శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 28, 2020 , 00:18:05

సిద్దిపేట జిల్లాలో ఉబికి వస్తున్న గంగమ్మ

సిద్దిపేట జిల్లాలో ఉబికి వస్తున్న గంగమ్మ

  • n కాళేశ్వరం జలాలకు తోడైన వరద నీరు
  • n గతంలో వంద ఫీట్లు వేసినా చుక్క నీరు రాని వైనం
  • n ఇయ్యాల బోర్లు ఎల్లబోస్తున్న దృశ్యం
  • n చెంబుతో ముంచుకునే రోజులొచ్చాయి
  • n జాలు, చెలిమెలు చూస్తే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
  • n పంట పొలాలకు పచ్చలహారం తొడిగినట్లుంది..
  • n పచ్చని పంట పొలాలతో కోనసీమను తలపిస్తున్నది..

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భా గంగా సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో జిల్లాలోకి గోదావరి జలాలు వచ్చి చేరాయి. దీంతో మండు వేసవిలో సైతం చెరువులు, కుంటలు నింపడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అవన్నీ ఇయ్యాల పొంగిపొర్లుతున్నాయి. తాజాగా జిల్లాలోని రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపుతున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు సాగు నీటి కష్టాలు దూరమయ్యాయి. గతంలో సాగు నీరు లేక భూములను పడావు పెట్టి భీవండి, సూరత్‌, ముంబై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. చాలా ఏండ్ల నుంచి నీళ్లు లేక రైతులు అరిగోస పడ్డారు. ఎ న్నాళ్లకు సాగు నీటి కష్టాలు తీరుతాయని ఎదురు చూస్తున్న రైతులకు స్వరాష్టంలో ఆ కష్టాలు తీరుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ రాష్ట్ర ము ఖ్యమంత్రి కావడంతో సాగు నీటి కష్టాలు తీరాయి. ఇవాళ ఎక్కడ చూసినా నిండిన చెరువులు, బావులు, బోర్లు కనిపించడంతో వలస పోయిన వారంతా తిరిగి సొంతూళ్లకు వచ్చి ఎవుసం పనులు చేసుకుంటున్నారు. పడావు భూములు మళ్లీ సాగులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పాటు తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుతున్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, సిద్దిపేట కోమటిచెరువు, దుబ్బాక రామసముద్రం, పెద్ద చెరువులతో పాటు, మర్కూక్‌ మండలంలోని చేబర్తి చెరువు, హుస్నాబాద్‌ ఎల్లమ్మ, చేర్యాల పెద్ద చెరువు, రాజగోపాల్‌పేట, గాగిళ్లాపూర్‌, కమలాయపల్లి తదితర పెద్ద చెరువులు అలుగులు పారుతున్నాయి. జిల్లాలో 30ఏండ్లకు పైగా నిండని చెరువులు ఇవాళ నిండి అలుగు పారుతున్నాయి. ఇవి కాకుండా జిల్లాలోని మరికొన్ని పెద్ద చెరువులు అలుగులు పారుతుండడంతో ఆ ప్రాంతంలో బావులు, బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. జిల్లాలో 3,484 చెరువులకుగాను 2,600 పైగా చెరువులు నిండాయి. వీటితో పెద్దవాగు, మోయ తుమ్మెద వాగు, కుడ్లేరు, కూడవెల్లి వాగులు పొంగి పొర్లడంతో పరివాహాక ప్రాంతంలో ఊటలు గణనీయంగా పెరిగాయి.దీంతో పచ్చని పంట పొలాలతో పచ్చల హారం తొడిగినట్లుగా సిద్దిపేట జిల్లా మారింది.

చెంబుతో ముంచుకునే రోజులొచ్చాయి

గోదావరి జలాలకు భారీ వర్షం నీళ్లు తోడు కావడంతో జిల్లాలో చెంబుతో ముంచుకునే రోజులొచ్చాయి. నిండిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలతో చాలా బావుల్లో ఎల్లబోయడంతో భూమికి సమాంతరంగా నీళ్లతో బావులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. పాడుబడిన బావులు, బోర్లలో నీళ్లు ఉబికి రావడంతో వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా జాలు పారుతున్న పంట పొలాలు, చెలిమెలలో నీళ్ల దృశ్యాలు కన్పిస్తున్నాయి. గతంలో వందల ఫీట్ల కొద్దీ లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రాకపోయేది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో గంగమ్మ పైపైకి వస్తుంది. చుక్క నీరు లేక ఎండిన బోర్ల నుంచి సైతం నీళ్లు వచ్చాయి. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో రెడ్డబోయిన కిషన్‌ వ్యవసాయ బోరు బావి నుంచి కరెంట్‌ నడుస్తున్న తరహాలో నీళ్లు పైకి వచ్చాయి. సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన ఓ రైతు బోర్‌బావి నుంచి, కొండపోచమ్మ రిజర్వాయర్‌ కట్ట కింద మరో రైతు బోర్‌ వావి నుంచి నీళ్లు పైకి వచ్చాయి. దీంతో స్థానిక రైతాంగమంతా సంబుర పడింది. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా మండలంలోని చెరువులు, చెక్‌డ్యాంలు నింపగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఊటలు గణనీయంగా పెరిగాయి. ఏండ్ల తర్వాత బావులు ఎల్లబోయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన వారు సైతం సొంత ఊర్లకు వచ్చి సాగు పనులు చేసుకుంటున్నారు. 

ఆరు గజాల నీళ్లు పెరిగినయి..

వర్షాలు ఈ యేడు మంచిగా పడ్డాయి. వర్షాలు పడకముందు నా బావి 7 గజాల కింద నీళ్లుండేవి. ఇప్పుడు ఆరు గజాలు నీళ్లు పెరిగి, పైకి ఒక్క గజం కింద ఉన్నాయి. బావి చెరువు కింద ఉండటంతో ఊట బాగా పెరిగింది.

-  రాములు, రైతు, గుండారం, బెజ్జంకి


logo