శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 30, 2020 , 23:18:45

లాభదాయకం ఆయిల్‌ పాం

లాభదాయకం ఆయిల్‌ పాం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా జిల్లాలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు రైతులు జై కొట్టారు. సీఎం కేసీఆర్‌ సూచించినట్లుగా లాభసాటిగా ఉండే గిట్టుబాటు అయ్యే పంటలను సాగు చేశారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పాం(పామాయిల్‌)సాగుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చింది. 20,234 హెక్టార్ల(50,585 ఎకరాలు ) ఆయిల్‌పాం సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ వానకాలంలో అన్ని పంటలు కలిపి 5,08,010 ఎకరాల్లో సాగైంది. ఈసారి పుష్కలంగా వర్షాలు కురిశాయి. అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు వచ్చి చేరాయి. ఇవాళ ఎక్కడ చూసినా నిండుకుండలా చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆయిల్‌పాం సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయి.

ఆయిల్‌పాం పంట లాభాలు ..

బహుళ వార్షిక పంటల్లోకెల్లా పామాయిల్‌ ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇది ఎకరానికి 10-12 టన్నులు వచ్చి, 30ఏండ్ల వరకు రైతుకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇటు రైతుకు, పర్యావరణానికి మేలు కలిగించేదిగా ఈ సాగు పేరు గాంచింది. ఈ పంటలకు చీడ పురుగులు, కోతులు, రాళ్ల వాన బెడద తక్కువగా ఉంటుంది. రైతులు పండించిన పంటలను పామాయిల్‌ కంపెనీలు వచ్చి కొనుగోలు చేస్తాయి. రైతు ప్రతి నెలా లాభదాయకమైన ఆదాయం పొందవచ్చు. పామాయిల్‌ను మన దేశంలో అధికంగా బేకరీ ఉత్పత్తుల తయారీకి, గృహ అవసరాలకు వినియోగిస్తారు. దీని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులను కూడా అధిక ఉపయోగాలు అనగా బయో డీజిల్‌, ముల్చింగ్‌కు ఉపయోగపడుతాయి. ఇదేకాక, పామాయిల్‌ సాగు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల పామాయిల్‌ పంటను సాగు చేయవచ్చు. పంట వేసిన నాల్గో సంవత్సరం నుంచి ఎకరానికి 8-10  టన్నుల ఆయిల్‌పాం గెలల దిగుబడితో, సుమారు రూ.80 వేల నుంచి లక్ష వరకు, 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. ఆయా ప్రాంతాలకు కేటాయించబడిన కంపెనీల ద్వారా మొక్కలు, మొదటి నాలుగేండ్లు ఎరువులు సరఫరా చేస్తారు. దిగుబడి సమయంలో ప్రభుత్వం నిర్ణయించబడిన ధర ప్రకారం కంపెనీలతో గెలలు కొని, రైతుల ఖాతాలో పక్షం రోజులకొకసారి డబ్బులు జమ చేస్తారు. అంతర పంటలైన కూరగాయలు, అల్లం, మిల్లెట్స్‌ వంటి పంటల సాగుతో ఎకరానికి రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి వెదురు/మలబార్‌, వేప పంట ద్వారా నాల్గో సంవత్సరం నుంచి ఎకరానికి రూ.40 వేల వరకు సుమారు 30 సంవత్సరాల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి రెండో వరుసలో 65 శ్రీగంధం మొక్కలు పెట్టడంతో 15ఏండ్ల తర్వాత ఎకరానికి సుమారుగా కోటి వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. 

ఆయిల్‌పాం పథకం వివరాలు ..

ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు, కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమం అయినటువంటి నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ - ఆయిల్‌పాం ద్వారా అమలు చేస్తున్నారు. ఒక ఎకరా ఆయిల్‌పాం సాగు చేసేందుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గానూ సుమారు రూ.60 వేలు నుంచి రూ.70 వేల వరకు (సూక్ష్మ సేద్యం, ఇతర కూలీ ఖర్చులతో కలిపి) ఖర్చవుతుంది. నాలుగేండ్లకు గానూ రూ.30,800 వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. కేటాయించిన కంపెనీల ద్వారా రైతులకు మొక్కలు, మొదటి నాలుగు సంవత్సరాల పాటు ఎరువులు సరఫరా చేస్తారు. జిల్లాలో ఈ ఆయిల్‌పాంతో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకొని, సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం ఉన్న రైతులందరు సాగు చేయొచ్చు.

ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిద్దాం..

భారత వంట నూనె పరిశ్రమ, అమెరికా, చైనా, బ్రెజిల్‌ తర్వాత నాల్గో అతి పెద్దపరిశ్రమ. అందులో పామాయిల్‌ ఒకటి. మలేషియా, ఇండోనేషియా దేశాలు కలిపి 85శాతం క్రూడ్‌ పామాయిల్‌ను పండిస్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఎగుమతి అవుతున్నాయి. మన దేశ జనాభాకు 22 మిలియన్‌ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. మిగిలిన 15 మిలియన్‌ టన్నుల నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ 60 శాతంగా ఉన్నది. 9-10 మిలియన్‌ టన్నుల పామాయిల్‌ నూనెను సుమారు రూ.58,800 కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీనిని అదనంగా 70 లక్షల హెక్టార్ల పామాయిల్‌ సాగుతో అధిగమించవచ్చు. పామాయిల్  దిగుమతులను పూర్తిగా తగ్గించుకొని, ఇప్పుడు వెచ్చిస్తున్న రూ.58, 800 కోట్ల విదేశీ మారక ద్రవ్యా న్ని చేయాలంటే, ఆయిల్‌పాం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిం చాలి.

రైతులు ముందుకు రావాలి..

సిద్దిపేట జిల్లా ఆయిల్‌పాం సాగుకు ఎంపికైంది. 50,585 ఎకరాలకు సాగు అనుమతులు వచ్చాయి. రైతులంతా ఆయిల్‌పాం సాగుకు ముందుకు రావాలి. బహుళ వార్షిక పంటల్లోకెల్లా పామాయిల్‌ ఎక్కువ దిగుబడినిస్తూ, నిరంతర ఆదాయాన్నిస్తూ రైతుకు, పర్యావరణానికి మేలు కలిగిస్తుంది. ఈ పంటలకు చీడ పురుగులు, కోతులు, రాళ్ల వాన బెడద తక్కువగా ఉంటుంది. రైతులు పండించిన పంటలకు పామాయిల్‌ కంపెనీల ద్వారా కొనుగోలు జరుపబడుతాయి. ప్రతి నెలా లాభదాయకమైన ఆదాయం పొందవచ్చు. ఈ పంట సాగుకు అనుకూలమైన పరస్థితులు జిల్లాలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుకుండలా ఉన్నాయి. చెరువులు,వాగులు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


logo