గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 28, 2020 , 02:36:27

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభం

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభం

  • హాజరైన ఉపాధ్యాయులు

కరోనా నేపథ్యంలో మార్చి 23న పాఠశాలలను మూసివేశారు. ఐదు నెలల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం తెరిచారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో సెప్టెంబర్‌ 1 నుంచి డిజిటల్‌(ఆన్‌లైన్‌) విద్యాబోధనకు తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది విధులకు హాజరయ్యారు.  

మెదక్‌ రూరల్‌ : విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి నీలకంఠం పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఉపాధ్యాయులు విధుల్లోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంభోజిపల్లి పాఠశాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నీలకంఠం మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. పాఠ్యపుస్తకాలు అందని విద్యార్థులకు రెండు రోజుల్లో అందజేయాలన్నారు. తరగతుల వారీగా విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని ఆన్‌లైన్‌ తరగతులు వినేలా బాధ్యత తీసుకోవాలన్నారు. తరగతుల వారీగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ శానిటైజింగ్‌, మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. జూమ్‌ వెబ్‌సైట్‌తో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులు, పాఠశాల నుంచి పాల్గొనాలని, నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడితే ప్రధానోపాధ్యాయుల అనుమతితో సమీప పాఠశాల నుంచి పాల్గొనాలని సూచించారు. 

అల్లాదుర్గం మండలంలో..

అల్లాదుర్గం : కరోనా విజృంభించడంతో దాదాపుగా ఐదు నెలలుగా మూసి ఉన్న పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి. మండల పరిధిలోని పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలను పాటిస్తూ మాస్క్‌లను ధరించి పాఠశాలలకు వచ్చారు. విద్యాశాఖ సూచించిన  నూతన విద్యాసంవత్సరం ప్రారంభించడానికి కావాల్సిన ప్రణాళికపై దృష్టిసారించారు.

చిన్నశంకరంపేట మండలంలో..

చిన్నశంకరంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. 

మెదక్‌ పట్టణంలో..

మెదక్‌టౌన్‌ : కరోనా వ్యాప్తితో   మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు గురువారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో గురువారం  పట్టణంలోని పాఠశాలలకు ఉపాధ్యాయులు  హాజరైయ్యారు.

పాపన్నపేట మండలంలో.. 

పాపన్నపేట : వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ఈ సంవత్సరం కొనసాగించాలని మండల విద్యావలంటీర్ల్ల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం మండల ఇన్‌చార్జి విద్యాధికారి నర్సింహులుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు కాజిమ్‌ మాట్లాడుతూ గత ఏడు మాదిరిగా ఈ సంవత్సరం విద్యావలంటీర్లను కొనసాగించాలన్నారు. కరోనా మూలంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యావలంటీర్ల సంఘం ఉపాధ్యక్షుడు దత్తుకుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పండరి, మండల ప్రధాన కార్యదర్శి రాజు పాల్గొన్నారు. 


logo