గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Aug 25, 2020 , 00:42:49

జలాశయాల్లో.. పుష్కలంగా నీళ్లు

జలాశయాల్లో.. పుష్కలంగా నీళ్లు

నారాయణరావుపేట : ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖ చిత్రం మారింది. అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీరు చేరింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్‌, జనరేటర్‌, ఇన్వర్టర్‌ దుకాణాలు బంద్‌ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నారు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం నారాయణరావుపేట మండల కేంద్రంతో పాటు జక్కాపూర్‌, గుర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్‌, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలోను ప్రభుత్వం సంక్షేమానికి  ప్రాధాన్యమిచ్చిందన్నారు.  జక్కాపూర్‌ అభివృద్ధి సహకరిస్తామన్నారు. పశువుల హాస్టల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దాసరి వాడ రోడ్డు పూర్తికి రూ.కోటి  మంజూరు చేశామన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలు, సంచార జాతులకు ప్రాధాన్యమిచ్చామన్నారు. చెరువు కింద కల్వర్టు నిర్మిస్తామన్నారు. 

మిషన్‌ కాకతీయతో చెరువు కట్టలకు బలం.. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సమృద్ధిగా వర్షాలు కురవడంతో  రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలో మొత్తం 3484 చెరువులకు గాను 3 వేలకు పైగా మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. చెరువులన్ని నిండుకున్నప్పటికీ ఒక చెరువు కూడా తెగలేదంటే మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ వల్లనేనన్నారు. పెద్దరాయుని చెరువు కోమటి చెరువును తలపిస్తుందని.. చెరువును సుంధరీకరణ చేస్తామన్నారు. గుర్రాలగొంది జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు దక్కించుకోవడం గ్రామస్తుల ఘనతేనన్నారు.   

మంత్రి వరాలు..

రూ.3 కోట్ల 50 లక్షలతో అదననంగా 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మరో ఆధునిక వ్యవసాయ గోదాంను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.12 లక్షలతో లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయం పునరుద్ధరణ చేస్తామన్నారు. కొత్త మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో 36 డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందజేశామన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేశామన్నారు. పల్లెలన్నింటినీ స్వచ్ఛంగా మార్చేందుకు ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, సెగ్రిగేషన్‌, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పల్లెల స్వచ్ఛత అంశంలో దేశానికే తెంలగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. 

కరోనా అంటే భయం వద్దు..

కరోనా భయపడే రోగం కాదు. ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మల్యాలలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.40 వేల నిధులు సమీకరించగా మంత్రి హరీశ్‌రావు రూ.60 వేలు అందించి గ్రామ ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా మెడికల్‌ హెల్త్‌ కిట్‌ అందజేశారు. పీహెచ్‌సీలో పరిధిలో రోజూ 50 కరోనా టెస్టులు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు ఒగ్గు బాలకృష్ణ, కూర మాణిక్యరెడ్డి, జడ్పీటీసీ కుంబాల లక్ష్మి, వైస్‌ ఎంపీపీ సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు కనకరాజు, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఇలా ..

గుర్రాలగొందిలో రూ.45 లక్షలతో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల అదనపు గదులు, బస్‌ షెల్టర్‌, లవ్‌ గుర్రాలగొంది సింబల్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గంగాభవానీ అమ్మవారిని దర్శించుకొని పెద్దరాయుని చెరువులో చేపపిల్లలు వదిలారు. రూ.2 కోట్ల 6 లక్షలతో నిర్మించిన 36 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. జక్కాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రూ.10 లక్షలతో విశ్వబ్రహ్మణ సంఘం, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు, పల్లె ప్రకృతి వనం, సామూహిక గొర్రెల షెడ్డు ప్రారంభించి జక్కాపూర్‌ చెరువులో చేప పిల్లలు వదిలారు. గోపులాపూర్‌లో సెగ్రిగేషన్‌ షెడ్డు, వైకుంఠధామం, మాటిండ్లలో బాల వికాస ప్లాంట్‌ ప్రారంభించి రెండు చోట్ల గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈజీఎస్‌ నిధులు రూ.2.5 లక్షలతో పాఠశాల వంట గది ప్రారంభించారు. వైకుంఠధామం, రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, సామూహిక గొర్రెల షెడ్డు, మహిళా సంఘం భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తాగునీటి క్యాన్లు, చెత్తబుట్టలు పంపిణీ చేశారు. సెగ్రి గేషన్‌ షెడ్డు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంక్షన్‌ హాల్‌కు శంకుస్థాపన చేసి డంపింగ్‌ షెడ్డును ప్రారంభించారు. పెద్దచెరువులో చేపలు వదిలారు. బంజేరుపల్లిలో గొర్రెల షెడ్డుకు శంకుస్థాపన, డంపింగ్‌ షెడ్డు, లక్ష్మిదేవిపల్లిలో రూ.26 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభించి, రూ.2 కోట్ల 67 లక్షలతో నిర్మించనున్న 53 డబుల్‌ బెడ్రూం ఇండ్లకు, గొర్రెల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5 లక్షలతో నిర్మించిన ఘణ వ్యర్థాల నిర్వహణ, రీసోర్స్‌ పార్కును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

జిల్లాలో రైల్వేలైన్‌ పనుల్లో వేగం పెంచాలి.. 

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లాలో రైల్వేలైన్‌ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ సధర్మరాయుడు, రైల్వే అధికార యంత్రాంగం సోమరాజు, ధర్మరావు, జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డితో కలిసి రైల్వేలైన్‌ పురోగతి, అభివృద్ధి ప్రగతి, రాజీవ్‌ రహదారి చీఫ్‌ ఇంజినీర్‌ మధుసూదన్‌రెడ్డితో రాజీవ్‌ రహదారి లేన్ల ప్రగతి, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రైల్వే పనులకు ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాలపై రైల్వే సీఈని ఆరా తీశారు. భూసేకరణ ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. రైల్వే అధికారులు, తహసీల్దార్లు సమస్యలేమైన ఉంటే పరిష్కరించాలని సూచించారు. రీచ్‌ 1,2,3 అంశాల పై సమీక్షిస్తూ రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు, శాఖలపరంగా అనుమతులు, జిల్లా నుంచి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలకు ఆమోదం తెలుపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. సోమవారం ఒకే రోజు 140 ఎకరాలను రైల్వే శాఖకు అందించిన రెవెన్యూ శాఖ యంత్రాంగం, అధికారులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రాజీవ్‌ రహదారి నుంచి వెళ్తున్న రైల్వేలైన్‌-గజ్వేల్‌ నుంచి సిద్దిపేటకు ఆర్‌వోబీ రోడ్‌ ఓవరు బ్రిడ్జి నిర్మాణంపై చర్చిస్తూ సర్వీసు రోడ్డుకు భూసేకరణ చేసి అప్పగిస్తామని, త్వరలో పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌ భూమిని అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. సిద్దిపేట పొన్నాల వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. దుద్దెడ సమీపంలో కలెక్టరేట్‌, పోలీసు కమిషనరేట్‌ వద్ద అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo