శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 24, 2020 , 00:50:03

లారీ డ్రైవర్‌ శంకర్‌ మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌ శంకర్‌ మృతదేహం లభ్యం

కోహెడ: ఈ నెల 15న మండలంలోని సిద్దిపేట హన్మకొండ రహదారి బస్వాపూర్‌ బ్రిడ్జిపై నుంచి మోయతుమ్మెద వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌ ముడిమాడుల శంకర్‌ శనివారం శవంగా దొరికాడు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, ఆర్డీవో జయచంద్రారెడ్డి అగ్నిమాపక దళ సిబ్బందితో శంకర్‌ కోసం గాలింపులు చేపట్టినా లాభం లేకపోయింది. వరద ఉధృతి తగ్గడంతో శనివారం ఫీడర్‌ చానల్‌ కింది భాగంలోని బట్టి మడుగులో  శంకర్‌ మృతదేహం గ్రామస్తుల కంటపడింది. వెంటనే ఎంపీపీ కొక్కుల కీర్తి, సర్పంచ్‌ దానబోయిన సత్తయ్య పోలీసులకు సమాచారం అందించారు. హుస్నాబాద్‌ ఏసీపీ సందెపోగు మహేందర్‌ సీఐ రఘుతో కలిసి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన శంకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు బస్వాపూర్‌ చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తృటిలో తప్పిన శంకర్‌ శవంగా దొరకడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామానికి చెందిన ముజాహిద్‌ పాషా, తాటిపాముల సుధీర్‌ శంకర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరగా, రూ.లక్షా 10వేలు అందించారు. ఆరెపల్లి సర్పంచ్‌ సరోజన, నాయకులు దారం రవీందర్‌, ఇక్బాల్‌ పాషా, లింగంగౌడ్‌, పి.శ్రీనివాస్‌, పి.నవీన్‌, దేవేందర్‌ ఉన్నారు.

 శ్రీనివాస్‌ మృతదేహం లభ్యం 

చిన్నకోడూరు: సికింద్లాపూర్‌- దర్గపల్లి గ్రామాల మధ్య గత ఆదివారం వాగులో గల్లంతైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్‌ (33) మృతదేహం ఆదివారం సికింద్లాపూర్‌ శివారులో లభ్యమైంది. వారం రోజులుగా శ్రీనివాస్‌ ఆచూకీ కోసం రెండు గ్రామాల సర్పంచులు, పోలీసులు, యువకులు గాలించారు. కాగా, సికింద్లాపూర్‌ సర్పంచ్‌ జయవర్ధన్‌రెడ్డి చెట్ల పొదల మధ్య శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు శ్రీనివాస్‌ మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చిన్నకోడూరు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.  


logo