సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 01, 2020 , 02:26:05

విద్యార్థుల భవిష్యత్‌కే.. సర్కారు చర్యలు

విద్యార్థుల భవిష్యత్‌కే..  సర్కారు చర్యలు

  • ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట రూరల్‌ : ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు జరుపాలి.. ప్రతి విద్యార్థి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలి.. ప్రతి పది మంది విద్యార్థులకు ఒక కేర్‌ టీచర్‌ ఉండాలి.. బడీడు పిల్లలంతా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులపై ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. నేటి నుంచి పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం నేపథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యేలు, సిద్దిపేట, మెదక్‌ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఈవో రవికాంత్‌రావు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్లు, రెండు జిల్లాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మొత్తం 3100 మందితో సోమవారం మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. తరగతుల సన్నద్ధతపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్‌ తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అపోహలు తొలిగించి విశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. నేటి నుంచి ప్రభుత్వం టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తుందన్నారు. బడీడు పిల్లలంతా తరగతులకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు చూడాలన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 65,945 విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి చదువుతుండగా, 94.6 శాతం (62,339) మందికి టీ శాట్‌, దూరదర్శన్‌ యాదగిరి ఛానల్‌ ద్వారా తగరతులు, మిగతా 2.9 శాతం (1917) మందికి టీ శాట్‌, దూరదర్శన్‌ ద్వారా తరగతులు వినే సౌలభ్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో 64308 విద్యార్థులు చదువుతుండగా, 10.3 శాతం 

(6643) టీ శాట్‌, దూరదర్శన్‌ యాదగిరి ఛానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ తగరతులు వినే సౌలభ్యం ఉందన్నారు. ఆన్‌లైన్‌ పాఠాలు వినే సౌలభ్యం లేని విద్యార్థుల కోసం సర్పంచులు, ఎంపీటీసీలు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ లేదా సమీప ఇండ్లలో టీవీల ద్వారా పాఠాలు వినేలా చూడాలన్నారు. 6వ తరగతిపై విద్యార్థులకు రికార్డెడ్‌ పాఠశాలలో అందుబాటులో నిలుపాలన్నారు. 5వ తరగతి లోపు విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించి ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉంటారని ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల ఇంటికి వెళ్లి సర్వే చేశారా.. ఎంత మందిని గుర్తించారు..ఎలాంటి సూచనలు, ఏర్పాట్లు చేశారని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. 

ప్రతి పది మంది విద్యార్థులకు.. ఒక కేర్‌ టీచర్‌ ఉండాలి 

ప్రతి పది మంది విద్యార్థులకు ఒక కేర్‌ టీచర్‌ ఉండాలని, ప్రతి ఉపాధ్యాయుడు క్లాసుకు కొంత మంది విద్యార్థులను దత్తత - కేర్‌ తీసుకొని వారికి కేర్‌ టీచరుగా ఉండాలన్నారు. కేర్‌ టీచరుపై జిల్లా విద్యాశాఖ అధికారి, హెడ్మాస్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేర్‌ టీచరు వారంలో రెండు రోజులు విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి నోట్స్‌, ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా వారు తెలుసుకున్న విషయాలు పునఃచ్ఛరణ చేయాలన్నారు. పాఠశాలల్లో ఏ విధంగా చదువుతారో.. ఇంటి వద్ద అలానే చదివేలా చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌, నంబరును ఏర్పాటు చేసి పరిష్కారం చేయాలన్నారు. ఉపాధ్యాయులకు వారధిలా ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. ఉపాధ్యాయులతో పాటు సర్పంచు విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లాలన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుందన్నారు. 

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు  అందరూ సహకరించాలి : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

ఆన్‌లైన్‌ తరగతులు వారం రోజులు అత్యంత కీలకమని సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. జిల్లా విద్యాధికారి, ఎంఈవో, హెచ్‌ఎంలు, సర్పంచులు ఆన్‌లైన్‌ తరగతులు చాలెంజ్‌గా తీసుకొని క్లాసులు బాగా జరిగేలా చూడాలన్నారు. క్లాసులు జరుగుతున్న తీరును అధ్యయనం చేయడం, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం ద్వారా బాలారిష్టాలు అధిగమించవచ్చన్నారు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వారానికి రెండు సార్లు స్కూల్‌ కమిటీ సమావేశం నిర్వహించి ఆన్‌లైన్‌ తరగతుల తీరు, విద్యార్థుల హాజరుపై సమీక్షించాలన్నారు. హెచ్‌ఎంలు హాజరు శాతం పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు. కొత్త విద్యార్థుల ప్రవేశాలు, ఉన్న విద్యార్థుల తరగతి ఉన్నతీకరణకు ప్రాసెస్‌ సైతం ఉపాధ్యాయులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. 

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

మద్దూరు : ధూళిమిట్టను నూతన మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ధూళిమిట్టను మండలంగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ధూళిమిట్ట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ పోతరాజుల లింగం, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు స్వర్గం లక్ష్మయ్య, నాయకులు నాచగోని వెంకట్‌గౌడ్‌, రచ్చ లక్ష్మయ్య, గుంటిపల్లి భాస్కర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo