బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 01, 2020 , 02:25:55

కేబుల్‌ టీవీల్లో డిజిటల్‌ క్లాసులు ప్రసారమయ్యేలా చూడాలి

కేబుల్‌ టీవీల్లో డిజిటల్‌ క్లాసులు ప్రసారమయ్యేలా చూడాలి

  • అదనపు కలెక్టర్‌ నగేశ్‌   నేటి నుంచి ఆన్‌లైన్‌, డిజిటల్‌ పాఠాలు

మెదక్‌ : కేబుల్‌ టీవీల్లో డిజిటల్‌ క్లాసులు ప్రసారమయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లాలోని ఆయా మండలాల కేబుల్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో విద్యాబోధనకు కేబుల్‌ ఆపరేటర్లు తప్పకుండా సహకరించాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నేరుగా స్కూళ్లకు విద్యార్థులను అనుమతించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయనున్నదని తెలిపారు. డిజిటల్‌, ఆన్‌లైన్‌ పాఠాల కోసం దూరదర్శన్‌ యాదగిరి, టీ-శాట్‌ ఛానెళ్లలో మూడో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు బోధించనున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కేబుల్‌ ఆపరేటర్లందరూ దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ఛానెళ్లను తప్పనిసరిగా ప్రసారం చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌ పాఠాలు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం చూసేందుకు కేబుల్‌ ఆపరేటర్లు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో రమేశ్‌కుమార్‌, అధికా రులు కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి.. 

వానకాలం సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురియడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో వరి ధాన్యం సాగు చేశారని, తమ అంచనా ప్రకారం మూడున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. సోమవారం ఆయన ఛాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం వరి ధాన్యం పంట కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, దీనికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయ, డీఆర్‌డీఏ, సహకార, మార్కెటింగ్‌, పౌర సరఫరాల శాఖ అధికారులు ముందస్తుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకుగాను గ్రామాల్లో రైతులకు అనువుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు చంద్రపాల్‌, డీఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, సివిల్‌ సప్లయి జిల్లా అధికారి శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌, ఐకేపీ, అధికారులు పాల్గొన్నారు.


logo