శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 29, 2020 , 00:58:42

శుభ్రతతో అంటువ్యాధులకు చెక్‌

శుభ్రతతో అంటువ్యాధులకు చెక్‌

  • *  సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన 
  • *  పల్లె ప్రగతి కార్యక్రమంతో స్వచ్ఛ గ్రామాలు 
  • *  మిషన్‌ భగీరథ జలాలతో వ్యాధులు దూరం 
  • *  నిరంతరం సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు,      కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. గతంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి జిల్లాలో దాదాపుగా తగ్గిపోయింది. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తితోపాటు వాటి నివారణ చర్యలపై ప్రజలను ముందే అప్రమత్తం చేసి, అవగాహన కల్పించారు. జిల్లాలో డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా, టైపాయిడ్‌, అతిసారం లాంటి వ్యాధులు రాకుండా నిరంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్‌వీబీసీడీపీ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ఆవగహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం  డ్రై డే, పట్టణాల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలతో ఇండ్లలోని నీటి పాత్రలు, పూల కుండీలు, డ్రమ్ముళ్లలో నీరు నిల్వ చేయకుండా చర్యలు చేపట్టారు. దోమల పునరుత్పత్తి లేకుండా జాగ్రత్తలు పాటించడంతో జిల్లా వ్యాప్తంగా సీజనల్‌, అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఫలితంగా గతంతో పోల్చుకుంటే ఈయేడాది సీజపల్‌ వ్యాధుల తీవ్రత తక్కువగా ఉంది. వర్షాకాలంలో వచ్చే వరద నీటితో తాగునీరు కలుషితమై అతిసారం లాంటి వ్యాధులు వచ్చేవి. మిషన్‌ భగీరథ వల్ల ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు వస్తుండంతో నీటి వల్ల వచ్చే జబ్బులు తగ్గిపోయాయి.

సిద్దిపేట జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిత్యం ప్రజలను ఆప్రమత్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ గ్రామాల నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించి సీజనల్‌, అంటు వ్యాధులు ఆరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వేలు చేసి, రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు చేయడం, వ్యాధులు వచ్చినవారికి ఉచితంగా మందులు అందజేశారు. బోధకాలు వ్యాధి సోకకుండా పైలేరియా అధికారులు నిత్యం గ్రామాల్లో వైద్యపరీక్షలు చేయడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గత సంవత్సరం కంటే వ్యాధుల తీవ్రత తక్కువగా ఉంది. 2019 జూన్‌ నెలలో 2 కేసులు, జూలైలో 16, ఆగస్టులో16 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా జూలైలో-1,ఆగస్టులో-1, చికున్‌గున్యా ఆగస్టులో-2 కేసులు నమోదయ్యాయి. 2020 సంవత్సరంలో ఇప్పటి వరకు ఆగస్టులో డెంగీ-1, పైలేరియా జూలైలో- 3, ఆగస్టులో -3 కేసులు నమోదయ్యాయి.


logo