శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 02, 2020 , 02:48:55

మరోసారి ఎల్‌ఆర్‌"ఎస్‌'..!

మరోసారి  ఎల్‌ఆర్‌

మెదక్‌/సంగారెడ్డి/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న లే ఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. ఇప్పటికే జిల్లాలో పలు అక్రమ లే ఔట్లను గుర్తించిన అధికారులు, వారికి నోటీసులు ఇచ్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో అక్రమ లే ఔట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీ శివారుల్లో వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. వీటికి లే ఔట్‌ అనుమతులు లేకపోగా, రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. జిల్లాకేంద్రం ఏర్పాటు తర్వాత పెద్ద మొత్తంలో వెంచర్లు వెలిశాయి. ఈ ప్లాట్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలన్నా, మార్ట్‌గేజ్‌ ద్వారా బ్యాంకు రుణం పొందాలన్నా, స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమ లే ఔట్లను లే ఔట్‌ రెగ్యులరేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌), అక్రమ భవన నిర్మాణాలను బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(బీఆర్‌ఎస్‌) ద్వారా మున్సిపాలిటీలో క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో నవంబర్‌ 2, 2015 నుంచి మార్చి 1, 2016 వరకు గడువు ఇచ్చింది. అక్రమ లే ఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అక్టోబర్‌ 28, 2015లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన లేఔట్లు, స్థలాలకు మాత్రమే ఈ ఉత్తర్వు చెల్లనుంది. రూ.10వేల ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారించిన ఫీజుతో పాటు 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా ఉన్న ప్లాట్లకే ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. తాజాగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 131 జీవోలో ఆగస్టు 26, 2020 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 17 మున్సిపాలిటీలలో అనమతులు లేని లే అవుట్లు, వెంచర్ల యజమానులు ఉపయోగించుకుని క్రమబద్ధీకరణ చేసుకోవాలని స్పష్టం చేసింది. 

రూ.10వేల ఫీజు..

లే ఔట్ల క్రమబద్ధీకరణకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఫీజును నిర్ణయించింది. వ్యక్తిగతంగా ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం కనీసం వెయ్యి రూపాయలను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. 100 గజాలలోపు ప్లాట్లకు గజానికి రూ.200 చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. 100 నుంచి 300 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ.400 రెగ్యులరైజేషన్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. 300 గజాల నుంచి 500 గజాలకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్‌ చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులను అక్టోబర్‌ 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం చేసింది. 

కొత్త జీవో ప్రకారం రూ.9 కోట్ల ఆదాయం..

జిల్లాలోని మెదక్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో రూ.9 కోట్ల ఆదాయం వస్తుందని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. మెదక్‌ మున్సిపాలిటీల్లో సుమారుగా 2వేల పాట్లకు గాను రూ.7.50 కోట్లు , రామాయంపేట మున్సిపాలిటీలో 600 ప్లాట్లకు గాను రూ.1.80కోట్ల ఆదాయం సమకూరనుంది. 

ప్లాట్లకు, విస్తీర్ణానికి పొంతన లేదు..

మెదక్‌, రామాయంపేట పట్టణాల్లో వెలసిన ఒక్కో వెంచర్‌లో లే ఔట్‌లో చూపిన ప్లాట్లకు, విస్తీర్ణానికి, అమ్ముకున్న ప్లాట్లకు పొంతన లేదు. రియల్‌ వ్యాపారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున మున్సిపల్‌ ఆదాయానికి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 

పక్కాగా ప్రభుత్వ నిబంధనలు ...

భూ విక్రయాలు, ప్లాట్లలో జరుగుతున్న లావాదేవీలతో ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండిని పుడ్చేందుకు పక్కాగా నిబంధనలు ఆమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో నాలా, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే లే ఔట్లు, వెంచర్లు, డెవలప్‌మెంట్‌ యజమానులు నిబంధనలు తప్పక పాటిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్లు చేస్తే సంబంధిత అధికారులే బాధ్యుత వహించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. 

 హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాలు..

హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల పరిధిలోని గ్రామాలకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కాంటిటెంట్‌ అథారిటీగా స్పష్టం చేసింది. ఈసారి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో కాంటిటెంట్‌ అథారిటీగా ప్రభుత్వం పొందుపర్చలేదు.సాధ్యమైనంత మేరలో ఈ పథకాన్ని పూర్తిచేసి వచ్చిన నిధులను సర్కారు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఖర్చు చేయనుంది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ జాతర కొనసాగనుంది. కాగా, ఇది వరకు 2015లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించగా.. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.75 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా లక్షాకు పైగా దరఖాస్తులకు క్రమబద్ధీకరణ పత్రాలను హెచ్‌ఎండీఏ అందజేసింది. తద్వారా రూ. 1050కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలోకి సమకూర్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1, 30 లక్ష దరఖాస్తులను స్వీకరించగా, 70 వేల దరఖాస్తుల అనుమతులు మంజూరు చేశారు. 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ. 1000కోట్లు ఆదాయం వచ్చిం ది.ఏండ్ల తరబడి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని వారికి మరోసారి అవకాశం కల్పించడం గమనార్హం.అక్రమ నిర్మాణాలకు శాశ్వత చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. .  

జీవో ఏం చెబుతున్నది? 

ఆమలులోకి వచ్చిన జీవో 131 ప్రకారం గత నెల ఆగస్టు 26వ తేదీ వరకు మాత్రమే అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు (సేల్‌ డీడ్‌ అయిన) చేసిన రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు, లేఔట్లను అభివృద్ధి చేసిన వారు క్రమబద్ధీకరించుకొనేందుకు అవకాశం కల్పించింది. లేఔట్లను మంజూరు చేసే అధికారిక సంస్థల నుంచి అనుమతి లేని లేఔట్లకు, ఆ లేఔట్లలోకి ప్లాట్లకు, రోడ్లు అభివృద్ధి లేని, ఖాళీ ప్రదేశాలు వదలని, మౌలిక సౌకర్యాలు కల్పన లేని లేఔట్లలోని ప్లాట్లకు క్రమబద్ధీకరణ జీవో వర్తిస్తుంది. హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు ఈ నియమాలు వర్తిస్తాయి.సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ ఉన్న ప్లాట్లకు, లేఔట్లకు మాత్రమే కానీ, జీపీవో డీడ్‌లకు వర్తించదని తేల్చి చెప్పింది. 26 ఆగస్టు తర్వాత రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు వర్తించదని జీవో స్పష్టం చేసింది. 

ఎల్‌ఆర్‌ఎస్‌లో ముఖ్యమైనవి...

n ఆగస్టు 25 వ తేదీ వరకు కటాఫ్‌ తేదీగా  ప్రకటించింది.

n టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌  ఆథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు  ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపు . 

n ఆక్టోబరు 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో  ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ నింపాలి. 

n ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000 (వ్యక్తిగత ప్లాట్‌ ఓనర్స్‌), లేఔట్‌ ఓనర్స్‌  ఆప్లికేషన్‌ ఫీజు రూ. 10వేలు 

n రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు 100 గజాల లోపు  ప్లాట్లకు గజానికి 200 రూపాయల చొప్పున  చెల్లించాలి.

n 101 నుంచి 300 గజాలు ఉన్న వాళ్లు  గజానికి రూ. 400లు చెల్లించాలి.

n 301 నుంచి 500 గజాలు ఉన్న వాళ్లు  గజానికి రూ.600లు రెగ్యులరైజేషన్‌  ఛార్జీలు చెల్లించాలి

n 501 నుంచి 750 గజాలు ఉన్న వారంతా రూ. 750లు చెల్లించాలి. 

n నాలుగు పద్ధ్దతుల్లో ఫీజులు చెల్లించుకునే  వీలు కల్పించారు. హెచ్‌ఎండీఏ, పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థ, 

కార్పొరేషన్లకు వాటి అధికారిక వెబ్‌సైట్‌ పోర్టల్‌, మీ-సేవ సెంటర్లు, సిటిజన్‌ సర్వీస్‌  సెంటర్స్‌ లోకల్‌ బాడీ, స్మార్ట్‌ఫోన్‌లో 

మొబైల్‌ యాప్‌ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. 

నిబంధనలు 

n నాలాకు రెండు మీటర్ల దూరం ఉండాలి. 

n వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి. 

n 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల  దూరం ఉండాలి 

n 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న  చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి.

n ఎయిర్‌పోర్టు, ఢిఫెన్స్‌ స్థలానికి 500 మీటర్ల  దూరం ఉండాలి .

n నీటి వనరులకు చెంతన ఉన్నవి, ఎఫ్‌టీఎల్‌  పరిధిలోని శిఖం భూముల్లోని 

దరఖాస్తులను అనుమతించబడవు. జీవో  111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌, హుడా  ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాలు వర్తిస్థాయి. 

పరిశ్రమలకు కేటాయించిన, తయారీ  ఉపయోగాల భూములకు, మాస్టర్‌ప్ల్లాన్‌లో 

ఓపెన్‌ స్పేస్‌గా గుర్తించిన ప్రదేశాలకు  ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి అనుమతించరాదని 

తెలిపింది. 

n క్రమబద్ధీరణ చేసుకోని అనుమతి లేని  లేఔట్లలోని ప్లాట్లకు ఇంటి నిర్మాణ 

అనుమతులు, నల్లా కనెక్షన్లు, డ్రైనేజీ,  మురుగునీటి కనెక్షన్లు మంజూరు చేయరు. 

ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయబడవని  హెచ్చరించింది. 

n అనధికార లేఔట్లు, అక్రమ నిర్మాణాలకు  శాశ్వతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రభుత్వం 

నిర్ణయించింది. ఇందులో భాగంగానే  ఇటీవల అక్రమ లేఔట్లలోని ప్లాట్లను 

రిజిస్ట్రేషన్‌ చేయవద్దని రిజిస్ట్రేషన్‌ శాఖకు  ఆదేశాలు జారీచేసింది. ఎన్ని హెచ్చరికలు 

జారీచేసినా నిర్మాణాలు చేపడుతుండడం,  కూల్చివేతలు ప్రక్రియతో ఎక్కువ శాతం 

మధ్య తరగతి వారే నష్టపోతారని  భావించిన ప్రభుత్వం, మరోమారు  క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.  తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో 

పాటు యాజమానులకు భారీ ఉపశమనం  లభించనుంది. 

ఓపెన్‌ స్పేస్‌ లేకుంటే 14శాతం అదనం..

అక్రమంగా ఏర్పాటుచేసిన లేఔట్‌లో 

నిబంధనలకు అనుగుణంగా 10శాతం ఖాళీ 

జాగా వదలకపోతే రిజిస్ట్రేషన్‌ సందర్భంగా 

ప్లాటు విలువలో 14శాతం అదనంగా 

చెల్లించాల్సి ఉంటుంది. 


logo