ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 30, 2020 , 23:18:28

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని పలు ప్రధాన రహదారులను చెత్త రహిత మార్గాలుగా ఎంపిక చేశామని, ఆయా రహదారుల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదని మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య హెచ్చరించారు. ఆదివారం హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడుతూ   మల్లెచెట్టు చౌరస్తా నుంచి హన్మకొండ రోడ్డు వరకు, మల్లెచెట్టు చౌరస్తా నుంచి సిద్దిపేట రోడ్డు, అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఏసీ థియేటర్‌, నాగారం రోడ్డు వరకు, మల్లెచెట్టు చౌరస్తా నుంచి కరీంనగర్‌ రోడ్డు వరకు గల రోడ్లను చెత్త రహిత రహదారులుగా గుర్తించామన్నారు. ఈ మార్గాల్లో   వ్యాపారస్తులు విధిగా చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని, పోగు చేసిన చెత్తను పురపాలక వాహనాల్లో వేయాలని సూచించారు. చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ప్రతినెలా యూజర్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు పాటించని వ్యాపారస్తులకు 1965 చట్టం ప్రకారం రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధిస్తామని అన్నారు.   పట్టణంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై నిషేధం విధించినందున అటువంటి కవర్లు వాడినా, విక్రయించినా రూ.2500 నుంచి రూ.5000  వరకు జరిమానా విధిస్తామన్నారు. అవసరమైతే దుకాణం ట్రేడ్‌ లైసెన్స్‌  రద్దు చేస్తామని హెచ్చరించారు. 

శుభ్రంగా ఉంచుకోవాలి.. 

హుస్నాబాద్‌టౌన్‌: పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్‌ ఆదేశాల మేరకు వ్యాధులను దూరం చేయడంతోపాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆదివారం హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత తన ఇంట్లో చెత్తాచెదారాన్ని తొలిగించారు. ఇంట్లోని పూల మొక్కలు, ఇంటి పరిసరాల్లో పెరిగిన పనికిరాని మొక్కలను తొలిగించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని రజిత కోరారు.  


logo