పట్టా, కరెంట్‌ మీటరు నంబరు, వాటర్‌ కనెక్షన్‌ మార్పిడి పత్రం, ప్రాపర్టీ ట్యాక్స్‌, కామన్‌ అఫిడవిట్‌, వంట గ్యాస్‌ సంబంధిత పత్రాలు లబ్ధిదారుల పేరున అందించాలన్నారు. మిషన్‌ భగీరథ నీటి ఇబ్బందులు ఎదురైనప్పుడు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నర్సపురం కాలనీ సమీపంలోని రాజీవ్‌ రహదారి కూడలిని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులను సంప్రదించి, సాధ్యమైనంత త్వరగా ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటి విడుత ఇండ్లు కేటాయించగా, మరో 500 ఇండ్లు మిగులుతాయని, పునః విచారణ అనంతరం అర్హులుగా తేలిన వారికి వాటిని కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఇంకా అర్హులుంటే వారికి భవిష్యత్తులో ఇండ్ల కేటాయిస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, కేటాయింపు నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ న్యాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

డ్రా ద్వారా ఇండ్ల కేటాయింపు  -కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

ఎంపికైన లబ్ధిదారుల పేర్లను ఒక బాక్సులో, 2 బీహెచ్‌కే యూనిట్ల నంబర్లను మరో బాక్సులో వేసి వార్డు కౌన్సిలర్‌ సమక్షంలో డ్రా ద్వారా ఇండ్ల కేటాయింపు చేయాలని అధికారులకు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. డ్రా ప్రక్రియను ఆద్యంతం వీడియో తీయాలన్నారు. ఒకేసారి కాకుం డా దశల వారీగా ఇండ్లను అందిస్తామని తెలిపారు. విద్యుత్‌, తాగు, సాధారణ నీటి సౌకర్యం ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. గృహ ప్రవేశాలు జరిగే లోపే నర్సపురం కాలనీలో బుష్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఇంజినీరింగ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ముజ్మామిల్‌ ఖాన్‌, పద్మాకర్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఆర్డీవో అనంతరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


తాజావార్తలు


logo