మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 02, 2020 , 02:48:54

పల్లె పల్లెనా.. ప్రకృతి వనం

పల్లె పల్లెనా.. ప్రకృతి వనం

  • n సిద్దిపేట జిల్లాలో 164 గ్రామాల్లో  చురుగ్గా సాగుతున్న పనులు
  • n 10 గ్రామాల్లో పూర్తయిన ప్రకృతి వనాలు
  • n జక్కాపూర్‌లో ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
  • n మియావాకి విధానంలో చిట్టడవులు..
  • n ప్రతి పంచాయతీలో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడింది. గ్రామాలను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు, పర్యావరణ సమతుల్యతను పెంపొందించడం కోసం ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఊరూరా ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంట్లో భాగంగా  తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను నాటి సంరక్షిస్తారు. మూడంచెల్లో విధానంలో అనేక రకాలు మొక్కలు నాటుతారు. మియావాకి విధానంలో చిట్టవులను సృష్టిస్తారు. తద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యమని ప్రభుత్వం భావిస్తున్నది.

సిద్దిపేట జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో పచ్చదనం పెంచేందుకు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ఎకరా చొప్పున విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక్కో పల్లె ప్రకృతి వనం రూ. 6.47 లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో రూ. 3.43 లక్షలు పనిచేసే కూలీలకు చెల్లిస్తారు. మిగతా రూ. 3.04 లక్షలు నిర్వహణ, యంత్రాలు, ఇతర సామగ్రికి ఖర్చుచేస్త్తారు. సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలకు గాను.. 164 పంచాయతీల్లో ప్రకృతి వనాల ఏర్పాటు పనులు ప్రారంభించారు. వీటిలో 10 చోట్ల పనులను పూర్తి చేశారు. అక్కన్నపేట మండలంలో 3, కొండపాక మండలంలో 2, మర్కూక్‌ మండలంలో ఒకటి, ములుగు మండలంలో 3, నారాయణరావుపేట మండలంలో ఒకటి పూర్తి చేశారు. పూర్తిచేసిన వాటిలో ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా నారాయణరావుపేట మండంలోని జక్కాపూర్‌ ప్రకృతివనాన్ని ప్రారంభించారు. జిల్లాలో పనులు ప్రారంభించన వాటిలో మొక్కలు నాటేందుకు 45,200 గుంతలను తీశారు. ఇందులో 25,450 మొక్కలు నాటారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి, ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పల్లెల్లో పచ్చదనం ఫరిడవిల్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. మున్సిపాలిటీల్లో సైతం నర్సరీలను ఏర్పాటు చేసింది.  

పంచాయతీల్లో స్థలం ఎంపిక... 

గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే పల్లె ప్రకృతి వనాలకు స్థలం ఎంపిక ప్రధానమైనది. దీనికి ఆయా గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న భూములు, లేదా ప్రభుత్వ, ఏదైనా సంస్థలకు సంబంధించిన స్థలాలను ఎంపిక చేస్తారు. స్థలం గ్రామాలకు దగ్గరగా ఉండి, నీటి సౌకర్యం ఉండేలా చూస్తారు. పల్లె ప్రకృతి వనం  ఏర్పాటుకు ఎకరా విస్తీర్ణం స్థలం సరిపోతుంది. ఈ స్థలంలో ఉన్న ముళ్ల పొదలు, ఇతర పిచ్చి మొక్కలను తొలగించి భూమిని సమానం చేసి కలియుదున్నాలి. భూమి ఎంపిక చేసే సమయంలో ఎర్రటి నేల అయితే చాలా మంచిది.భూమిని ఇరువైపులా దున్నిన తర్వాత తగినంత మాగిన పశువుల ఎరువు, కుళ్లిపోవుటకు సేంద్రియ పదార్థాల వ్యర్థ్ధాలు, భూమిలో ఉండే సూక్ష్మజీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి జీవామృతాన్ని కలుపుతారు. మాగిన పచ్చిరొట్ట ఎరువులు ఇవన్నీ వేసిన తర్వాత భూమిని మళ్లీ ఒకసారి దున్నుతారు. ఆ తర్వాత ప్రకృతి వనంలో మూడంచెల పద్ధ్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం చేపడతారు. చిట్టడవి, ఎత్తుగా పెరిగే నీడనిచ్చె మొక్కలు, మధ్యస్తంగా పెరిగే మొక్కలు. చిన్న మొక్కలకు స్థలాన్ని కావాల్సినంత కేటాయిస్తారు. ఇవి కాకుండా ఖాళీ స్థలం, నడక స్థలం అందుబాటులో ఉంటుంది. నాటిన మొక్కలను సంరక్షించేలా, ప్రజలకు మొక్కల సంరక్షణ గురించి అవగాహన కల్పించి, ప్రజలు  వారి 

బాధ్యతను నిర్వర్తించేలా అవగాహన కల్పిస్తారు. ఎత్తుగా పెరిగే చెట్ల మధ్య దూరం 2 మీటర్లు లేదా 3 మీటర్లుగాను వీటి మధ్యలో మధ్యస్తంగా పెరిగే మొక్కలు, చిన్న మొక్కలను ఎత్తుల వారీగా నాటుతారు. మొక్కలు నాటిని తర్వాత నీటిని అందిస్తారు. కలుపుతీత,భూమిలో తేమ నియంత్రణ క్రమం తప్పకుండా చేసేలా ప్రత్యేక చర్యలు చేపడతారు.


logo